Afghan Ghani Cash : ఘనీ మామూలోడు కాదు.. పారిపోయేటప్పుడు ఎంత సొమ్ము తీసుకెళ్లారో తెలుసా..!?
తాలిబన్లకు దేశం అప్పగించేసి పలాయనం చిత్తగించిన ఆఫ్గాన్ అధ్యక్షుడు ఆష్రాఫ్ ఘనీ 4 కార్ల నిండా డబ్బులతో వేరే దేశానికి వెళ్లిపోయారు. వెంట ఓ హెలికాఫ్టర్‌ను కూడా తీసుకెళ్లినట్లుగా రష్యా మీడియా తెలిపింది.
తాలిబన్లు కాబూల్‌లో అడుగు పెట్టగానే అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ కంటికి కనిపించకుండా పరారయ్యారు. దాంతో తాలిబన్లకు పెద్ద కష్టం లేకుండానే ఆఫ్గాన్ మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇంతకూ ఆష్రఫ్ ఘనీ ఎక్కడకు పారిపోయారు..? ఎలా పారిపోయారు..? ఏమేమి తీసుకు పోయారు..? అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే రష్యా మీడియా మాత్రం... కొన్ని వివరాలను వెల్లడిస్తోంది. ఆయన సాదాసీదాగా వెళ్లిపోలేదని.. డబ్బు దస్కం అన్నీ మూటగట్టుకుని పోయాడని రష్యా మీడియా ప్రకటించింది. ఆష్రఫ్ ఘనీ తనతో పాటు నాలుగు కార్లు.. వాటిని నిండా డబ్బులు కుక్కి తీసుకుపోయారు. అలాగే ఓ హెలికాఫ్టర్‌ను కూడా తన వెంట తీసుకెళ్లారు. ఇంకా కొంత సొమ్ము అధ్యక్ష భవనంలో వదిలేశారు. ఎందుకంటే.. ఆ డబ్బులు కార్లలో పట్టలేదట.
ఈ విషయాన్ని రష్యా అధికారిక మీడియా ప్రకటించింది. మొత్తం దేశ బడ్జెట్‌ను తీసుకెళ్లి ఉండరని.. ఎంతో కొంత మిగిల్చి ఉంటారని రష్యా అంచనా వేస్తోంది. హింస జరగకూడదనే తాను పారిపోయానని ఆయన ప్రటించుకున్నారు. కానీ ఎక్కడకు వెళ్లారో మాత్రం ఎవరికీ తెలియనీయలేదు. అసలు పోరాడకుండా పారిపోయిన ఆష్రఫ్ ఘనీ ఆర్థిక నిపుణుడు. కానీ గొప్ప పాలకుడు కాదు. తన జీవితంలో ఎక్కువగా అమెరికాలో గడిపారు. హమీద్ కర్జాయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆర్థిక నిపుణుడు హోదాలో సలహాదారుగా ప్రభుత్వంలో చేరారు. తర్వాత మంత్రి అయ్యారు. కొత్త కరెన్సీని తీసుకు వచ్చారు. పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చేలా చేశారు. తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పడటం ప్రారంభించారు.
ఆయనకు ఎప్పుడూ పూర్తి స్థాయి ప్రజా మద్దతు రాలేదు. 2014 ఎన్నికల్లో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆయన ప్రత్యర్థి అబ్దుల్లాతో అధికారాన్ని పంచుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం గెలిచారు. కానీ తాలిబన్లను ఆయన ఎప్పుడూ శత్రువులుగా చూడలేదు. వారితో శాంతి చర్చలు జరిపారు. ఒకానొక దశలో తాలిబన్లను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ కారణంగానే సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకోలేదు. ఆఫ్గాన్ నుంచి వెళ్లిపోవాలని అమెరికా అనుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది.
అమెరికా ఒత్తిడితో 5000 మంది తిరుగుబాటుదారులను ఘనీ జైళ్ల నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత పరిస్థితి అందరూ చూస్తూనే ఉన్నారు. ఆర్థిక నిపుణుడైన ఆయన ... పారిపోయేటప్పుడు తన శేష జీవితానికి కావాల్సినంత సొమ్మును తీసుకుని పరారయ్యాడు. ఏ దేశంలో ఉన్నారో కానీ ఆఫ్గాన్ ప్రజలంతా ఆయనను తిట్టిపోస్తున్నారు. తాలిబన్లపై కనీసం పోరాడి ఉంటే.. ప్రజలు మద్దతుగా ఉండేవారని.. కానీ ఆయన నాయకత్వ వైఫల్యంతోనే మొత్తం తారుమాయిందని వారు బాధపడుతున్నారు.