India-Canada Row: కెనడా, భారత్ మధ్య విభేదాల వేళ అమెరికా విదేశాంగ మంత్రితో సమావేశం కానున్న జైశంకర్
India-Canada Row: అమెరికా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం మధ్యాహ్నం సమావేశం కానున్నారు.
ఖలిస్థానీ సానుభూతి పరుడు హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదాల నడుమ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌తో గురువారం సమావేశం కానున్నారు. సమావేశం అజెండా గురించి ఇరు దేశాల అధికారులు వెల్లడించడంలేదు. అయినప్పటికీ కెనడా, భారత్ వివాదం గురించే చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కెనడా, భారత్ రెండు దేశాలు కూడా అమెరికాకు మంచి మిత్ర దేశాలే. కాబట్టి ఇరు దేశాల మధ్య నడుస్తున్న వివాదం చర్చకు వస్తుందని భావిస్తున్నారు.
ఈ మధ్యాహ్నం ఫాగ్గీ బాటమ్ హెడ్‌క్వార్టర్స్‌లో జైశంకర్, బ్లింకన్‌ల సమావేశం జరుగుతుందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్ తెలిపారు. ఇరువురు నేతలు సమావేశానికి ముందు ఫొటో సెషన్ జరుగుతుందని చెప్పారు. అలాగే మీడియా నుంచి ఎలాంటి ప్రశ్నలకు వారు సమాధానాలు ఇవ్వాలనుకోవడం లేదని అన్నారు. కెనడా, భారతల్ మధ్య దౌత్య వివాదం చెలరేగడానికి చాలా ముందే ఈ సమావేశం షెడ్యూల్ చేసి ఉందని మిల్లర్ వెల్లడించారు. అయితే నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా చేస్తున్న దర్యాప్తుకు భారత్‌ను సహకరించాలని అమెరికా కోరుతోందని చెప్పారు. బ్లింకన్, జైశంకర్‌ల మధ్య జరిగే చర్చకు సంబంధించి ప్రీవ్యూ ఇవ్వదలుచుకోవడం లేదని వెల్లడించారు. అయితే ఈ హత్యకు సంబంధించి కెనడా చేస్తున్న దర్యాప్తుకు సహకరించాలని భారత్‌ను కచ్చితంగా కోరుతామని, ఇదే విషయాన్ని తాము ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఈ ఏడాది జూన్ 18న కెనడాలో ఖలిస్థానీ సానుభూతి పరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగింది. 45ఏళ్ల నిజ్జర్‌ను సరీ నగరంలోని గురుద్వారా బయట కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్చి హతమార్చారు. 2020లో భారత ప్రభుత్వం నిజ్జర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వారి పార్లమెంటులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ కెనడా తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. తమకు విశ్వసనీయమైన సమాచారం ఉందని చెప్తోంది. కానీ దానిని బయటకు వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికా కూడా కెనడా దర్యాప్తుకు భారత్‌ను సహకరించాలని చెప్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత్‌కు కూడా కెనడా చర్యలను తప్పుపడుతోంది. ఖలిస్థానీ వేర్పాటువాదులకు కెనడా సురక్షితస్థావరంగా మారిందని, వారు కెనడా నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఇది ఏమాత్రం మంచిది కాదని భారత్ ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కెనడాలో భారత రాయబారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. దీనికి ప్రతిచర్యగా భారత్ కూడా ఇక్కడి కెనడా రాయబారిని బహిష్కరించి భారత్ వదిలి వెళ్లాలని సూచించింది. కెనడా పౌరులను వీసాల జారీ ప్రక్రియను కూడా భారత ప్రభుత్వం నిలిపేసింది. ఇలా ఇరు దేశాల మధ్య ఆరోపణలతో దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జీ20 సమావేశాలను భారత్‌కు వచ్చిన జస్టిన్ ట్రూడోతో కూడా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయిన తెలిపారు.