(Source: ECI/ABP News/ABP Majha)
Praggnanandhaa: ప్రజ్ఞానంద దేశానికి గర్వకారణం, చెస్ చాంప్ ను అభినందిస్తూ ఇండిగో నోట్
Indigo note to Praggnanandhaa : అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ను గర్వించేలా చేసిన ప్రజ్ఞానంద తమ విమానంలో ప్రయాణించడంతో ఇండిగో సిబ్బంది ఎంతో సంతోషించారు.
Indigo note to Praggnanandhaa :
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రన్నర్‌గా నిలిచిన ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందపై దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభినందనలు కురిపిస్తున్నారు. అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ను గర్వించేలా చేసిన ప్రజ్ఞానంద తమ విమానంలో ప్రయాణించడంతో ఇండిగో సిబ్బంది ఎంతో సంతోషించారు. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలపాలకున్నారు. ఇటీవల ప్రజ్ఞానానంద ఇండిగో విమానంలో ప్రయాణించినప్పుడు.. అందులోని సిబ్బంది తమ అభిమానాన్ని తెలియజేస్తూ మనస్సుకు హత్తుకునేలా ఓ చక్కని నోట్ రాసి ఆయనకు అందించారు. హృదయపూర్వక అభినందనలను తెలిపారు.
యువ చెస్ సంచలనమైన ప్రజ్ఞానందకు వారు ఇచ్చిన నోట్‌లో.. 'డియర్ ప్రజ్ఞానంద, ఈరోజు మేము మీతో కలిసి విమానంలో ప్రయాణిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. గౌరవంగానూ ఉంది. మీరు దేశానికి గర్వకారణం. మీరు దేశం గర్వపడేలా చేశారు. ఇలాంటివి మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాము. మీరు నిజంగా మా అందరికి స్ఫూర్తి. మీ ఆటను ఇలాగే కొనసాగించడం. అలాగే స్ఫూర్తిదాయకంగా ఉండండి' అని ఇండిగో సిబ్బంది రాశారు. దానిపై కెప్టెన్, ఇతర విమాన సిబ్బంది సంతకాలు చేసి అందించారు.
చిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో రన్నర్‌గా నిలవడంపై ప్రజ్ఞానందపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ప్రజ్ఞానంద తల్లిదండ్రులకు ఎలక్ట్రిక్ కారు బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈవీ కారు కొనుగోలు చేయాలన్నది నా తల్లిదండ్రుల చిరకాల కల అని, దాన్ని నెరవేర్చినందుకు ధన్యవాదాలు అంటూ ప్రజ్ఞానంద ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. అలాగే తమిళనాడు సీఎం ప్రజ్ఞానందకు రూ.30లక్షల చెక్‌కు కానుకగా ఇచ్చారు.
ఇటీవల అజర్ బైజాన్ దేశంలో జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానానంద(18) రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్(32) విన్నర్ అయ్యారు. అయితే కార్ల్‌సన్ గెలిచినప్పటికీ చిన్న వయస్సున్న ప్రజ్ఞానానంద కార్ల్‌సన్‌తో పోటాపోటీగా ఆడి ఫైనల్ వరకు వెళ్లి తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజ్ఞానానందపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఎంతో మంది అభినందిస్తున్నారు.