ఈత మెదడుకు మేత - సమ్మర్‌లో స్విమ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వెసవి కనుక చెమట, వేడి మూలాన వర్కవుట్ విసుగ్గా ఉంటుంది. అలా విసుగు రాని వ్యాయామం ఈత. ఈత కొట్టడం ఈ వేడి వాతావరణంలో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఉత్సాహంగానూ అనిపిస్తుంది.
ఈ పోస్ట్ పాండమిక్ కాలంలో ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేమన్నట్టు ఉంది పరిస్థితి. అర్థాంతర, అకస్మాత్తు మరణాలు బెంబెలెత్తిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్న మరణాలు అందరిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎంత బద్దకస్తులైనా ఎంతో కొంత ఫిట్ నెస్ జాగ్రత్తల గురించే ఆలోచిస్తున్నారు. ఆహారం, విశ్రాంతి, వ్యాయామం తప్పనిసరిగా టైమ్ టేబుల్ లో సమయం కేటాయించాల్సిన అంశాలైపోయాయి. వాకింగ్ చేసేవారు కొందరైతే, జిమ్ముల్లో చేరిన వారు కొందరు. యోగాలు చేసే వారు మరికొందరు. తప్పని సరిగా కొంత కార్డియో వర్కవుట్ అవసరం. అది శరీరం, మనసును చురుకుగా ఉంచుతుంది. భవిష్యత్తులో మెమొరీలాస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారి మెదడు కూడా చాలా చురుకుగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎరోబిక్ వర్కవుట్ వల్ల మెదడులోని భాగం హిప్పోకాంపస్ పరిమాణం పెరుగుతుందట. ఫలితంగా లర్నింగ్ కెపాసిటి, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. ఈత మంచి ఫన్ తో కూడిన వర్కవుట్ గా చెప్పుకోవచ్చు. వేసవి కాలంలో చురుగ్గా ఉండేందుకు మంచి కూల్ వర్కవుట్ స్విమ్మింగ్. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈత ఏ కాలంలో అయినా మంచి వ్యాయామం. చెమట విసుగ్గా అనిపించే వారికి ఈత మంచి వర్కవుట్ ఆప్షన్. సూపర్ కూల్ కార్డియో వర్కవుట్.
- చికాకు, అలసట తెలియని వ్యాయామం. శరీరంలోని ప్రతి కండరానికి పని కల్పించవచ్చు. చేతులు, భుజాలు, వీపు కండరాలు, కాళ్ళు, పిక్కలు, తొడలు ఇలా ప్రతి కండరం ఈతలో వాడాల్సి ఉంటుంది.
- లంగ్ కెపాసిటి మెరుగవుతుంది. పాండమిక్ సమయంలో కోవిడ్‌కు గురికావడం వల్ల చాలామందిలో లంగ్ కెపాసిటి తగ్గిపోయింది. అది తిరిగి పుంజుకునేందుకు ఈత ఒక మంచి సాధన.
- ఈత వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది
- స్ట్రోక్, గుండె సమస్యలను స్విమ్మింగ్ నివారిస్తుంది.
- శరీరాకృతి మెరుగుపడుతుంది. చాలా త్వరగా బరువు తగ్గవచ్చు.
- రన్నింగ్ జాగింగ్ తో పోలిస్తే మరింత మెరుగైన కార్డియో వ్యాయామం.
- ఎంత వేగంగా ఈత కొడితే అంత వేగంగా క్యాలరీలను ఖర్చు చెయ్యవచ్చు.
- ఈత వల్ల వ్యాయామం మాత్రమే కాదు ఈతతో ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది.
- ఈత కొలనులో ఈతతో పాటు రకరకాల ఆటలు కూడా ఆడుకోవచ్చు.
- తక్కువ శ్రమతో ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తూ వినోదం కూడా పొందగలిగే అతి ముచ్చటైన వ్యాయామం ఈత.
వేసవిలో వ్యాయామం వల్ల త్వరగా అలసిపోతారు. సరైన జాగ్రత్తలు తీసుకోక పోతే డీహైడ్రేట్ అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఎక్కువ నీళ్లు తాగడం తప్పనిసరి. అలసట రాకుండా మంచి శక్తినిచ్చే ఆహారం కూడా తీసుకోవాలి. వేపుళ్లు, నూనెపదార్థాలకు, మసాలా వంటలకు దూరంగా ఉండడం వేసవిలో మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లబరుచుకునేందుకు సాఫ్ట్ డ్రింక్స్ కి బదులుగా పండ్ల రసాలు, మజ్జిగ వంటివి మంచి ఆప్షన్. ఇది పండ్లు విరివిగా లభించే కాలం కనుక ఎక్కువ పండ్లు వినియోగించే ప్రయత్నం చెయ్యాలి.
Read Also: ఛీ పాడు, ఇవేం ప్రకటనలు? దేశంలో దుమారం రేపిన వివాదాస్పద యాడ్స్ ఇవే - వీటిలో ఉన్న తప్పేంటి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.