Gujarat News: లెక్క తప్పిన మ్యాథ్స్ టీచర్ చేష్టలు- క్లాస్‌లోనే ఐ లవ్ యూ చెప్పాలంటూ విద్యార్థిపై వేధింపులు!
Gujarat News: తరగతి గది నిండా పిల్లలు ఉన్నారు. పాఠాలు చెప్పాల్సిన మ్యాథ్స్ టీచర్ లెక్క తప్పాడు. ఐ లవ్ యూ చెప్పమంటూ విద్యార్థిని అందరి ముందు వేధించాడని బాధిత బాలిక చెబుతోంది. చివరకు ఏం జరిగిందంటే..?
Gujarat News: తరగతి గది నిండా పిల్లలు ఉన్నారు. గణితం చెప్పేందుకు తరగతికి వచ్చిన ఓ ఉపాధ్యాయుడు.. ఓ బాలికను నిల్చొమ్మని చెప్పాడు. అంతా ఆసక్తిగా ఏవైనా ప్రశ్నలు అడుగుతారేమోనని చూస్తుండగా.. ఐ లవ్ ఫార్ములా చెప్పమంటూ అడిగాడు. కానీ బాలికకు మాత్రం ఐ లవ్ యూ చెప్పమని వేధించినట్లు చెబుతోంది. ఉపాధ్యాయుడిపై భయంతో ఎవరూ నోరు మెదపలేదు. సదరు బాలిక ఏడుస్తూనే ఉండిపోయింది. తర్వాత ఇంటికెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా వాళ్లు పాఠశాలకు వచ్చి గొడవ చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిని అధికారులు తొలగించారు. కానీ ఉపాధ్యాయుడు బాలికను ఐ లవ్ యూ అని చెప్పమనలేదని, ఫార్ములాలు అంటే ఇష్టమని మాత్రం చెప్పాలని చెప్పినట్లు తోటి విద్యార్థులు వివరించారు.
అసలేం జరిగిందంటే..?
గుజరాత్ లోని రాజ్ కోట్ కర్ణావతి స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు... పాఠశాలలో గణితం చెబుతున్న ఉపాధ్యాయుడిపై ఆరోపణలు చేశారు. తరగతిలో అందరి ముందు తమ కూతురిని ఐ లవ్ యూ చెప్పమని వేధించినట్లు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు... తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే సీసీటీవీ ఫుటేజీలో సౌండ్ స్పష్టంగా లేదు. అయితే విద్యార్థిని చేస్తున్న ఈ ఆరోపణలను తోటి విద్యార్థులు కూడా సమర్థించడం లేదు. కానీ విద్యార్థి, ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ కూతురును వేధించినట్లు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే గణిత ఉపాధ్యాయుడు బాల్ ముకుంద్ ను సస్పెండ్ చేశారు.
కానీ గణిత ఉపాధ్యాయుడు బాల్ ముకుంద్ మాత్రం తాను... సదరు బాలికతో ఫార్ములాను ప్రేమిస్తున్నట్లు చెప్పమని అడిగానని.. దాన్ని బాలిక తప్పుగా తీసుకుందని చెబుతున్నారు. అలాగే స్కూల్ ట్రస్టీ అశోక్ భంభార్ మాట్లాడుతూ.. 8వ తరగతి విద్యార్థినికి ఫార్ములా అర్థం కాకపోవడంతో టీచర్ 'ఐ లవ్ ఫార్ములా' అని చెప్పమని అడిగాడని వివరించారు. ‘ఐ లవ్ యూ’ అని విద్యార్థిని చెప్పమని ఎప్పుడూ చెప్పలేదన్నారు.
మూడు నెలల క్రితం హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కీచక పర్వానికి తెరతీశాడు. బాలికను లైంగికంగా వేధించాడు. ఫోన్లు, మెసేజ్ లు చేస్తూ వికృతంగా ప్రవర్తించాడు. చివరికి జైలు పాలయ్యాడు. హైదరాబాద్ లో మైనర్ బాలికను వేధించిన పాఠశాల ఉపాధ్యాయుడికి పోక్సో కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 25 ఏళ్ల యాచారం రమేష్ అనే ఉపాధ్యాయుడు 17 ఏళ్ల బాలికను వేధిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని బాలిక ఇంటికి కూడా వెళ్లి బెదిరించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు రమేష్ ను హెచ్చరించి వదిలేశారు. మరోసారి అలా చేస్తే పోలీసు కేసు పెడతామని బెదిరించారు. బాలిక నుండి వచ్చిన బెదిరింపుల తర్వాత యాచారం రమేష్ మరింత రెచ్చిపోయాడు. మెసేజ్ లు, కాల్స్ చేస్తూ వేధిస్తూనే వచ్చాడు. గతంలోని కాల్ రికార్డింగ్ లను ఆమె కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో వారు రమేష్ పై మీర్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉపాధ్యాయుడికి మూడేళ్ల జైలు..
ఉపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణ అనంతరం ఉపాధ్యాయుడైన యాచారం రమేష్ ను పోక్సో కోర్టు (Hyderabad POCSO Court) మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రమేష్ కు రూ. 20 వేలు జరిమానా విధించింది.