DSP Winvestor Pulse Survey: పెట్టుబడి నిర్ణయాల్లో స్త్రీ-పురుషుల మధ్య ఇంత తేడానా? వెరీ ఇంట్రెస్టింగ్
'DSP విన్‌వెస్టర్ పల్స్ 2022' పేరిట ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
DSP Winvestor Pulse Survey: సంపాదించే ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం తమ భవిష్యత్ అవసరాల కోసం ఏదోక రూపంలో పెట్టుబడులు పెడుతుంది. డబ్బు సంపాదించే ప్రతి వ్యక్తి ఏదోక సందర్భంలో పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అది పురుషుడైనా కావచ్చు, స్త్రీ అయినా కావచ్చు. అలాంటి సందర్భంలో వాళ్లు ఏం ఆలోచిస్తారు, ఎలా ముందడుగు వేస్తారు? అన్న విషయాల మీద 'DSP విన్‌వెస్టర్ పల్స్ 2022' పేరిట ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
'DSP విన్‌వెస్టర్ పల్స్ 2022' సర్వే ప్రకారం... ఎక్కువ మంది పురుషులు తమ పెట్టుబడి నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకుంటారు, మహిళల విషయంలో మాత్రం అలా కాదు. ప్రతి ముగ్గురు పురుషుల్లో ఇద్దరు (66%) స్వతంత్రంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. మహిళల విషయంలో ఇది కేవలం 44% మాత్రమే.
ప్రొఫెషనల్ అడ్వైజర్‌ను సంప్రదించకుండా 40% మంది పురుషులు, 27% మంది మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు.
ఎక్కువగా నమ్ముతోంది మహిళలే!
పెట్టుబడి నిర్ణయాల విషయంలో ఎక్కువ మంది మహిళలు తమ భర్తలను సంప్రదిస్తారు. పురుషులు మాత్రం తమ భార్యల కంటే తండ్రులనే ఎక్కువ మంది సంప్రదిస్తారు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో, 67% మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను సంప్రదిస్తుంటే, 48% మంది పురుషులు మాత్రమే (సగం కన్నా తక్కువ మంది) ఇలాంటి ఆలోచన చేస్తారని సర్వేలో తేలింది.
పెట్టుబడి నిర్ణయాల కోసం దాదాపు 26% మంది పురుషులు తమ తండ్రులను సంప్రదిస్తే, 10% మంది మహిళలు మాత్రమే అలా చేస్తారు.
కేవలం 6% మంది పురుషులు మాత్రమే పెట్టుబడి నిర్ణయాల కోసం తమ తల్లులను సంప్రదిస్తారు. ఈ విషయంలో మహిళలు ఇంకా వెనుక ఉన్నారు. కేవలం 5% మంది మహిళలు మాత్రమే అలా చేస్తారు.
ఆడ సలహా - మగ సలహా
సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది (దాదాపు 80%) ఆర్థిక సలహాదారులకు లింగ ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే... పురుషుల్లో 15% మంది మాత్రం పురుష ఆర్థిక సలహాదారులను ఇష్టపడ్డారు. మహిళల్లో 13% మంది కూడా పురుష సలహాదారులకే ఓటు వేశారు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే... ఇప్పటికే ఆర్థిక పెట్టుబడులు పెట్టిన వాళ్లలో చాలా మంది వాళ్ల భర్తల ద్వారా ప్రేరణ పొందారు. పెట్టుబడుల మార్కెట్‌కు భర్తలే వారిని పరిచయం చేశారు. చాలా మంది పురుషులు స్వయంగా తెలుసుకుని పెట్టుబడులు పెట్టారట. మరికొందరు వాళ్ల తండ్రి ద్వారా పెట్టుబడుల గురించి తెలుసుకున్నారట.
ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే... పెట్టుబడి విషయంలో దాదాపు 70% మంది తమ కొడుక్కి, కుమార్తెకు ఒకే రకమైన సలహాలు ఇవ్వరట. ఇద్దరికీ వేర్వేరు సలహాలు ఇస్తారట.
కొవిడ్ తర్వాతి కాలంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టామని దాదాపు 45% మంది పురుషులు, మహిళలు చెప్పారు. మహమ్మారి వల్ల ఆర్థిక ఆలోచనల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడులు పెంచుకోవాల్సిన అవసరం, గతంలో కంటే ఎక్కువ రాబడిని కోరుకోవడం, యాప్‌ల ద్వారా పెట్టుబడి పెట్టే సౌలభ్యం కూడా దోహదపడింది.