Viral News: సంచలనం, తల్లి డెడ్ బాడీతో ఏడాది పాటు ఇంట్లో ఉన్న అక్కాచెల్లెల్లు
Uttar Pradesh Womens: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి మృతదేహాన్ని ఏడాది పాటు ఇంట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
Mother Dead Body: ఎవరైనా చనిపోతే మామూలుగా ఏం చేస్తారు? డెడ్ బాడీకి ఆయా మతాలు, కులాల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేస్తారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. వారణాసిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి మృతదేహాన్ని ఏడాది పాటు ఇంట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఒక గదిలో తల్లి డెడ్ బాడీని ఉంచి, మరో గదిలో ఇద్దరు కూతుళ్లు ఉంటున్నారు. డెడ్ బాడీ అంతా కుల్లిపోయి చివరికి అస్థిపంజరం మాత్రమే మిగిలింది. బంధువు ఒకరు ఇంటికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాలు.. వారణాసి నగరంలోని మదర్వా ప్రాంతానికి చెందిన ఉషా త్రిపాఠి తన ఇద్దరు కూతుళ్లు పల్లవి (27), వైశ్విక్ (17)లతో కలిసి ఓ ఇంట్లో జీవించేవారు. పల్లవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. వైశ్విక్ పదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితమే ఉషా భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె చిన్నదుకాణం నడుపుతూ జీవనం సాగించేది. దానిని నుంచి వచ్చే ఆదాయంతో పిల్లలను చదివించింది. అయితే గతేడాది డిసెంబరు 8న ఉషా మృతి చెందింది.
తల్లి చనిపోయిందనే విషయాన్ని కూతుళ్లు పల్లవి, వైశ్విక్ ఎవరికీ చెప్పలేదు. మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని జీవించసాగారు. ఎప్పుడైనా ఏదైనా కావల్సి వస్తే అప్పుడప్పుడు బయటకు వెళ్లి వచ్చేవారు. చనిపోయిన ఉషా త్రిపాఠికి మీర్జాపుర్‌లో ధర్మేంద్రకుమార్ అనే సోదరుడు ఉండేవాడు. బుధవారం ధర్మేంద్ర తన చెల్లిని చూసేందుకు ఇంటికి వచ్చాడు. అయితే ఇంట్లో ఉన్న పల్లవి, వైశ్విక్ ఎంతసేపటికీ తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన ధర్మేంద్ర పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి చూస్తే వారికి కళ్లు బయర్లు కమ్మే సన్నివేశం కనిపించింది. ఒక గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అస్థిపంజరం ఉషా త్రిపాఠిదిగా గుర్తించారు. ఇళ్లంతా చెత్తా చెదారంతో నిండిపోయి, దారుణంగా ఉంది. పోలీసుల దర్యాప్తులో పల్లవి, వైశ్విక్ మానసిక పరిస్థితి సరిగా లేదని తేలింది. దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, తల్లి చనిపోయిన తేదీని గుర్తుంచుకోవడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే..
ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. యూపీలోని శివపురి గ్రామంలో విమలేశ్ అనే వ్యక్తి నివాసముండేవాడు. అతను అహ్మదాబాద్ లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహించేవాడు. 2021 ఏప్రిల్ 22న విధుల్లోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు విమలేశ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు కానీ అంత్యక్రియలు నిర్వహించలేదు. గ్రామస్తులకు విమలేశ్ మృతిచెందిన విషయం తెలియదు. విమలేశ్ కనిపించకపోవడంతో ఆరా తీయడం మొదలుపెట్టారు. విమలేశ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడు కోమాలో ఉన్నాడని డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తున్నారని అందరిని నమ్మించారు.
విమలేశ్భార్య మిథాలీ స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తోంది. పెన్షన్ కు అప్లై చేసుకునేందుకు విమలేశ్ మరణ ధ్రువీకరణ పత్రాన్ని బయటపెట్టడంతో అసలు విషయం తెలిసింది. వెంటనే అలర్ట్ అయిన ఆదాయ పన్నుశాఖ ఈ విషయాన్ని సీఎంవోకు తెలిపింది. వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని సీఎంఓ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు విమలేశ్ ఇంటికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డెడ్ బాడీని పరీక్షించిన వైద్యులు.. విమలేశ్మృతదేహం పూర్తిగా చెడిపోయిందని గుర్తించారు.