335 మందితో డేటింగ్.. స్ఫూర్తి నింపుతున్న యువకుడి డేరింగ్ స్టెప్, మరో 30 మందిని కలిస్తే..
ఒక్క యువతిని డేటింగ్ పిలవాలంటేనే మనకు చెమటలు పడతాయి. అలాంటిది అతడు సుమారు 335 మందితో డేటింగ్ చేయగలిగాడు. అదెలా సాధ్యమైందంటే..
వామ్మో.. 335 మంది మహిళలతో డేటింగా? అతడికి వేరే పనేం లేదా? అని ఏవేవో ఆలోచించేస్తున్నారా? ఆగండి.. ఆగండి.. డేటింగ్ అంటే అదొక్కటే కాదు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఇటీవల డేటింగ్ యాప్‌లు ఎక్కువైపోవడం వల్ల ప్రతి ఒక్కరూ దాన్ని తప్పుగా భావిస్తున్నారు. వాస్తవానికి ‘డేటింగ్’ అంటే అమ్మాయిలు, అబ్బాయిలు చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. ఏకాంతంగా గడపడం కాదు. నచ్చిన వ్యక్తితో ఒక రోజంతా సరదాగా గడపడం. చెన్నైకు చెందిన ఓ యువకుడు ఇప్పుడు అదే చేస్తున్నాడు. అయితే, సరదా కోసం కాదు.. ఒక మంచి ఉద్దేశంతో. ఇప్పటికే అతడు 335 మందితో విజవంతంగా డేటింగ్ చేశాడు. మరో 30 మంది మహిళలను కలిస్తే అతడి టార్గెట్ పూర్తవుతుంది. ఇంతకీ అతడి లక్ష్యం ఏమిటో తెలుసా?
తమిళనాడులోని చెన్నైకు చెందిన నటుడు, ప్రొఫెనల్ డ్యాన్సర్, ఫొటోగ్రాఫర్ సుందర్ రాము.. ఫేస్‌బుక్ పేజీ చూస్తే అన్నీ అమ్మాయిలు, అమ్మమ్మల ఫొటోలే ఉంటాయి. అతడు డేటింగ్ చేసిన ప్రతి ఒక్క మహిళ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటు. సుందర్ రామ్ డేటింగ్ వెనుక మంచి ఉద్దేశం ఉంది. మహిళల హక్కులు, భద్రత గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించాలనే లక్ష్యంతోనే రాము అరుదైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మొత్తం 365 మంది మహిళలతో డేటింగ్ చేయాలనేది అతడి టార్గెట్. ఇప్పటివరకు 335 మందితో డేటింగ్ చేసి లక్ష్యానికి చేరువయ్యాడు. ఇంకో 30 మందితో డేటింగ్ పూర్తి చేస్తే లక్ష్యం పూర్తవుతుంది.
2015 నుంచి ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. ఇప్పటివరకు అతడు ఎంతోమంది మహిళలతో డేటింగ్ చేశాడు. వారిలో చెత్త ఎత్తే మహిళల నుంచి పోలీసులు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ ఉన్నారు. అంతేకాదు.. అమెరికా, వియత్నాం, స్పెయిన్, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన మహిళలతో కూడా రామ్ డేటింగ్ చేశాడు. చివరికి అతడి నానమ్మతో కూడా డేటింగ్ చేశాడు. ఆమెతో కలిసి ఆలయానికి వెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఓ సరస్సు వద్ద చల్లని గాలిని ఆస్వాదిస్తూ.. సూర్యస్తమయాన్ని చూసి తరించారు. ఇప్పటి వరకు తాను చేసిన డెటింగుల్లో బెస్ట్ ఇదేనని రాము చెప్పడం విశేషం.
నేటి యువత డేటింగ్ అంటే రొమాన్స్, సెక్స్ అనే ఉద్దేశంతోనే ఉంటారు. కానీ, రామ్ ఉద్దేశం వేరు. మహిళలకు కనీసం ఒకరోజైనా ప్రేమను పంచడం. వారి కష్టాలను తెలుసుకుని సాయం చేయడం లేదా వారి జీవితంలో ఒక రోజు మరపురానిదిగా మార్చడం. రాము ఈ డేటింగ్‌ను ఎంచుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. 2012లో ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఘటన రామ్‌ను కలచివేసింది. ‘‘ఆ ఘటన తర్వాత నేను ఎన్నో నిద్రలేని రాత్రళ్లు గడిపాను. అప్పుడే మహిళల హక్కులు, భద్రత కోసం ఏమైనా చేయాలని ఆలోచించాను’’ అని రామ్ తెలిపాడు.
Also Read: రమణ్ కాదు రాక్షసుడు.. 41 మందిని చంపాడు, చివరికి కోడి కూర తిని..
2015, జనవరి నెలలో తొలిసారిగా రాము తన ఫేస్‌బుక్ పేజీలో ఈ డేటింగ్ ప్లాన్ గురించి పోస్ట్ చేశాడు. డేటింగ్ చేయాలనుకుంటున్న మహిళలు తనని సంప్రదించాలని కోరాడు. ఇందుకు ప్రతిఫలంగా తనకు భోజనం పెట్టడం లేదా నగదు చెల్లించాలని కోరాడు. తనతో డేటింగ్ చేసిన చాలామంది మహిళలు తనకు భోజనం పెట్టి.. కడుపు నింపారని రాము తెలిపాడు. వారి వల్ల తనకు భోజనం ఖర్చులు మిగిలేవని, ఆ డబ్బులన్నీ దాచిపెట్టి చారిటీలకు విరాళంగా ఇస్తున్నానని చెప్పాడు. వరుస డేటింగ్‌ల వల్ల రామును అంతా ‘సీరియల్ డేటర్’, ‘365 డేట్స్ మ్యాన్’, ‘ది డేటింగ్ కింగ్’ అని పిలిచేవారు.
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!
‘‘నేను మహిళలకు మర్యాదనిచ్చే కుటుంబంలో జన్మించాను. ఆడ, మగ అంటూ లింగ బేధాలు చూపని స్కూల్లోనే చదువుకున్నాను. కానీ, నేను బయటకు అడుగుపెట్టిన తర్వాతే అసలు విషయం తెలిసింది. ఈ ప్రపంచంలో లింగ బేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమైంది. నా డేటింగ్ ప్లాన్‌కు ఇది కూడా ఒక కారణం. నాకు పెళ్లయ్యింది. కానీ, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నా. నా డేట్స్ అన్నీ లైంగిక అవసరాల కోసం కాదు. కేవలం ప్రేమను పంచడమే నా లక్ష్యం. మహిళల్లో ఒంపు సొంపులనే కాదు.. వారిని సమస్యలను కూడా తెలుసుకోవాలి. నేను డేటింగ్ చేసిన ప్రతి ఒక్క మహిళ గురించి ఫేస్‌బుక్‌లో ఇదే చెబుతాను. మీరు కలిసే మహిళ జీవితంలోకి ఒక్కసారి అడుగుపెట్టండి. ఆమెతో ట్రావెల్ చేయండి. ఆమెను అర్థం చేసుకోండి. దాని వల్ల మీకు ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయని చెబుతాను. అయితే, నా డేట్ 365 మందితో మిగిలిపోదు. మున్ముందు కూడా కొనసాగుతుంది’’ అని సుందర్ రాము వెల్లడించాడు.
Also Read: లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోయింది.. ఒక్క రాత్రిలో రూ.437 కోట్లకు అధిపతి అయ్యాడు!