JC Prabhakar Reddy: ఆర్టీవో ఆఫీస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన, వాళ్లు ఎదురొస్తే కాల్చేస్తామని వార్నింగ్!
Tadipatri News: రవాణా అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. అందుకే నిరసన తెలియచేస్తున్నానని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
JC Prabhakar Reddy Protest: తాడిపత్రిలో వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన అనుచరుల వాహనాలు, టిప్పర్లు నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాడిపత్రి ఆర్టీఓ ఆఫీస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి బైఠాయించారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డికి చెందిన ఐదు ఇన్నోవా వాహనాలు, ఎమ్మెల్యే అనుచరుల వాహనాలు, టిప్పర్లు తిరుగుతున్నాయని.. రవాణా అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో ఇక్కడ నిరసన తెలియచేస్తున్నానని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వద్దకు వచ్చి నిరసన విరమించాలని ఆర్టీవో కోరినా ఆయన పట్టించుకోలేదు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో తన ఇంటి లోకి వచ్చిన ఎమ్మెల్యే వాహనాలకు కూడా నంబర్ ప్లేట్లు లేవని, తమ కౌన్సిలర్లపై దాడి జరిగిన సమయంలో కూడా ఎమ్మెల్యే వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేవని జేసీ అన్నారు. తాడిపత్రిలో అధికార పార్టీకి చెందిన ఓ షాడో ఎమ్మెల్యే నిత్యం తన ఇంటి వద్ద నంబర్ లేని వాహనంతో స్పీడ్ గా వెళ్తుంటాడని అన్నారు. ఈ నెంబర్ లేని వాహనాలు పట్టణంలో చాలా వేగంగా వెళుతున్నాయని, ఎక్కడైనా ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం ఎవరు చేశారో తెలుసుకోవాలంటే చాలా కష్టమవుతుందని అన్నారు. అయితే ఆర్టీవో, పోలీస్ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి రెండు రోజులు గడువు కోరడంతో ప్రభాకర్ రెడ్డి తన నిరసన విరమించారు. రెండు రోజులలో చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఆ నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు మళ్లీ తనకు ఎదురుపడితే కచ్చితంగా దాడులు చేస్తామని లేదా కాల్చివేస్తామంటూ పోలీసులతో జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు.
అక్రమ మద్యం తరలింపు ముఠా అరెస్టు
అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆరుగురిని అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.35 వేల నగదు.. 256 మ్యాన్షన్ హౌస్ మద్యం బాటిళ్లు, ఒక కారు, ఐచర్ వాహనం స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ అదనపు ఎస్పీ రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రవితేజ, రామాంజనేయ రెడ్డి, కుల్లాయి స్వామి, జయచంద్ర, షాహిద్ ఖాన్, హరికృష్ణ అనే ఆరుగురు గోవా, కర్ణాటక ప్రాంతాల్లో ఎమ్మార్పీ ధరలకు మద్యం కొనుగోలు చేస్తారు. వీటిని గుట్టు చప్పుడు కాకుండా ఐచర్ వాహనంలో ఎవరికి అనుమానం రాకుండా కోడిపెంట బాక్సులో మద్యం సీసాలను దాచి తరలిస్తారు.
ఎమ్మార్పీ ధరలకు కొనుగోలు చేసిన మద్యం బాటిల్స్ ని ఎక్కువ ధరలకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఐచర్ వాహనంలో మద్యం బాటిల్స్ తీసుకొచ్చేముందు కారులో పోలీసు నిఘా ఉందా లేదా అని పరిశీలించి రోడ్డు వెంబడి వచ్చేవారు. వీరి అక్రమ మద్యం వ్యవహారంపై సమాచారం రావడంతో అనంతపురంలోని చెరువు కట్ట సమీపంలో పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు పోలీసులు చెప్పారు.