Viral News: ప్రతి శనివారం ఒకే వ్యక్తిని కాటు వేస్తున్న పాము, 40 రోజుల్లో ఏడు సార్లు - తలలు పట్టుకుంటున్న వైద్యులు
Snake Bites: యూపీలో ఓ యువకుడిని ప్రతి శనివారం పాము కాటు వేస్తోంది. 40 రోడుల్లో 7 సార్లు అదే పాము కాటు వేసినట్టు బాధితుడు చెప్పాడు. వైద్యులు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు.
UP Man Gets Bitten By Snake: యూపీలోని ఫతేపూర్‌కి చెందిన ఓ వ్యక్తిని ఓ పాము వెంటాడుతోంది. పదేపదే కాటు వేస్తోంది. 40 రోజుల్లో ఏడుసార్లు కాటు వేసింది. 24 ఏళ్ల యువకుడు ఇలా పాము కాటుకి ప్రతిసారీ వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాడు. ఎవరూ సాయం చేయకపోవడం వల్ల కలెక్టరేట్‌కి వెళ్లాడు. అక్కడి అధికారులతో విషయమంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే...ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కాటుకు విరుగుడు వ్యాక్సిన్‌ని ఉచితంగానే ఇస్తారని బాధితుడికి అధికారులు నచ్చజెప్పారు. కానీ ఒకే వ్యక్తిని పాము ఇన్ని సార్లు ఎందుకు కాటు వేస్తోందన్నది మాత్రం అంతు పట్టకుండా ఉంది. అంతే కాదు. బాధితుడికి ఎవరు వైద్యం చేస్తున్నారన్నదీ పరిశీలించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. మరో వింత విషయం ఏంటంటే...ఆ పాము ప్రతి శనివారం బాధితుడుని కాటు వేస్తోంది. వెంటనే ఆ యువకుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. ఒక్కరోజులో అంతా నయమై మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తున్నాడు. మళ్లీ శనివారం రాగానే పాము కాటు వేస్తోంది. 40 రోజులుగా ఇదీ తంతు. ఇదంతా విని అధికారులే ఆశ్చర్యపోయారు. విచారణకు ముగ్గురు వైద్యులతో ప్రత్యేకంగా ఓ టీమ్‌ని ఏర్పాటు చేశారు. నిజానిజాలేంటో తెలియాలంటే ఈ రకంగా విచారణ జరపడం అవసరమని అంటున్నారు.