Breaking News Live Telugu Updates: షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ముందస్తు ఊహాగానాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి కోఠీ సీబిఐ కార్యాలయానికి ఎంపీ అవినాష్ రెడ్డి బయలుదేరారు. కోఠీ సిబిఐ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. కాసేపట్లో ఆయన్ని సీబీఐ విచారించనుంది.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) మరోసారి సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఓసారి సీబీఐ విచారణ హాజరైన ఆయన ఇప్పుడు హాజరుకావడం ఇది మూడోసారి. తనకు తెలిసిన విషయాలను ఇప్పటికే చెప్పానంటున్న అవినాష్... ప్రస్తుతం విచారణ తన ఫ్యామిలీ టార్గెట్‌గా జరుగుతోందని ఆరోపించారు.
సిబిఐ అధికారులు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండుసార్లు అవినాష్ రెడ్డిని విచారించారు. విచారణలో భాగంగా ఈనెల ఆరో తేదీన హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈనెల 4వ తేదీన పులివెందులలోని వైయస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే తనకు ముందుగా నిర్ణయించిన పలు కార్యక్రమాల వలన ఆరోజు విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. దీంతో సిబిఐ అధికారులు ఈనెల 10వ తేదీన విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. ఆయన మూడోసారి సిబిఐ విచారణకు హాజరువుతున్నారు.
ఈనెల 12వ తేదీన వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై అవినాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సిబిఐ అధికారులు తనకు పదో తేదీన, తన తండ్రికి 12వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారని ఈ మేరకు తాము హాజరు అవుతామని స్పష్టం చేశారు.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పైనే ప్రధానంగా సీబీఐ అనుమానం
అరెస్ట్ ఊహాగానాలతో ఎంపీ ముందు జాగ్రత్త ప్రయత్నాలు !
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్‌లో కోరారు అవినాష్‌రెడ్డి. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని ... పలుమార్లు కోరినా సిబిఐ తన అభ్యర్ధనను అంగీకరించలేదన్నారు. 160 CRPC నోటీస్ ఇచ్చారు కాబట్టి సీబీఐ ఎలాంటి బలవంతపు ,చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న దస్తగిరిని.. ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్ చేయలేదని.. దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని అవినాష్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటల ఆధారంగానే..సీబీఐ విచారణ కొనసాగుతోందన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ..ఈ కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
సునీల్ యాదవ్ గూగుల్ టేక్ఔట్ ఫోన్ సిగ్నల్ లొకేషన్ చూపి సిబిఐ తనను వేధిస్తోందని.. స్పాట్ లో దొరికిన లేఖపై సిబిఐ దర్యాప్తు చేయటం లేదన్నారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని.. వివేకా హత్య ఎలా జరిగిందో ముందుగానే నిర్ణయించుకొని..అదే కోణంలో విచారణ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారని.. తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని అవినాష్‌రెడ్డి ఆరోపించారు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా చార్జ్ షీట్‌లో నేరస్తునిగా సిబిఐ చిత్రీకరిస్తోందన్నారు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు, ముందస్తు ఊహాగానాలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెళ్తామని తేల్చిచెప్పారు.
ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దు, సీబీఐకి హైకోర్టు ఆదేశం
వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని ఆదేశించింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దని సీబీఐకి ఆదేశించింది.
వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడే - కోర్టులో అవినాష్ రెడ్డి న్యాయవాది వాదనలు
తెలంగాణ హైకోర్టులో వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోర్టును కోరారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపారు. ఈరోజు విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. గత రెండుసార్లు జరిపిన విచారణ స్టేట్మెంట్స్ ను పక్కన పెట్టాలని అవినాష్ న్యాయవాది కోర్టును కోరారు. రెండుసార్లు సీబీఐ జరిపిన విచారణ ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా జరిగిందన్నారు. రెండుసార్లు విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి నుంచి సంతకాలు తీసుకోలేదన్నారు. 40 నుండి 50 సార్లు అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ను సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఎడిట్ చేశారన్నారు. అవినాష్ రెడ్డి సంతకం లేనందున స్టేట్మెంట్లు మార్చి ఉండొచ్చని అనుమానం ఉందన్నారు. వివేకా హత్య కేసులో అసలు నేరస్థుడు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అని అవినాష్ రెడ్డి న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణలో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి.
అవినాశ్ రెడ్డి రిట్ పిటిషన్ విచారణలో ట్విస్ట్- ఇంప్లీడ్ చేయాలని కోరనున్న సునీత
వైఎస్ వివేక హత్య కేసులో తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సీబీఐను నిలువరించాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన రిటిష్ పిటిషన్ విచారణలో ట్విస్ట్ కనిపిస్తోంది. ఇందులో వైఎస్ వివేక కూతురు సునీత ఇంప్లీడ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
మూడోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ఆయన్ని రెండుసార్లు సీబీఐ విచారించింది.