TSPSC: టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రాతపరీక్షలు వాయిదా! కారణమిదే!
తెలంగాణలో మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా పడిందని టీఎస్‌పీఎస్సీ మార్చి 11న ఒక ప్రకటనలో తెలిపింది.వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష కూడా వాయిదా.
తెలంగాణలో మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష వాయిదా పడిందని టీఎస్‌పీఎస్సీ మార్చి 11న ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మార్చి 15, 16న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష కూడా వాయిదా వేసినట్టు కమిషన్ పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ హ్యాక్ అయిందని అనుమానిస్తున్నారు. హ్యాకింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని అధికారులు తెలిపారు. వాయిదా పడిన పరీక్షల తేదీలు మళ్లీ ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
తెలంగాణలో టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (TPBO) పోస్టుల భర్తీకి మార్చి 12న నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ గతంలో ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మార్చి 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 12న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే పరీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్‌పీఎస్సీ తాజాగా వెల్లడించింది.
TPBO పరీక్ష హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో మార్చి 12న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. రెండు విభాగాల నుంచి 300 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు, అభ్యర్థి సంబంధిత సబ్జెక్ట్ నుంచి 150 ప్రశ్నలు-150 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయిస్తారు.
తెలంగాణలో పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టుల భర్తీకి మార్చి 15, 16 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 10న విడుదల చేసింది. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందువరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చి 11న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 15, 16 తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి 15న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-ఎ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్-బి కేటగిరీ పోస్టుల భర్తీకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ కామన్‌గా ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకప్రకటనలో తెలిపింది.
హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెటర్నరీ & ఏనిమల్ హస్బెండరీ విభాగంలో ఖాళీల భర్తీకీ డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఎ&బి) పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో క్లాస్-ఎ విభాగంలో 170 పోస్టులు, క్లాస్-బి విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.54,220 – రూ.1,33,630 జీతంగా ఇస్తారు.