JN1 Variant Covid Cases: కలవరపెడుతోన్న కొత్త వేరియంట్ జేఎన్1, రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
Covid19 Cases in India: భారత్‌లో మరోసారి కొవిడ్19 కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వేరియంట్ జేఎన్1 కేసులు (JN1 Covid Variant) కేరళలో వెలుగుచూశాయి.

JN1 variant cases in Kerala: న్యూఢిల్లీ: భారత్‌లో మరోసారి కొవిడ్19 కేసులు పెరుగుతున్నాయి. దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,828కి చేరింది. కొన్ని మరణాలు కూడా సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్1 కేసులు (JN1 Covid Variant) కేరళలో వెలుగుచూశాయి. మరోవైపు పలు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం హెచ్చరించింది. అసలే పండుగ సీజన్ లు ముందున్నాయని, కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. జిల్లా తరహాలోనే ఇన్‌ఫ్లుయెంజా తరహా నమోదు చేసి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను అలర్ట్ (India on alert as JN.1 Covid variant emerges) చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
కొత్త వేరియంట్ ను తేలికగా తీసుకోవద్దని, ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించడం మంచిదని నిపుణులు చెబుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం అయితే కొవిడ్ కేసుల కట్టడిలో ఓ అడుగు ముందుకేసింది. కేరళ సహా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులతో పాటు దీర్ఘకాలిక రోగాలతో బాధ పడుతున్న వాళ్లు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని స్పష్టం చేసింది. కర్ణాటక ఆరోగ్యమంత్రి దినేశ్ గుండు రావ్ ఈ ప్రకటన చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వీలైతే శానిటైజర్ వాడాలని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారుల పట్ల తల్లితండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కేరళలో కరోనా వైరస్ సబ్ వేరియంట్ జేఎన్1 కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు భారత్ సహా 38 దేశాల్లోనూ జేఎన్1 వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అవసరం ఉన్న చోట వీలైనన్ని ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ఇంకా అనుమానం ఉన్న పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి వేరియంట్ ను తెలుసుకునేందుకు జీనోమ్ సిక్వెన్స్ టెస్టులు నిర్వహించాలని చెప్పింది. త్వరలో పండుగ సీజన్ ఉండటంతో ఇప్పటికే నియంత్రణ చర్యలు చేపట్టాలని, లేకపోతే రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అలర్ట్ చేసింది. వయసు పైబడిన వారిని, చిన్నారులను, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ తాజా సూచనలో పేర్కొంది.
ఆసుపత్రులలో కరోనా చికిత్సలకు ఏర్పాట్లతో పాటు, బెడ్స్ ఏర్పాటు చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ అమెరికాలో తొలిసారి ఈ వేరియంట్ కేసు నమోదైంది. ఇటీవల చైనాలోనూ జేఎన్1 వేరియంట్ కేసులు గుర్తించడంతో కేంద్రం అప్రమత్తమైంది. గత రెండు వారాల నుంచి చైనా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి.
JN.1, ఒమిక్రాన్ BA.2.86 వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన కొత్త సబ్ వేరియంట్ ఈ జేఎన్1. దీనిని పిరోలా అని కూడా పిలుస్తున్నారు. ఆసియా దేశాలలో జేఎన్1 కేసులు ఎక్కువగా నమోదు కావడం వైద్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

