TS Kanti Velugu Jobs: 'కంటి వెలుగు' ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలు విడుదల, వివరాలు ఇలా!
పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలను వైద్యారోగ్య శాఖ నవంబరు 30న విడుదల చేసింది. ఈ నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు.
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత 'కంటి వెలుగు' కోసం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమయ్యే సిబ్బంది కోసం ప్రత్యేక నియామకాలు చేపట్టనుంది. ఇందులో భాగంగా పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలను వైద్యారోగ్య శాఖ నవంబరు 30న విడుదల చేసింది. ఈ నియామక బాధ్యత జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలు చేపట్టనున్నారు.
అర్హతలు: రెండేళ్ల డిప్లొమా (DOA/DOM). పారామెడికల్ బోర్డులో సభ్యత్వం ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.
నియామక షెడ్యూలు..
➥ డిసెంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
➥ డిసెంబరు 5న ఇంటర్వ్యూ నిర్వహణ.
➥ డిసెంబరు 7న ప్రాథమిక ఎంపిక జాబితా విడుదల, అభ్యంతరాలకు ఆహ్వానం.
➥ డిసెంబరు 8న మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది.
➥డిసెంబరు 10న ఎంపికైన అభ్యర్థుల తుది మెరిట్ జాబితా వెల్లడి.
1491 వైద్య బృందాల ఏర్పాటు..
కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు -2 ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే.. ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి వైద్యారోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
➥కంటి వెలుగు నిర్వహించే ఒక్కో క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఆప్టో మెట్రీషియన్, 6-8 మంది సహాయ సిబ్బంది (ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్సులు, సూపర్ వైజర్, ఆశ వంటివారు) ఉంటారు. ప్రతి బృందానికి ఒక వాహనం కేటాయిస్తారు.
➥ ఒక రోజులో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో క్యాంపులో 300 మంది, పట్టణ ప్రాంతాల్లో 400 మందిని పరీక్షిస్తారని అంచనా.
➥ రద్దీకి అనుగుణంగా అదనపు క్యాంపులు నిర్వహించేందుకు జిల్లాకు అదనంగా 4-6 మంది మెడికల్ ఆఫీసర్లు లేదా ఆప్టో మెట్రీషియన్లు అందు బాటులో ఉంటారు.
➥ గ్రామీణ పీహెచ్‌సీల్లో, పట్టణాల్లో వార్డుల వారీగా క్యాంపులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి హరీశ్ రావు సమీక్ష..
కంటివెలుగు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో నవంబరు 29న హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో మంత్రి ఎర్రబెల్లితో కలిసి మంత్రి హరీశ్‌రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘నివారించదగిన అంధత్వ రహిత తెలంగాణ’ లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు అమలుచేస్తున్న రెండో విడత కంటివెలుగు విజయవంతానికి సర్వం సిద్ధం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయిస్తూ పాలనా అనుమతులు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని, అవసరమైన వారికి ఉచితంగా కండ్లద్దాలు అందించాలని స్పష్టంచేశారు. జనవరి 18న సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. 100 పనిదినాల్లో లక్ష్యం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మొదటి దఫాలో 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు ఆ సంఖ్యను 1500కు పెంచుతున్నట్టు తెలిపారు. ఈ సారి కూడా కంటివెలుగును ‘క్యాంప్ మోడ్’లో నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో క్యాంపులు నిర్వహించి కంటి పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం 5 నెలల పాటు కొనసాగుతుందని వెల్లడించారు.
‘కంటి వెలుగు’ ఇక శాశ్వతం..
ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కంటి వెలుగు పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలోని అందరికీ కంటి పరీక్షలు నిర్వహించిన సర్కారు, అవసరమైన వాళ్లందరికీ ఉచితంగా కళ్లద్దాలు, కంటి ఆపరేషన్లు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే అమలవుతున్న పలు పథకాలతో పాటు కంటి వెలుగు పథకాన్ని కూడా మరో మారు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జనవరి నెల నుంచి ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించనుంది ప్రభుత్వం. అంతేకాదు కంటి వెలుగు పథకాన్ని శాశ్వతంగా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ స్కీం ద్వారా నిరంతర సేవలు కొనసాగనున్నాయి.