Sarkaru Vaari Paata Movie Review - 'సర్కారు వారి పాట' రివ్యూ: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎలా ఉందంటే?
Mahesh Babu's Sarkaru Vaari Paata - SVP Movie Review: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'సర్కారు వారి పాట'. నేడు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...
పరశురామ్
మహేష్ బాబు, కీర్తీ సురేష్, సముద్రఖని, నదియా, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు తదితరులు
సినిమా రివ్యూ: 'సర్కారు వారి పాట'
రేటింగ్: 2.5/5
నటీనటులు: మహేష్ బాబు, కీర్తీ సురేష్, సముద్రఖని, నదియా, 'వెన్నెల' కిశోర్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, ప్రభాస్ శీను, 'సత్యం' రాజేష్ తదితరులు
కళా దర్శకత్వం: ఏఎస్ ప్రకాష్
కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
పాటలు: అనంత శ్రీరామ్
సినిమాటోగ్రఫీ: మది
సంగీతం: తమన్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
కథ, కథనం, మాటలు, దర్శకత్వం: పరశురామ్ పెట్ల
విడుదల తేదీ: మే 12, 2022
'సర్కారు వారి పాట' పాటలు, టీజర్, ట్రైలర్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్‌గా, హుషారుగా, మాసీగా కనిపించారు. అభిమానులు కోరుకునే విధంగా ఆయన క్యారెక్టరైజేషన్ ఉందని అనిపించింది. సినిమా విడుదలకు ముందు పాటలు భారీ విజయం సాధించడం... ట్రైలర్‌లో మహేష్ డైలాగ్స్ అండ్ మేనరిజమ్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి, సినిమా (Sarkaru Vaari Paata Review) ఎలా ఉంది?
కథ: మహి... మహేష్ (మహేష్ బాబు) అమెరికాలో అప్పులు ఇస్తూ ఉంటాడు. అప్పుగా ఇచ్చిన డబ్బులు, వడ్డీ వసూలు చేయడం కోసం ఎంత దూరమైనా వెళతాడు. అతడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. అలాంటోడు విశాఖ వస్తాడు. ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు రాజేంద్రనాథ్ (సముద్రఖని) తనకు పదివేల డాలర్లు ఇవ్వాలని... అతడిని నడి రోడ్డు మీదకు తీసుకొస్తాడు. మహి, రాజేంద్రనాథ్ మధ్య గొడవ ఏంటి? రాజేంద్రనాథ్ కుమార్తె కళావతి (కీర్తీ సురేష్), మహి మధ్య అమెరికాలో ఏం జరిగింది? అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మహి గతం ఏమిటి? చివరకు ఏం చేశాడు? ఎటువంటి పాఠం నేర్పాడు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ: 'ఎక్కడబడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా... చూసుకోవాలి' - ఇదీ 'సర్కారు వారి పాట'లో ఓ డైలాగ్. మహేష్ బాబు నోటి వెంట వచ్చినప్పుడు బావుంటుంది. ఫ్యాన్స్ కోసమే కొన్ని సీన్లు, హీరో మేనరిజమ్స్ డిజైన్ చేసినట్టు ఉన్నారు. అవన్నీ బావున్నాయి. అయితే, థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సందేహం వస్తుంది... దర్శకుడు పరశురామ్ ఫ్యాన్స్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమా తీశారా? అని! ఎందుకంటే... సూపర్ స్టార్ అభిమానులను ఆకట్టుకునే అంశాలపై, హీరో క్యారెక్టరైజేషన్ మీద పెట్టిన దృష్టి కథ, కథనం, దర్శకత్వంపై పెట్టలేదు.
హీరో ఇంట్రడక్షన్ ఫైట్, హీరోయిన్‌తో సన్నివేశాలు, 'కళావతి...' పాట - ఫస్టాఫ్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. దాంతో ఎటువంటి కంప్లయింట్స్ ఉండవు. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. అప్పటి నుంచి కథనం, దర్శకత్వం గాడి తప్పాయి. అప్పటి వరకూ లాజిక్కులు పక్కన పెట్టి తెరపై మహేష్, కీర్తీ మేజిక్‌ను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు... మళ్ళీ అటువంటి మేజిక్ కోసం ఎదురు చూసే పరిస్థితి. సెకండాఫ్‌లో మహేష్, కీర్తీ సురేష్, సుబ్బరాజ్ సీన్స్ కూడా ఆ మేజిక్ రిపీట్ చేయలేకపోయాయి. పైగా, ఎబ్బెట్టుగా ఉన్నాయి. అప్పుల బాధ్య తాళలేక, బ్యాంకు లోన్లు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడిన సామాన్యుల వేదన, భావోద్వేగాలను తెరపైకి సరిగా ఆవిష్కరించడంలో పరశురామ్ పూర్తిగా తడబడ్డారు. ఆ భావోద్వేగాలతో ప్రేక్షకులు ప్రయాణించేలా సినిమా తీసుంటే ఫలితం మరోలా ఉండేది. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, బ్యాంకు ఉద్యోగుల పనితీరు వివరించే సన్నివేశాలు బావున్నాయి.
'కళావతి...', 'మ మ మహేశా...' పాటలు ఆల్రెడీ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఆ రెండూ స్క్రీన్ మీద కూడా బావున్నాయి. అయితే, 'పెన్నీ' సాంగ్ ఆశించిన స్థాయిలో లేదు. పాటల పరంగా తమన్ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతంలో ఆయన నిరాశ పరిచారని చెప్పాలి. 'అఖండ' సహా కొన్ని చిత్రాలకు తమన్ నేపథ్య సంగీతం బలంగా నిలిచింది. అందువల్ల, ఆయన నుంచి ప్రేక్షకులు ఎక్కువ ఆశిస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టు 'సర్కారు వారి పాట' నేపథ్య సంగీతం లేదని చెప్పాలి. సంగీతం పక్కన పెడితే... మది ఛాయాగ్రహణం బావుంది. ప్రతి ఫ్రేమ్‌ను అందంగా చూపించారు. అయితే, ఇంటర్వెల్ ముందు వచ్చే బీచ్ ఫైట్‌లో విజువల్ ఎఫెక్ట్స్ బాలేదు. విశాఖ రోడ్డు మీద వచ్చే సన్నివేశంలోనూ అంతే! మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఇటువంటి చిన్న చిన్న తప్పులను సైతం ప్రేక్షకులు నిశితంగా గమనిస్తారు.
నటీనటుల విషయానికి వస్తే... మహేష్ బాబు హ్యాండ్సమ్‌గా కనిపించారు. లుక్స్, స్టయిల్స్, హెయిర్ స్టయిలింగ్ పరంగా రీసెంట్ టైమ్స్‌లో మహేష్ బెస్ట్ వెర్షన్ అని చెప్పవచ్చు. నటనలోనూ ఆ అందం కనిపించింది. కీర్తీ సురేష్‌తో ప్రేమలో పడే సన్నివేశాల్లో కుర్రాడు అయిపోయారు. ఫైట్స్ బాగా చేశారు. 'మ మ మహేశా...' పాటలో హుషారుగా డ్యాన్సులు చేశారు. డైలాగ్ డెలివరీలో కొత్త మాడ్యులేషన్ చూపించారు. మొత్తం మీద మహేష్ బాబు కొత్తగా కనిపించారు. కీర్తీ సురేష్ కూడా అంతే! నటనతోనూ, గ్లామర్‌తోనూ ఆకట్టుకుంటారు. సాంగ్స్‌లో మరింత అందంగా ఉన్నారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బావుంది. 'వెన్నెల' కిశోర్, మహేష్ మధ్య మంచి సన్నివేశాలు ఉన్నాయి. మహేష్, కిశోర్ కామెడీ టైమింగ్ కుదిరింది. విలన్‌గా సముద్రఖని, కీలక పాత్రల్లో నదియా, తనికెళ్ళ భరణి, సుబ్బరాజు తదితరులు కనిపించారు.
ఓవరాల్‌గా 'సర్కారు వారి పాట' గురించి చెప్పాలంటే... విడుదలకు ముందు ఈ సినిమాలో ఎటువంటి సందేశం ఇవ్వలేదని మహేష్ బాబు చెప్పారు. కానీ, ఇది సందేశంతో కూడిన కమర్షియల్ సినిమా. కొందరు బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు వేలకోట్లు అప్పులు తీసుకుని ఎగొట్టడం వల్ల సామాన్య ప్రజలపై ఎంత భారం పడుతుందనేది చెప్పిన చిత్రమిది. ఎంత మంది ఆత్మహత్యలకు కారణం అవుతుందనేది చెప్పిన చిత్రమిది. కమర్షియల్ ఫార్మాట్‌లో ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు పరశురామ్ ఈ కథను చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. అయితే, సినిమాను నిలబెట్టడానికి మహేష్ బాబు శాయశక్తులా కృషి చేశారు. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశారు. సూపర్ స్టార్ అభిమానుల కోసం ఈ 'సర్కారు వారి పాట'. కొత్త మహేష్ బాబును చూడటం కోసం సామాన్య ప్రేక్షకులు సైతం ఒకసారి వెళ్ళవచ్చు.
Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?