Shock For Wipro: టెర్మినేషన్ లెటర్‌లో అలా రాస్తారా ? మాజీ ఉద్యోగికి 2 లక్షలు ఇవ్వండి - విప్రోకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
Wipro: ఉద్యోగి టెర్మినేషన్ లెటర్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు రాసినందుకు విప్రోకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ ఉద్యోగికి రూ.2లక్షలు చెల్లించాలని ఆదేశించింది.

Wipro to pay Rs 2 lakh to ex employee: భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ అయిన విప్రో లిమిటెడ్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ ఉద్యోగి అభిజిత్ మిశ్రాకు ఇచ్చిన టెర్మినేషన్ లెటర్ లో పరువు తీసేలా వాక్యాలు ఉన్నాయని అందుకు గాను రూ. 2 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ లేఖలో “మాలిషియస్ కండక్ట్” (దురుద్దేశపూరిత ప్రవర్తన) , “కంప్లీట్ లాస్ ఆఫ్ ట్రస్ట్” (పూర్తి విశ్వాసం కోల్పోవడం ) వంటి పదాలు ఉన్నాయి. ఇవి మిశ్రా వృత్తిపరమైన గౌరవాన్ని , భవిష్యత్ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కోర్టు భావించింది. యజమానులు టెర్మినేషన్ లెట్రలలో జాగ్రత్తగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని హెచ్చరించింది.
అభిజిత్ మిశ్రా, విప్రోలో 2018 నుండి 2020 వరకు విప్రోలో ప్రధాన కన్సల్టెంట్‌గా పనిచేశారు. జూన్ 5, 2020న అతని ఉద్యోగ ఒప్పందం రద్దు చేశారు. టెర్మినేషన్ లెటర్‌లో దురుద్దేశపూరిత ప్రవర్తన కారణంగా విశ్వాసం కోల్పోయాడని రాశారు. దీంతో విప్రోపై మిశ్రా పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. రూ. 2.10 కోట్లకు పైగా పరిహారంతో పాటు గౌరవనీయంగా ఉండే మరో టెర్మినేషన్ లేఖ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. దిల్లీ హైకోర్టులో జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ఈ కేసును విచారించారు. విచారణ తర్వాత జస్టిస్ కౌరవ్ తీర్పు ఇచ్చారు. విప్రో రద్దు లేఖలోని వ్యాఖ్యలు “స్టిగ్మాటిక్” , “ఇన్‌సిన్యుయేషన్స్” (ఆక్షేపణలు)తో నిండి ఉన్నాయని, ఎటువంటి ఆధారాలు లేకుండా అభ్యంతరకరంగా ఉన్నాయని తేల్చారు. ఈ వ్యాఖ్యలు మిశ్రా భవిష్యత్ ఉపాధి అవకాశాలను , వృత్తిపరమైన గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసాయని కోర్టు గుర్తించింది.
విప్రోను మిశ్రాకు రూ. 2 లక్షల సాధారణ పరిహారం (జనరల్ డ్యామేజెస్) చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే అభ్యంతరకర వ్యాఖ్యలు లేకుండా కొత్త టెర్మినేషన్ లెటర్ ఇవ్వాలని ఆదేశించింది. టెర్మినేషన్ లేఖలోని వ్యాఖ్యలు వ్యక్తిత్వ హననం కు సమానమని, ఇవి యజమాని-ఉద్యోగి సంబంధాన్ని ముగించడానికి మాత్రమే కాకుండా, మిశ్రా పరువును దెబ్బతీసే ఉద్దేశంతో రాసినట్లు సూచిస్తున్నాయని పేర్కొన్నారు. మిశ్రా ఒక సీనియర్, మేనేజిరియల్ ఉద్యోగిగా ఉండి.. వృత్తిపరమైన విధులపై దృష్టి పెట్టకుండా, “సామాజిక మార్పు కోసం క్రూసేడర్”గా తనను తాను చిత్రీకరించడంలో ఎక్కువ ఆసక్తి చూపాడని ఆరోపించింది. అయితే ఈ ఆధారాలను విప్రో కోర్టుకు సమర్పించలేకపోయింది.
‘Character assassination’: Delhi HC asks Wipro to pay Rs 2 lakh for defamation of ex-employee; termination letter full of ‘stigma and insinuations’
— Crypto Junction (@CJunctionX) July 17, 2025
The Delhi High Court has directed Wipro to pay Rs 2 lakh to a former employee, Abhijit Mishra, in a defamation case. The court… pic.twitter.com/708C7BpjOd
ఈ తీర్పు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు కారణం అయింది. ఈ తీర్పును ఉద్యోగ హక్కులకు సంబంధించిన ముఖ్యమైన ఆదేశంగా పలువురు చర్చించారు. ఈ కేసు లో “కంపెల్డ్ సెల్ఫ్-పబ్లికేషన్” సిద్ధాంతాన్ని భారతీయ సందర్భంలో ఉపయోగించడం ద్వారా ఒక కొత్త ట్రెండ్ సృష్టించినట్లయిందని.. కంపెనీలు టెర్మినేషన్ లెటర్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ కేసు సూచిస్తోంది.





















