TET DSC: ఏపీటెట్, డీఎస్సీ ప్రకటనలు ఆలస్యం, వచ్చేవారమే నోటిఫికేషన్లు! అప్రెంటిస్‌షిప్ విధానం అమలు?
ఏపీలో డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్‌లు వచ్చే వారంలో విడుదల కానున్నాయి. టెట్ నోటిఫికేషన్ తర్వాత కొన్నిరోజుల వ్యవధిలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.
AP TET 2024: ఏపీలో డీఎస్సీ ద్వారా 6,100 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇటీవల కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే మొదట టెట్ నిర్వహించి, తర్వాత డీఎస్సీ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచే టెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. టెట్ నోటిఫికేషన్‌కు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. టెట్ నోటిఫికేషన్ తర్వాత కొన్నిరోజుల వ్యవధిలో డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్‌లు వచ్చే వారంలో విడుదల కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అప్రెంటిస్ విధానం అమలు..
తాజాగా అప్రెంటిస్‌షిప్ విధానాన్ని అమలు చేయనున్నారు. రాత పరీక్షలో ఎంపికైన టీచర్లకు రెండేళ్లపాటు గౌరవవేతనానికి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి స్కేల్ వస్తుంది. కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్, డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, టెట్, డీఎస్సీకి జనవరి 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. మొదట టెట్ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్, డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చేవారం విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET), డీఎస్సీని వేర్వేరుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టెట్‌కు ఫిబ్రవరి 1 నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది. అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తుల ఆధారంగా టెట్ పరీక్షల షెడ్యూలును అధికారులు ఖరారుచేయనున్నారు. ఒకవేళ దరఖాస్తులు భారీగా వస్తే.. పరీక్షల నిర్వహణకే 15 రోజులు పట్టే అవకాశం ఉంది. అయితే టెట్‌తో పాటే 10-15 రోజులు అటు ఇటుగా డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డీఎస్సీలో 6 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది.
ఎస్జీటీ పోస్టులు డీఈడీ అభ్యర్థులకే..
సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్(SA) పోస్టులకు పేపర్-2 విడివిడిగా టెట్ నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు డీఈడీ లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులు. టెట్ రాసేందుకు ఓసీలకు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులైన అభ్యర్థులకు డిగ్రీలో అర్హత మార్కులు 40 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీన్ని ఈ ఒక్కసారికే అనుమతించింది. గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. అప్పుడు మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. మొత్తం 6.08 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో పరీక్షలు ఇలా..
గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఆంగ్ల భాషలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టెట్, డీఎస్సీ రెండింటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యేనాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది.