Telangana Assembly New Speaker: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పీఠంపై తొలి దళిత నేత - బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్
Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. శాసన సభాపతిగా ఎన్నికైన తొలి దళిత నేతగా చరిత్ర సృష్టించారు.
Telangana New Assembly Speaker Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం రేవంత్ రెడ్డి (CM Reavnth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతిగా ఎన్నికైన తొలి దళిత నేతగా గడ్డం ప్రసాద్ కుమార్ చరిత్ర సృష్టించారు. స్పీకర్ పదవికి ప్రసాద్ కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పద్మారావు, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి ప్రమాణం చేశారు. సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించారు.
మంచి సంప్రదాయం కొనసాగాలి
స్పీకర్ ఎన్నిక అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. స్పీకర్ ఎన్నిక విషయంలో సానుకూలంగా వ్యవహరించిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సంప్రదాయం భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. తనది, స్పీకర్ ది సొంత జిల్లా వికారాబాద్ అని అన్నారు. గడ్డం ప్రసాద్ కుమార్ అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రసాద్ సేవలందించారని కొనియాడారు. సభలో చర్చ జరిగి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని ప్రశంసించారు. అలాగే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పీకర్ ను ఉద్దేశించి ప్రసంగించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపారు.
Also Read: ప్రజా భవన్ లోకి భట్టి విక్రమార్క - బాధ్యతలు స్వీకరించిన పలు శాఖల మంత్రులు