Bihar Two Wifes One Husband : బీహార్‌లో బతుకు జట్కా బండి మార్క్ తీర్పు - ఇద్దరు భార్యలకు చెరో పదిహేను రోజులు భర్త కేటాయింపు !
"బతుకు జట్కా బండి" రియల్ స్టోరీస్ అనే చెబుతూంటారు. కానీ నమ్మబుద్ది కాదు. బీహార్‌లో ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయిన వ్యక్తికి కౌన్సిలర్లు చూపిన పరిష్కారం తెలుసుకంటే... ఇలాంటివి నిజంగానే ఉంటాయని నమ్మక తప్పదు.
" ఏవండి.. ఆవిడ వచ్చింది" అని తెలుగులో ఓ సినిమా ఉంది. శోభన్ బాబు హీరో. వాణిశ్రీ, శారద హీరోయిన్లు. హీరో ఇద్దర్నీ పెళ్లి చేసుకుంటాడు. కొద్ది రోజులు వాణిశ్రీ దగ్గర.. మరికొన్ని రోజులు శారద దగ్గర ఉండాలని ఒప్పందం. ఇది సినిమానే కానీ.. అచ్చంగా ఇలాంటి కథ బీహార్‌లో జరిగింది. ఇద్దరు భార్యలకు నెలలో చెరో పదిహేను రోజుల పంచి ఇచ్చేశారు పెద్దలు. ఈ పెద్దలెవరో కాదు.. ప్రభుత్వం అధికారంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ పెద్దలు.
బీహార్‌లోని ( Bhavanipur ) భవానిపూర్ ధానా అనే ఊళ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ( Family Counselling Center ) ఓ మహిళ ఆశ్రయించారు. తన భర్త తన దగ్గరకు రావడం లేదని ఫిర్యాదు చేసింది. తన భర్తకు మొదటి భార్య ఉందని.. ఆ విషయం చెప్పకుండా తనను రెండో పెళ్లి చేసుకున్నారని ఫిర్యాదు చేసింది. కొద్ది రోజులు సఖ్యతగా ఉండి ఇప్పుడుతన వద్దకు రావడం లేదని ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఫ్యామిలీ కౌన్సిలర్లు వెంటనే భర్తను ( Husband ) పిలిపించారు. భర్తతో పాటు మొదటి భార్య కూడా వచ్చింది. అనేక విధాలుగా కౌన్సెలింగ్ జరిపిన మీదట... అధికారులు ఓ తీర్పు చెప్పారు.
కౌన్సిలర్లు చెప్పిన సొల్యూషన్ ఏమిటంటే... భర్త నెలలో మొదటి పదిహేను రోజులు మొదటి భార్యకు ( First Wife ) .. రెండో పదిహేను రోజులు రెండో భార్యకు ( Second Wife ) కేటాయించాలి. అలాగే రెండు కుటుంబాల ఖర్చులూ చూసుకోవాలి. ఈ తీర్పును రెండో భార్య ఆనందంగా అంగీకరించింది. మొదటి భార్య వ్యతిరేకిస్తుందేమో అనుకున్నారు.. కానీ ఆమె కూడా సంతోషంగా అంగీకరించింది. దీంతో తాము బతుకు జట్కా బండి తరహాలో తీర్పు చెప్పామేమో అని కంగారు పడిపోయిన ఆ పెద్దలకు టెన్షన్ తీరిపోయింది.
తాము ఇచ్చిన తీర్పు ప్రకారం ఇద్దరు భార్యలను వేర్వేరు ఇళ్లలో పెట్టి.. చెరో పదిహేను రోజులు ( Fifteen Days ) సమయం కేటాయించి.. సుఖంగా బతకమని తీర్పు భర్త చేతిలో పెట్టి పంపేశారు. ముందు సమస్యలు రాకుండా ఈ తీర్పునకు అంగీకరిస్తున్నట్లుగా సంతకాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడీ తీర్పు వైరల్ అయింది. బేసిక్‌గా అయితే రెండో పెళ్లి చేసుకున్నందుకు అతనిపై కేసు పెట్టాలి. కానీ బీహార్ ( Bihar )అధికారులు కొత్తగా ఆలోచించారనుకోవాలి.