Andhra News: 'జనసేన ఎక్కడా ఆ విషయాన్ని చెప్పలేదు' - పొత్తులపై బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
AP News: ఏపీలో జనసేనతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా పొత్తులోనే ఉన్నామని, తెగదెంపులు చేసుకుంటున్నట్లు ఎక్కడా జనసేన చెప్పలేదని స్పష్టం చేశారు.
BJP Leader Purandeswari Comments on Alliance with Janasena: ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తు (Janasena and BJP Allinace) కొనసాగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) స్పష్టం చేశారు. ఏలూరు (Eluru) జిల్లా జంగారెడ్డి గూడెంలో (Jangareddugudem) ఆమె పర్యటించారు. దండమూడిలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. తమతో తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా జనసేన ఎక్కడా చెప్పలేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేలా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దొంగ ఓట్లపై తాము కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, నకిలీ ఐడీలు సృష్టించి ఓట్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
ఏపీ రాజధాని అమరావతి
ఏపీ రాజధాని అమరావతే (Amaravathi) అని పురంధేశ్వరి పునరుద్ఘాటించారు. ఇప్పటికే పార్లమెంట్ సాక్షిగా ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసిందని, రాజధాని నిర్మాణానికి టీడీపీ హయాంలో రూ.2,500 కోట్ల నిధులిచ్చినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రతీ పైసా కేంద్రమే భరిస్తోందని అన్నారు. కేంద్రం చేపట్టిన జాతీయ రహదారులు, ఇతర ప్రాజెక్టులు పరిశీలించి త్వరగా ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన చూస్తున్నామని, అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల్లో 'మిగ్ జాం' తుపాను కారణంగా నష్టం జరిగిందని, ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు. 'ఆడుదాం ఆంధ్ర' పేరుతో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నారని, ప్రతి పైసా తమ జేబుల్లోకి వెళ్లాలనేదే వైసీపీ నేతల ఆలోచన అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ కు చట్టబద్ధత లేదని, రాష్ట్రానికి ఏ విధంగానూ న్యాయం చేయని వైసీపీ ఏపీకి అవసరమా.? అని నిలదీశారు.
'అవి వర్షానికే కూలిపోతున్నాయి'
ఏలూరు మెడికల్ కాలేజీకి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని పురంధేశ్వరి చెప్పారు. జిల్లాలో లక్షకు పైగా ఇల్లు కేటాయింపు చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసని, చిన్నపాటి వర్షానికే ఆ ఇళ్లు పునాదులతో సహా కూలిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఉపాధి పథకం ద్వారా 6.77 లక్షల మందికి సాయం అందించామని, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ మంచి నీరు అందించామని చెప్పారు. స్వనిధి పథకం ద్వారా 4,212 మంది చిరు వ్యాపారులకు సహాయం అందించినట్లు చెప్పారు. కేంద్ర నిధులనే జగన్ తన పేరు చెప్పి ప్రజలకు ఇస్తున్నారని, వైసీపీ హయాంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. రాష్ట్రం పూర్తి అవినీతి మయంగా మారిందని ఆరోపించారు. 'మిగ్ జాం' కారణంగా పంట నష్టం వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.