Krishnarajapuram Railway Station: కృష్ణ రాజపురం కాదిది, కష్టాల రాజపురం - తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఇదో నరకం
Krishnarajapuram Railway Station: కృష్ణ రాజపురం రైల్వే స్టేషన్.. రోజూ వేలమంది ప్రయాణికులు.. ఎక్కువ శాతం తెలుగు వాళ్లే.. కనీసం ఒక లిఫ్ట్ గానీ..ఎస్కెలేటర్ గానీ ఉండదు.

Krishnarajapuram Railway Station: పేరుకు స్మార్ట్ సిటీ కానీ ఇక్కడి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల ఇబ్బందులు మామూలుగా ఉండవు. అదే బెంగుళూరు లోని కృష్ణ రాజపురం రైల్వే స్టేషన్. ప్రతీ రోజూ తెలుగు ప్రాంతాల నుంచి అనేక పనులపై బెంగుళూరు వెళ్లే ప్రజలు ఎక్కువగా దిగేది ఈ స్టేషన్‌లోనే. సిటీలో KSR బెంగుళూరు, SMVB, బెంగుళూరు కాంట్, యశ్వంత్‌పూర్ లాంటి స్టేషన్‌లు ఎన్నో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేది కృష్ణ రాజపురంలోనే. అలాగే IT కంపెనీలు ఎక్కువగా ఉండే వైట్ ఫీల్డ్‌కి ఈ ఏరియా చాలా దగ్గర ఉండడంతో KRపురం చుట్టుపక్కల తెలుగు IT ఫ్యామిలీలు తమ నివాస ప్రాంతంగా ఎంచుకుంటాయి. అలాగే దూర ప్రాంతాలైన బిహార్ లాంటి చోట్ల నుంచి బతుకు తెరువు కోసం వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా దిగేది కృష్ణ రాజపురం స్టేషన్‌లోనే. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగళూరులో మధ్య తరగతి ప్రజల డెస్టినేషన్‌గా కృష్ణ రాజపురం స్టేషన్‌ను చెప్పుకోవచ్చు. ప్రతీ రోజూ కొన్ని వేల మంది ఈ స్టేషన్ నుంచి ప్రయాణిస్తారు. అలాంటి ఈ స్టేషన్‌లో కనీసం ఒక్క ఎస్కెలేటర్ గానీ లిఫ్ట్ గానీ ఉండవు. ఏళ్ల తరబడి అక్కడి ప్రజల కష్టాలు అలాగే ఉంటున్నాయి.

వృద్దులు, చంటి బిడ్డ తల్లుల కష్టాలు ఈ స్టేషన్‌లో మరీ దారుణం
బెంగుళూరులోని ఇతర స్టేషన్‌ల నుంచి బయలుదేరే ట్రైన్స్ కృష్ణ రాజపురం వచ్చే సరికి ఫుల్ అయిపోతాయి. అలాగే ఆంధ్ర,తెలంగాణ,తమిళనాడు, బిహార్ ఢిల్లీ లాంటి రాష్ట్రాల నుంచి కిటకిటలాడుతూ వచ్చే ట్రైన్స్ కూడా కృష్ణ రాజపురం స్టేషన్‌లో ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతాయి. అంత రద్దీగా ఉండే ఈ స్టేషన్‌లో కనీసం ఒక్క లిఫ్ట్ కూడా ఉండదు. బెంగుళూరు వైవు వచ్చే ట్రైన్స్ అన్నీ 4వ నెంబర్ ప్లాట్ ఫామ్‌లోనే ఆగుతాయి. అది రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కానీ బెంగుళూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే లాంగ్ జర్నీ ట్రైన్స్ అన్నీ రెండు లేదా మూడో నెంబర్ ప్లాట్ ఫామ్స్‌లో ఆగుతాయి. ఆ ట్రైన్స్ అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వచ్చి వెంటనే బయలుదేరి పోతుంటాయి. దానితో రోడ్ సైడ్ నుంచి 4వ నెంబర్ ప్లాట్ ఫామ్‌లోకి ఎంటర్ అయిన ప్రయాణికులు ఎత్తయిన మెట్లు ఎక్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదుగా రెండు, మూడు ప్లాట్ ఫామ్స్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ కనీసం ఒక లిఫ్ట్ గానీ ఎస్క్ లేటర్ గానీ ఉండవు. దానితో వృద్దులు, చంటి బిడ్డ తల్లులు ఆయాస పడుతూనే విపరీతమైన రద్దీలో ప్లాట్ ఫామ్స్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. దానితో కృష్ణ రాజపురం నుంచి ఫ్యామిలీతో ప్రయాణం అంటేనే భయం వేస్తుంది అంటున్నారు బెంగుళూరులో IT ఎంప్లాయిగా పనిచేస్తున్న గోదావరి జిల్లాలకు చెందిన సుధాకర్.

రెండు, మూడు ప్లాట్ ఫామ్స్ వద్ద రద్దీని తట్టుకోవడానికి పోలీసులను పెట్టి కంట్రోల్ చేస్తుంటారు అంటేనే ఇక్కడ ఎంతటి బిజీగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. పోనీ KR puram నుంచి వేరే స్టేషన్‌లకు వెళ్లి ట్రైన్ పట్టుకుందామా ఆంటే బెంగుళూరు ట్రాఫిక్‌లో ఫ్యామిలీ, లగేజ్‌లతో అదీ కష్టమే.

అభివృద్ధి పనులకు 20 నెలల క్రితమే ప్రధాని శంకుస్థాపన కానీ ఎక్కడి పనులు అక్కడే
ప్రధాని మోదీ స్వయంగా 20 నెలల క్రితం ఆంటే 2024 ఫిబ్రవరిలో కృష్ణ రాజపురం అభివృద్ధి పనులకు ఫౌండేషన్ వేశారు. సౌత్ వెస్ట్రన్ రైల్వే కూడా బెంగుళూరులోని 4ప్రధాన స్టేషన్‌లలో డెవలప్మెంట్ కోసం అమృత్ భారత్ పథకం అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో కృష్ణ రాజపురం కూడా ఉంది. ఈ స్టేషన్ కోసం 21కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కానీ ఆ పనులు నత్త నడకన సాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అక్కడి స్థానికులు దీనిపై సమాధానం కోరుతూ అధికారులకు లెటర్ కూడా రాసారు. అంతే కాదు రైల్వే మంత్రిని ఒకసారి KR పురం స్టేషన్‌కు వచ్చి ప్రయాణికులు పడుతున్న కష్టాలను స్వయంగా చూడాలని డిమాండ్ చేశారు. మరి అతి ముఖ్యమైన కృష్ణ రాజపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు పడుతున్న కష్టాలను ఇప్పటికైనా రైల్వే అధికారులు గుర్తించి ఇక్కడో లిఫ్ట్ గానీ ఎస్క్ లేటర్ గానీ ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి.





















