Indian Constitution: భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పెళ్లి.. రక్తదానమే గిఫ్ట్.. అవయవ దానమే ఆశీర్వాదం
ఒడిశాలో ఓ జంట.. తమ వివాహాన్ని ఆదర్శంగా చేసుకున్నారు. ఏడు అడుగులకు బదులుగా.. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒకటయ్యారు.
ఒడిశాకు చెందిన ఓ జంట.. ఏడు అడుగులకు బదులుగా.. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. వివాహానికి వచ్చిన అతిథులు.. బహుమతులు ఇవ్వొద్దని.. రక్తదానం చేయాలని కోరారు. తమ వివాహ వేడుకను భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
బిజయ్ కుమార్ (29), శృతి సక్సేనా (27) ఇద్దరూ చెన్నైలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. బిజయ్ ఒడిశాలోని బెర్హంపూర్ నివాసి కాగా, శృతి కుటుంబం ఉత్తరప్రదేశ్‌కు చెందినది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బంధువులకు, సన్నిహితులకు చెప్పారు. అయితే పెళ్లి రోజున అతిథులంతా వచ్చారు. కానీ వివాహ వేదిక వద్దకు చేరుకుని.. షాక్ అయ్యారు.
వివాహ వేదిక వద్ద.. కళ్యాణ మండపం కనిపించకుండా పోవడంతో కొంతమంది ఆశ్చర్యానికి గురయ్యారు. కళ్యాణ మండపాన్ని పూలతో అలకరించారు. కానీ హిందూ సంప్రదాయం ప్రకారం.. అక్కడ పెళ్లి జరగలేదు. ఆ కొత్త జంట కోరుకున్న పద్ధతిలోనే జరిగింది.
బిజయ్ కుమార్, శృతి సక్సేనా.. పెళ్లికి ఏడు అడుగులు లేవు, మంత్రాలు చదివేందుకు పంతులూ లేడు. వరుడు, వధువు ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకున్నారు. తరువాత ఇద్దరూ.. భారత రాజ్యాంగం ఆధారంగా వివాహ ప్రమాణాలు చేశారు. తమ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన వారు.. ఖరీదైన బహుమతులు ఇవ్వడానికి బదులు రక్తదానం చేయాలని ఈ జంట అతిథులను కోరింది. అంతేకాదు.. వారి మరణానంతరం వారి శరీర అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేయవలసిందిగా అతిథులను అభ్యర్థించారు. భారత రాజ్యాంగం సాక్షిగా ఒకటయ్యారు.
మరో విషయం ఏంటంటే.. రిసెప్షన్ వేదిక దగ్గర జరిగిన రక్తదాన శిబిరంలో బిజయ్ మరియు శ్రుతి కూడా వారి వివాహం తర్వాత రక్తదానం చేశారు. 'నేను 2015లో చెన్నైలో బిజయ్‌ని కలిశాను. కలిసి పని చేస్తున్నాము. మా కామన్‌ఫ్రెండ్స్ మమ్మల్ని ఒకచోట చేర్చారు. మా వివాహం జరిగిన తీరు ఎంతో ఆనందాన్నిచ్చింది. మేం భారత రాజ్యంగంపై ప్రమాణం చేసాం. ఆపై రక్తదానం చేశాం. సమాజం పట్ల మా బాధ్యతలను నెరవేర్చాం. ఇది ఇతరులకు ఆదర్శంగా ఉంటుందని ఆశిస్తున్నాను. నేను సంతోషంగా ఉన్నాను.' అని వధువు శ్రుతి చెప్పారు.
వరుడి తండ్రి మోహనరావు మాట్లాడుతూ.. 2019లో తన పెద్ద కొడుకు కూడా వధువు కుటుంబ సభ్యులను ఒప్పించి రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఇదే పద్ధతిలో వివాహం చేసుకున్నాడని తెలిపారు. 'ఈసారి కూడా శ్రుతి కుటుంబ సభ్యులను భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పెళ్లి జరిపిస్తామని ఒప్పించాం. కులం, కట్నం, ఇతర సంప్రదాయ ఆచారాలు లేకుండా ఇలాంటి వివాహాలు జరగాలి. సాంఘిక దురాచారాలను పారద్రోలండి' అని మోహనరాజు చెప్పారు.
Also Read: PM Modi Covid Meeting: ఒమిక్రాన్‌పై మోదీ కీలక సమీక్ష.. రాత్రి కర్ఫ్యూపై నిర్ణయం??