ఏబీపీ దేశం రెండో వార్షికోత్సవం, తొలి డిజిటల్ AI న్యూస్ యాంకర్ AIRA ను ఆవిష్కరించిన ABP NETWORK
ఏబీపీ నెట్‌వర్క్‌లోని తెలుగు డిజిటల్ ఛానల్ ABP Desam రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆ ప్లాట్‌ఫామ్‌పై ఐరాను తీసుకొస్తున్నారు.
ఇండియాలోని ప్రముఖ న్యూస్ సంస్థల్లో ఒకటైన ABP Network.. తమ తొలి అర్టిఫిషియల్ యాంకర్ 'ఐరా (AIRA)' ను ప్రవేశపెట్టింది. నెట్‌వర్క్‌లోని తెలుగు డిజిటల్ ఛానల్ ABP Desam రెండో వార్షికోత్సవం సందర్భంగా ఐరా అనే ఏఐ యాంకర్ ను తీసుకొచ్చారు. ABP Desam తెలుగు డిజిటల్ ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే.
AIRA సాంప్రదాయ, ఆధునికతల కలబోత. విజ్ఞానానికి, నైపుణ్యానికి ప్రతీక. ఇక నుంచి ABP Desam ద్వారా వినూత్నమైన వార్తాంశాలను నిత్య నూతనంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఐరా అందిస్తుంది. ఇన్నేళ్లలో ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీ అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ఈ మార్పులకు తగ్గట్టుగానే న్యూస్ ప్రజెంటేషన్‌లో మార్పులు తీసుకొచ్చింది ABP నెట్‌వర్క్. కొన్ని సంవత్సరాలుగా జర్నలిజంలో చాలా మార్పులు వచ్చాయి. ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది. వార్తలు అందించే ప్లాట్‌ఫామ్స్ పెరిగిపోయాయి. ఇప్పుడంతా డిజిటల్ జర్నలిజం ట్రెండ్ కొనసాగుతోంది. అందుకే తెలుగు రీడర్స్‌కి కూడా దగ్గరవ్వాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ABP Desam న్యూస్ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించింది ఏబీపీ నెట్‌వర్క్.
తక్కువ సమయంలోనే మంచి రీడర్‌షిప్‌ని ఏబీపీ దేశం సంపాదించుకుంది. ఇప్పుడు తెలుగు వీక్షకుల కోసం AIRA ను కూడా తీసుకొస్తోంది. ABP Desam వెబ్‌సైట్, యాప్‌తో పాటు అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఐరాని లాంఛ్ చేయడంపై ABP Network CEO అవినాష్ పాండే సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ మరింత ముందుకెళ్తుందని ఊహించి.. ఓ విజన్‌తో AI యాంకర్‌ని ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు.
ABP Desam ప్రయాణం మొదలై కేవలం రెండేళ్లే అయినా మిగతా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌కి గట్టి పోటీ ఇస్తూ మంచి కంటెంట్‌ని అందిస్తోంది. కేవలం YouTubeలోనే 58 కోట్ల ఇంప్రెషన్స్ సాధించింది. తెలుగు న్యూస్ పబ్లిషర్స్‌లో అత్యంత వేగంగా దూసుకు పోతున్న ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచింది. సోషల్ మీడియాలోనూ ఇదే స్థాయిలో అందరికీ చేరువవుతోంది. లాంఛ్ అయినప్పటి నుంచి Facebookలో 100 మిలియన్ వ్యూస్‌ని సాధించింది. ఈ రెండేళ్లలో వెబ్‌సైట్‌లో లక్షకుపైగా స్టోరీస్‌ని పబ్లిష్ చేసిన ఘనత ఏబీపీ దేశానిదే. గూగుల్ సెర్స్, డిస్కవర్ సోర్సెస్‌లో 100 కోట్ల ఇంప్రెషన్స్ సాధించింది. అతి తక్కువ సమయంలోనే Comscore Rankingలో టాప్ 5లో చోటు దక్కించుకుంది ABP Desam. ఈ విజయాలకు కారణం అన్ని రకాల కంటెంట్‌ని అందించడమే. పదికి మించిన ఫార్మాట్‌లు, 30కి పైగా జానర్స్‌లో కంటెంట్ అందిస్తోంది. టెక్స్ట్, వీడియోలు, ఫొటో గ్యాలరీలు, షార్ట్ వీడియోస్, వెబ్‌స్టోరీస్ ద్వారా ఆసక్తికర కంటెంట్‌నీ రీడర్స్‌కి చేరువ చేస్తోంది.
పాలిటిక్స్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, హెల్త్, లైఫ్‌స్టైల్,బిజినెస్, రిలీజియన్‌తో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల ఇంటర్వ్యూలతో తెలుగు ఆడియెన్స్ అభిరుచులకు అనుగుణంగా వైవిధ్యమైన కంటెంట్ అందిస్తోంది. న్యూస్‌లో 360 డిగ్రీ కవరేజ్ ABP Desam ప్రత్యేకత. ఇప్పుడు రెండో వార్షికోత్సవం సందర్భంగా AIRAని లాంఛ్ చేస్తూ మరింత ప్రత్యేకంగా నిలవనుంది.
ABP Network ప్రస్థానం
భారతీయ మీడియా రంగంలో ABP Networkది ప్రత్యేకమైన స్థానం. వినూత్నమైన, నాణ్యమైన బ్రాడ్ కాస్ట్, డిజిటల్ కంటెంట్ అందిస్తూ ABP Network కచ్చితమైన, నమ్మదగిన మీడియా సంస్థగా గుర్తింపు పొందింది. విభిన్న భాషల్లో దేశవ్యాప్తంగా 53.5 కోట్ల మందికి చేరువైంది. కేవలం న్యూస్ మాత్రమే కాకుండా ఏబీపీ క్రియేషన్స్ సంస్థ కింద ఏబీపీ స్టూడియోస్ పేరుతో ఎంటర్‌టైన్ మెంట్, ఒరిజినల్ కంటెంట్ ను రూపొందిస్తోంది. ABP Network అనేది ఏబీపీ గ్రూపులోని ముఖ్యమైన విభాగం. ABP Group 100 ఏళ్ల క్రితం ప్రారంభమైన తొలితరం మీడియా సంస్థల్లో ఒకటి. శతాబ్ద కాలంగా ఆ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తోంది.