Elon Musk vs Mukesh Ambani : ఎలాన్ మస్క్ vs ముఖేష్ అంబానీ - భారత్‌లో స్టార్‌లింక్ వివాదం వెనుక ఉన్న నిజాలేంటి?
Musk Ambani Dispute: భారత్‌లో స్టార్‌లింక్ ఎంట్రీపై ఎలాన్ మస్క్ వ్యాఖ్యల కలకలం రేపుతున్నాయి. అంబానీపై విమర్శలు స్పెక్ట్రమ్ కేటాయింపులు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి స్పందనలతో వివాదం ప్రారంభమయింది.

Starlink Satellite Internet India: భారతీయ ఉపగ్రహ సమాచార రంగం కేంద్రంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీల మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు సరికొత్త రాజకీయ, సామాజిక రచ్చకు దారితీసింది. భారత ప్రజలపై తమ ఏకఛత్రాధిపత్యాన్ని కాపాడుకోవడానికి కొందరు ఒలిగార్క్‌లు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. భారత్‌కు నిజమైన బాస్ అంబానీయేనా? అంటూ ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా విరుచుకుపడటంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ఈ ఆరోపణలు కేవలం ఒక వ్యాపార పోటీకి ప్రతిరూపమా లేక దేశీయ నియంత్రణలు, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన అంశమా అన్నది లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
శాటిలైట్ నుంచి ఇంటర్నెట్
స్టార్‌లింక్ అనేది ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ రూపొందించిన లో-ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహ నెట్‌వర్క్. సాంప్రదాయ ఫైబర్ లేదా సెల్ టవర్ల అవసరం లేకుండా, అంతరిక్షంలో ఉన్న వేలాది చిన్న ఉపగ్రహాల ద్వారా నేరుగా భూమిపై ఉన్న డిష్, రిసీవర్లకు హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను ఇది అందిస్తుంది. భౌగోళికంగా చేరుకోలేని కొండ ప్రాంతాలు, అడవులు , మారుమూల గ్రామాలకు ఇది ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. భారత్‌లో ప్రవేశించేందుకు స్టార్‌లింక్ గత ఐదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వ్యాపార నిబంధనలు , స్పెక్ట్రమ్ కేటాయింపు పద్ధతులపై దేశీయ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ప్రధాన విభేదాలు తలెత్తాయి.
జాతీయ భద్రత, డేటా లోకలైజేషన్‌పై వివాదం
అసలు వివాదానికి ప్రధాన మూలం స్పెక్ట్రమ్ కేటాయింపు విధానం . అంతర్జాతీయ నిబంధనల ప్రకారం శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయకుండా పరిపాలనా ప్రాతిపదికన కేటాయించాలని మస్క్ వాదిస్తుండగా, దేశీయ స్పెక్ట్రమ్‌ను వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని, అప్పుడే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉంటుందని అంబానీ నేతృత్వంలోని జియో పట్టుబట్టింది. దీనికితోడు జాతీయ భద్రత, డేటా లోకలైజేషన్ అంశాలు ప్రధాన అవరోధాలుగా మారాయి. భారతీయుల డేటా దేశీయ సర్వర్లలోనే భద్రంగా ఉండాలని, భద్రతా ఏజెన్సీలు నిఘా పెట్టేలా శాటిలైట్ గేట్‌వేలను ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. మస్క్ ఆరోపణలను కేంద్ర నివేదికలు తీవ్రంగా ఖండించాయి. టెలికాం నియంత్రణలన్నీ పారదర్శకంగా, వివక్ష రహితంగా ఉన్నాయని, స్టార్‌లింక్‌తో పాటు ఇతర మూడు సంస్థలు కూడా ఒకే భద్రతా తనిఖీల దశలో ఉన్నాయని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
రాజకీయం చేసిన మస్క్
ఈ వ్యాపార పోరు కాస్త రాజకీయ రంగు పులుముకుంది. మస్క్ వ్యాఖ్యలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. వెల్‌కమ్ టూ ఇండియా ఎలాన్.. అసలు వ్యక్తి ఎవరో తెలిసే వరకు వేచి చూడండి అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీనికి మస్క్ థాంక్యూ రాహుల్, ఇది నిజంగా ఆందోళనకరం అని బదులిచ్చారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై స్పందిస్తూ, వినూత్న శాటిలైట్ ఇంటర్నెట్ సాంకేతికతను భారత్ ఆహ్వానించాలని, కొందరి పారిశ్రామిక ప్రయోజనాల కోసం అంతర్జాతీయంగా బ్రాండ్ ఇండియా ను బలహీనపరచకూడదని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు దీనిని కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్ దిగ్గజాల బంధానికి నిదర్శనంగా విమర్శించగా, బిఆర్ఎస్, బిజెపి వర్గాలు భద్రతా నియంత్రణలను పక్కనబెట్టి విదేశీ సంస్థలకు కార్పెట్ పరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. ఈ మొత్తం వివాదంపై ముఖేష్ అంబానీ, రిలయన్స్ జియో వర్గాలు ఇప్పటివరకు ప్రత్యక్షంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, జియో కూడా స్వయంగా అంతరిక్ష ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను సొంతంగా అభివృద్ధి చేసేందుకు బిలియన్ డాలర్ల ప్రణాళికలతో సిద్ధమవుతోంది. కాబట్టి, విదేశీ దిగ్గజమైన స్టార్‌లింక్ భారత్‌లోకి ముందే అడుగుపెడితే దేశీయ టెలికాం పరిశ్రమకు, ముఖ్యంగా 5G వ్యాపారానికి గట్టి పోటీ ఎదురవుతుందనేది బహిరంగ రహస్యమే.
మస్క్ భారతీయ రూల్స్ పాటించాల్సిందే
నిబంధనలు తీరి స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి వస్తే మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ విప్లవం రావడం ఖాయం. అయితే డివైజ్ ధరలు, ప్లాన్ చార్జీలు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా లేదా అన్నది ప్రశ్నార్థకమే. ఎలాన్ మస్క్ చేసిన ఆరోపణలు కేవలం ఏకపక్ష వ్యాపార కోపంతో కూడుకున్నవా లేక విదేశీ పెట్టుబడులకు భారత నిబంధనలు కఠినంగా మారుతున్నాయా అనే దానిపై విస్తృత విశ్లేషణలు నడుస్తున్నాయి. జాతీయ భద్రత , డేటా రక్షణ విషయంలో రాజీ పడకుండానే, దేశీయ , అంతర్జాతీయ సంస్థలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా భారత టెలికాం రంగాన్ని ఆరోగ్యకరమైన పోటీ వైపు నడిపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















