Vizag News: విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ - వాసిరెడ్డి పద్మ లేఖ
Vizag Latest News: విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించారు.
Visakhapatnam Gang Rape: విశాఖపట్నం గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కు వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని అన్నారు. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలని అన్నారు.
విశాఖపట్నంలో జరిగిన గ్యాంగ్ రేప్ లో పది మంది వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. విశాఖలో నివసిస్తున్న ఒడిశాకి చెందిన 17 ఏళ్ళ బాలికని భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఈ నెల 18న ఆ బాలికను లాడ్జికి తీసుకువెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత తన స్నేహితుడిని పిలిపించి అత్యాచారం చేయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు ఆర్కే బీచ్‌కు వెళ్ళింది. అయితే, బీచ్‌లో పర్యటకుల ఫొటోలు తీసే వ్యక్తి అక్కడ ఏడుస్తున్న బాలికను గమనించి.. వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
అతను సాయం చేయాల్సింది పోయి తాను కూడా పశువులా ప్రవర్తించాడు. జగదాంబ జంక్షన్ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి.. అక్కడ గదిలో ఉంచాడు. అతడితో సహా స్నేహితులు 8 మంది రెండు రోజులపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. భయాందోళనకు గురైన బాలిక వారి నుంచి తప్పించుకుంది. ఇంటి నుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్యం కేసు నమోదు అయింది. దీంతో ఫోర్త్ టౌన్ పోలీసులు 22వ తేదీన ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు. భయంతో బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. చివరికి ఆమె చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నగరానికి చెందిన 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.