Sonia Gandhi : రాజ్యసభకు సోనియా - రాజస్థాన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక
Sonia Gandhi : సోనియా గాంధీ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికయినట్లుగా ప్రకటించారు.
Sonia Gandhi elected unopposed to Rajya Sabha from Rajasthan : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజస్థాన్ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోనియాతో పాటు బీజేపీ నేతలు చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్ కూడా రాజస్థాన్ నుంచి ఎగువ సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జైపూర్ అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ తెలిపారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం చివరి రోజు కావడంతో బరిలో మరెవరు లేకపోవడంతో ఈ ముగ్గురు నేతలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికైనట్లు అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో 10 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి నలుగురు సభ్యులు ఉన్నారు.
గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభలో అడుగు పెడుతున్న రెండో లీడర్
గాంధీ కుటుంబం నుంచి రాజ్యసభకు ఎన్నికైన రెండో నాయకురాలు సోనియా గాంధీ కావడం విశేషం. సోనియా 1999 (అమేథి/బళ్లారి), 2004 (రాయ్ బరేలీ), 2006 (రాయ్ బరేలీ), 2009 (రాయ్ బరేలీ), 2014 (రాయ్ బరేలీ), 2019 (రాయ్ బరేలీ)లో లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు మొదటిసారిగా పెద్దల సభలో కాలుమోపనున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1964 ఆగస్టు నుండి 1967 ఫిబ్రవరి వరకు ఎగువ సభలో సభ్యురాలిగా ఉన్నారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజస్థాన్ లో రెండు బీజేపీ, ఒకటి కాంగ్రెస్ ఖాతాలో రాజ్యసభ స్థానాలు
రాజస్థాన్ లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కావడంతో నోటిఫికేషన్ జారీ చేశారు. మన్మోహన్ సింగ్ (కాంగ్రెస్), భూపేంద్ర యాదవ్ (బీజేపీ)ల పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుండగా... బీజేపీ సభ్యుడు కిరోడి లాల్ మీనా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలకు సోనియా గాంధీ, చున్నీలాల్ గరాసియా (బీజేపీ), మదన్ రాథోడ్ (బీజేపీ) బరిలో నిలవగా... ఇతరులెవరూ పోటీచేయకపోవడంతో ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాజస్థాన్ అసెంబ్లీ కార్యదర్శి మహావీర్ ప్రసాద్ శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
Cong leader Sonia Gandhi elected unopposed to Rajya Sabha from Rajasthan: Assembly secretary
— Press Trust of India (@PTI_News) February 20, 2024
అనారోగ్యం, వయసు కారణంగా ఎన్నికల్లో పోటీకి సోనియా దూరం
రాజస్థాన్‌లో రాజ్యసభ సభ్యులు మన్మోసింగ్ సింగ్ (కాంగ్రెస్), భూపేంద్ర యాదవ్ (బీజేపీ) పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 3తో ముగుస్తుంది. బీజేపీ ఎంపీ కిరోడి లాల్ మీనా డిసెంబరులో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పెద్దల సభకు రాజీనామా చేయడం వల్ల మూడో స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 115, కాంగ్రెస్‌కు 70 మంది సభ్యుల బలం ఉంది. రాజస్థాన్‌లో 10 రాజ్యసభ స్థానాలుండగా, తాజా ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి నలుగురు సభ్యులున్నారు.