Cabinet Meet Today: నేడు మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ - ఊహించని పరిణామాల ప్రచారం, అందరిలో ఉత్కంఠ!
మంత్రివర్గ సమావేశ అజెండా బయటకి రాలేదు. కొన్ని కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మంత్రివర్గ ఆమోదం చేసుకోవడం కోసం ఈ కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నేడు (సెప్టెంబరు 18) ప్రారంభమైన వేళ కేంద్ర ప్రభుత్వం నేడు మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనుంది. ఓవైపు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగానే, నేడు కేబినెట్ భేటీ ఉంటుందని ప్రకటన వెలువడింది. సోమవారం (సెప్టెంబర్ 18) సాయంత్రం 6.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం ఉండనుంది. అయితే, ఈ మంత్రివర్గ సమావేశ అజెండా కూడా ఇంకా బయటకి రాలేదు. కొన్ని కీలక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి మంత్రివర్గ ఆమోదం చేసుకోవడం కోసం ఈ కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపు 8 బిల్లులపై చర్చించి ఆమోదం తెలుపడానికి 5 రోజుల పాటు పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నట్లుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గతంలోనే ప్రకటించారు. వీటిలో అడ్వకేట్స్ (సవరణ) బిల్లు - 2023, ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు - 2023, చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు - 2023 వంటి బిల్లులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఊహించని పరిణామాలూ జరిగే అవకాశం
ఇవే కాకుండా ప్రభుత్వం ఊహించని రీతిలో ఏవైనా నిర్ణయాలు తీసుకుంటుందా అని కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లుతో పాటు దేశం పేరును ఇండియాగా కాకుండా భారత్ అని మార్చేలా నిర్ణయాలు ఉండబోతున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, వీటిపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు.
ఇక ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి సెప్టెంబరు 22 వరకూ జరగనున్నాయి. నేటి సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో జరగ్గా, రేపటి నుంచి (సెప్టెంబరు 19) పార్లమెంటు సమావేశాలు కొత్త పార్లమెంటు భవనంలో జరగనున్నాయి.