Kolkata Doctor Case: కోల్‌కతా ఘటనపై సుప్రీం ఆగ్రహం- వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు- తెలుగు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి చోటు
RG Kar Medical College: కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పోలీసులు, ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దేశవ్యాప్తంగా వైద్యలు భద్రతపై టాస్క్ ఫోర్స్ వేస్తున్నట్టు ప్రకటించింది.
Kolkata Doctor Rape Murder Case Update: కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్య కేసుపై సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించింది. సూమోటోగా తీసుకున్న కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు పని ప్రదేశాల్లోనే భద్రత లేకపోయే వారికి సమానత్వం ఎక్కడ వస్తుందని ప్రశ్నించారు.
దర్యాప్తు సంస్థకు కీలక ఆదేశాలు
విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోల్‌కతా అత్యాచారం కేసును హైకోర్టు విచారిస్తోందని తెలుసు కానీ ఈ దుర్ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఓ వైద్యుల భద్రతకు సంబంధించిన అంశం కావడంతో సూమోటోగా తీసుకొని విచారిస్తున్నాం అని అన్నారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ కూడా ఆలస్యంగా దాఖలయ్యింది. ఆ ఎఫ్‌ఐఆర్‌లో హత్య ప్రస్తావన ఉందా?. కేసును ఆత్మహత్యగా చెబుతున్నప్పుడు ప్రిన్సిపాల్ ఏమి చేస్తున్నారనేది అతిపెద్ద ప్రశ్న" అని చీఫ్ జస్టిస్ అడిగారు. దీనిపై విచారణ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ తన విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును కోర్టు ముందు ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు స్థితిని కూడా తెలియజేయాలని సూచించింది. అనంతరం కేసు విచారణమను గురువారానికి వాయిదా వేశారు.
నిరసన తెలిపే వ్యక్తులపై బలప్రయోగం వద్దు : చీఫ్ జస్టిస్
శాంతియుతంగా నిరసన తెలిపే వ్యక్తులపై బలప్రయోగం చేయొద్దని ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. మీడియాలో విమర్శించే వ్యక్తులపై కూడా చర్యలు తీసుకోవద్దని సూచించారు. బాధితురాలి కుటుంబానికి రాత్రి 8.30 గంటలకు మృతదేహం అప్పగించారని తర్వాత 11.45 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, అది కూడా తండ్రి ఫిర్యాదుపైనేనని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ సమయంలో ఏం జరిగింది? సీజేఐ ప్రశ్నించారు. అంతేకాకుండా ఓ గుంపు వచ్చి మెడికల్ కాలేజీని ధ్వంసం చేస్తే పోలీసులు ఏం చేశారని నిలదీశారు. నేరం జరిగిన ప్రాంతానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ సమాచారం లేకుండా 10 వేల మంది గుమిగూడినట్టు చెప్పుకొచ్చారు. అసలు ఏంజరిగిందో గురువారం నివేదిక ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.
వైద్యుల భద్రత కోసం టాస్క్ ఫోర్స్
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో యువ వైద్యుల దుస్థితి గురించి మాట్లాడారు. వాళ్ల పరిస్థితి ఏం బాగాలేదని అన్నారు. వారంతా ఇంటర్న్‌లు, రెసిడెంట్ డాక్టర్లు అన్నింటికంటే ముఖ్యంగా మహిళా డాక్టర్లు అని తెలుసున్న్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. యువ వైద్యుల్లో చాలా మంది 36 గంటల పాటు పని చేస్తున్నారని తెలుస్తోంది. అక్కడ కూడా సరైన వసతులు భద్రత లేదనేది సమాచారం. సురక్షితమైన పని పరిస్థితులు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యల కోసం జాతీయ ప్రోటోకాల్ డెవలప్ చేయాల్సి ఉంది. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ లేకుండా వారు ఉద్యోగాలకు వెళ్లలేని దుస్థితి ఉదంటే మనం వారి సమానత్వాన్ని నిరాకరిస్తున్నామని అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమన్నారు చీఫ్ జస్టిస్. వీటన్నింటిపై నేషనల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి చూస్తున్నాం. సీనియర్ మరియు జూనియర్ వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధివిధానాలను ఈ టాస్క్‌ఫోర్స్ సూచిస్తుంది. అన్నారు.
విధుల్లో చేరాలని వైద్యులకు సుప్రీంకోర్టు రిక్వస్ట్
దయచేసి విధులకు రండి... దేశ ప్రజల తరఫున వైద్యులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేశారు. "మీ భద్రతపై దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని నమ్మండి. రోగులు నష్టపోతున్నారు. కచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సేవలు రద్దు చేయడం సరికాదు. మీరు విధుల్లోకి రండి" అని సీజేఐ విజ్ఞప్తి చేస్తున్నారు.