Mpox Virus: నిద్ర పట్టడం లేదు, నొప్పితో నరకం చూస్తున్నా - ఎమ్‌పాక్స్ సోకిన బాధితుడి ఆవేదన
Mpox Virus Cases: ఆఫ్రికాలో ఎమ్‌పాక్స్ కేసులు అలజడి సృష్టిస్తున్నాయి. రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతుండడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mpox Virus Symptoms: ప్రపంచవ్యాప్తంగా మరోసారి mpox అలజడి కొనసాగుతోంది. వరుసగా రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికా మొత్తం ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదముందని ఇప్పటికే హెచ్చరించింది. బురుండి, కెన్యా, ఉగాండా, ర్వాండాలోనూ mpox కేసులు నమోదయ్యాయి. స్వీడెన్‌లోనూ ఈ స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. ఫలితంగా యూరప్‌లోనూ ఇది వ్యాప్తి చెందే అవకాశముందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ 570 మంది ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. Clade 1b స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆఫ్రికాకి చెందిన ఓ బాధితుడు ఈ వైరస్ లక్షణాలు ఎలా ఉన్నాయో వివరించాడు. నరకం అనుభవిస్తున్నానని చెప్పాడు.
"నా గొంతు వాచిపోయింది. విపరీతంగా నొప్పి పెడుతోంది. అసలు నిద్ర పట్టడం లేదు. గొంతు నొప్పితోనే నరకం చూస్తుంటే ఆ తరవాత కాళ్ల నొప్పి మొదలైంది. నా ఫ్రెండ్‌కి ఈ వైరస్ సోకింది. అతని నుంచే నాకు వచ్చింది. మా పిల్లలకు మాత్రం ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఇదే కాస్త నాకు ఉపశమనంగా ఉంది."
- బాధితుడు
గత స్ట్రెయిన్‌లతో పోల్చి చూస్తే కొత్తగా వ్యాప్తి చెందుతున్న Clade 1b స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉంది. చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. స్వలింగ సంపర్కంతో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. WHO చెబుతున్న వివరాల ప్రకారం చిన్నారులకు ఎక్కువగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఫెసిలిస్ సెంటర్‌లను పెంచుతున్నారు. బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. వాళ్లందరినీ టెంట్‌లలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇకపై ఇంకా ఈ సంఖ్య పెరిగితే హ్యాండిల్ చేయడం కష్టమే అంటున్నారు. ఉన్న వనరులు తక్కువ. వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవు. టెస్టింగ్ కిట్స్ కూడా అంతంతమాత్రమే. ఆఫ్రికాలో ఈ తరహా వైరస్‌లను టెస్ట్ చేసేందుకు కేవలం ఒకే ఒక ల్యాబ్ ఉంది. కొన్ని చోట్ల తాగడానికి నీళ్లు కూడా లేకపోవడం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా నరకం చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. (Also Read: Mpox.. మరో కోవిడ్ కానుందా? ఆగండి.. ఆగండి.. WHO మళ్లీ ఏం చెప్పిందో చూడండి)
అయితే..ఇంత జరుగుతున్నా కొంత మంది నిర్లక్ష్యంగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. గుమిగూడి తిరగొద్దని ఎంత చెబుతున్నా పట్టించుకోవడం లేదని, ఫలితంగా కేసులు పెరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంత మందైతే అసలు mpox కేసులు పెరుగుతున్నాయని తెలియదని చెబుతున్నట్టుగా వివరిస్తున్నారు. ప్రజల్లో ఇంకా అవగాహన పెంచేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. తీవ్ర జ్వరంతో చాలా మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఒళ్లంతా దద్దర్లు వస్తున్నాయి. ఈ వైరస్‌ని చాలా సీరియస్‌గా తీసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని WHO హెచ్చరించింది. పాకిస్థాన్‌లోనూ ఈ వైరస్ వెలుగు చూడడం ఆ దేశాన్ని భయపెడుతోంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ ఈ వైరస్ కట్టడిని అడ్డుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.