RBI Blockchain: నీరవ్ మోదీ తరహా దొంగల కోసం 'బ్లాక్ చైన్' వల పన్నుతున్న ఆర్బీఐ!
RBI Blockchain: పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)లో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కుంభకోణం గుర్తుందా? ఇలాంటి ఘోరాలు ఆపేందుకు ఆర్బీఐ ఓ పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.
RBI taps top banks including HDFC, ICICI, SBI for blockchain based trade financing project : పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB)లో నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కుంభకోణం గుర్తుందా? బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకొని వీరిద్దరూ వేల కోట్ల రూపాయాలను కొల్లగొట్టారు. స్కామ్ బయటపడగానే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు పారిపోయారు.
ఇలాంటి దొంగలు, మోసగాళ్లను పట్టుకొనేందుకు ఆర్బీఐ ఓ అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ సహా 12 పెద్ద బ్యాంకులతో కలిసి బ్లాక్‌చైన్ టెక్నాలజీ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LOC) మోసాలను అడ్డుకొనేందుకు పకడ్బందీ ప్రణాళికను అమలు చేయనుంది.
బెల్జియానికి చెందిన సెటిల్‌మింట్, అమెరికాకు చెందిన కోర్డా టెక్నాలజీస్, ఐబీఎం సంయుక్తంగా బెంగళూరులోని ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్‌లో ఈ బ్లాక్‌చైన్ ప్రాజెక్టుకు సాయం చేయనున్నాయి. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఈ ప్రాజెక్టులో భాగం అవుతున్నాయి. దీనిని 'ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్'గా పిలుస్తున్నారు.
ఈ బ్లాక్‌చైన్ టెక్నాలజీలో లావాదేవీల డేటా బ్లాక్స్ 'చైన్స్' రూపంలో నిల్వచేస్తారు. దాంతో నగదు ప్రవాహం తీరు ఎలా ఉందో అన్ని బ్యాంకుల వారు తనిఖీ చేయొచ్చు. ఆర్బీఐ నేతృత్వంలో ఎంపిక చేసుకున్న బ్యాంకులతో వేర్వేరు టెక్నాలజీ కంపెనీలు పనిచేస్తాయి.
Also Read: ఝన్‌ఝున్‌వాలా స్టాక్..! మల్టీబ్యాగర్ రిటర్న్స్‌కు రెడీగా ఉందట! ఇన్వెస్ట్ చేస్తారా!!
లెటర్స్ ఆఫ్ క్రెడిట్ పత్రాల టాంపరింగ్‌ను గమనించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ పత్రాలు దుర్వినియోగం కాకుండా బ్లాక్ చైన్ సాంకేతికత సాయపడుతుంది. ఇక ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ టెక్నాలజీని అమలు చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనిద్వారా డిజిటల్ రూపంలో ఇకపై లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను జారీ చేస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ చైన్ సాంకేతికతకు క్రేజ్ పెరుగుతోంది. విశ్వసనీయత, ఎలాంటి లోపాలు లేకపోవడం, పటిష్ఠమైన భద్రత ఉండటంతో ఆర్థిక వ్యవస్థల్లో దీనిని అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఆర్బీఐ త్వరలో ఆవిష్కరించబోతున్న డిజిటల్ రూపాయికీ ఇదే టెక్నాలజీని వాడుతున్న సంగతి తెలిసిందే.
మొత్తం 15 బ్యాంకులు కలిసి ఒక కొత్త కంపెనీని మొదలు పెడుతున్నాయి. అందులో బ్లాక్‌చైన్ సాయంతో లెటర్స్ ఆఫ్ క్రెడిట్‌ను ప్రాసెస్ చేస్తాయి. ఇండియన్ బ్యాంక్స్ బ్లాక్‌చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ (IBBIC)గా దీనిని పిలుస్తారని తెలుస్తోంది.
Also Read: వర్క్ ఫ్రం హోమ్‌ను చట్టబద్ధం చేయనున్న అక్కడి పార్లమెంటు!