Anganwadi Strike: అంగన్‌వాడీ సిబ్బందితో ప్రభుత్వం చర్చలు విఫలం- సమ్మె కొనసాగుతున్నట్టు ప్రకటన
అంగన్‌వాడీ సిబ్బంది పట్టువీడటం లేదు. ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు. దీంతో సమ్మె కొనసాగుతోందని అంగన్‌వాడీ యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది.
అంగన్‌వాడీలతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న సిబ్బందిని శాంతింప జేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు వలంటీర్లతో సెంటర్లు తెరిపిస్తూనే అంగన్‌వాడీ సిబ్బందితో చర్చలు జరుపుతోంది. శుక్రవారం జరిగిన మూడో విడత చర్చలు కూడా ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు.
అంగన్‌వాడీ సిబ్బంది పట్టువీడటం లేదు. ప్రభుత్వం మెట్టు దిగి రావడం లేదు. దీంతో సమ్మె కొనసాగుతోందని అంగన్‌వాడీ యూనియన్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వాళ్లు ప్రతిపాధించిన చాలా అంశాలు పరిగణలోకి తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం చెబుతోంది. కానీ జీతాల విషయంలో మాత్రం హామీ ఇవ్వడం లేదు. దీంతో సమ్మె విరమణకు అంగన్‌వాడీ సిబ్బంది సుముఖత చూపడం లేదు.
మంత్రులు బుగ్గనరాజేంద్రనాథ్, ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, మహిళా శిశుసంక్షేమ సెక్రటరీ జయలక్ష్మి ఈ చర్చల్లో పాల్గొన్నారు. అంగన్‌వాడీ సిబ్బంది గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లకు పెంచేందుకు ఓకే చెప్పారు. సర్వీస్ చివరిన ఇచ్చే బెనిఫిట్స్ లక్ష రూపాయలకు పెంచేందుకు అంగీకరించారు. హెల్పర్లకు 40వేలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రమోషన్ల గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లకు పెంచేందుకు సిద్ధమయ్యారు. టీఏ, డీఏలు రాష్ట్ర సర్కారు ఇచ్చేందుకు సరే అంది. గ్రాట్యుటీ అంశంపై కేంద్రానికి లేఖ రాస్తామని హామీ ఇచ్చారు.
ఇన్ని చెప్పిన మంత్రివర్గ ఉపసంఘం... వేతనాల పెంపుపై మాత్రం వెనక్కి తగ్గుతోంది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీతోపాటు సుప్రీంకోర్టు సూచించినట్టు తమ జీతాలు పెంచాలని అంగన్‌వాడీ సిబ్బంది పట్టుబట్టారు. అంగన్‌వాడీ వర్కర్లకు 26 వేలు హెల్పర్లకు 20 వేల రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచేందుకు మాత్రం ఉపసంఘం అంగీకరించలేదు. ప్రస్తుతానికి జీతాలు పెంచే పరిస్థితిలేదని చెప్పేసింది.
జీతాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్టు అంగన్‌వాడీ యూనియన్లు తేల్చి చెప్పేశాయి. ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ఉందని అందుకే సమ్మెతోనే ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామన్నారు. బెదిరించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సుప్రీం గైడ్‌లైన్స్ అనుసరించి జీతాల పెంపు, గ్రాట్యూటి అంశాన్ని పరిశీలిస్తామంటే సమ్మె విరమించడానికి తాము సిద్దమని ప్రకటించారు.
అంగన్‌వాడీలు విధుల్లోకి వెళ్తారని తాము ఆశిస్తున్నట్టు మంత్రి బొత్స తెలిపారు. వాళ్లు కూడా ప్రభుత్వంలో అంతర్భాగమేనన్నారు. అందుకే వాళ్లు అడగని వాటిని కూడా ఇస్తున్నామని తెలిపారు. తాళాలు పగలగొట్టి కేంద్రాలు తెరిపించాలని ప్రభుత్వం అనుకోలేదన్నారు బొత్స. ఎక్కడో ఒక చోట మాత్రమే జరిగిందని దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాుర.