Superstar Krishna Memorial: సూపర్ స్టార్ కృష్ణకు అరుదైన గౌరవం, మెమోరియల్ ఏర్పాటుకు మహేష్ నిర్ణయం
తెలుగు వెండి తెరపై మకుటం లేని మహారాజుగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ కేవలం సినిమాలతోనే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలను నిర్వహించారు. తెలుగు సినిమా పరిశ్రమకు సూపర్ స్టార్ కృష్ణ విశేష సేవలందించారు. సినిమాల్లో ఆయన చేసిన ప్రతీ కొత్త ప్రయత్నం సినిమా సాంకేతిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. అలాంటి నటుడి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందట ఆయన కుటుంబం. హైదరాబాద్ లోనే ఈ మెమోరియల్‌ను ఏర్పాటు చేయనున్నారు. అయితే దాన్ని పద్మాలయా స్టూడియోలో ఏర్పాటు చేస్తారా? లేదా వేరే చోట ఏర్పాటు చేస్తారా? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే ఈ మెమోరియల్‌లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహంతోపాటు ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు, ఆయన పొందిన అవార్డులు, షీల్డ్ లు ప్రదర్శించనున్నారట. అలాగే కృష్ణ దాదాపు 350 కు పైగా సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వేషధారణలను కూడా ఈ మెమోరియల్ లో ప్రదర్శించబోతున్నారని సమాచారం. వీటితో పాటు కృష్ణ జీవితానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు, గుర్తులు కూడా ఇక్కడ కనిపిస్తాయట. అలాగే అభిమానులు, సందర్శకులు కాసేపు సేద తీరేలా సుందరంగా మెమోరియల్ ను తీర్చిదిద్దనున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే కృష్ణ కుటుంబీకులు, సన్నిహితుల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నారట మహేష్. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
నిజానికి ఇలాంటి మెమోరియల్ ఏర్పాటు అనేది గొప్ప విషయమే. ఇప్పటి వరకూ ఏ సినీ నటుడికి ఇలాంటి స్మారక మందిరాలు నిర్మించ లేదు. సూపర్ స్టార్ కృష్ణ లాంటి నటులకు ఇలాంటి మెమోరియల్ ఏర్పాటు చేయడం ఒక గౌరవం అనే చెప్పాలి. కృష్ణ మెమోరియల్ ను నిర్మిస్తే ఆయన జీవితానికి, సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలు అభిమానులకు కూడా తెలుస్తాయి. అంతే కాకుండా భవిష్యత్ తరాల వారికి ఇలాంటి గొప్ప నటుల గురించి తెలుసుకునే అవకాశం దక్కుతుంది. తెలుగు సినిమా రంగానికి సుమారు నాలుగు దశబ్దాల పాటు కృష్ణ సేవలందించచారు. సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు తీసి ఔరా అనిపించారు, కౌ బాయ్, జేమ్స్ బాండ్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా సినిమా సాంకేతికతకు కృషి చేశారు.
తెలుగు వెండి తెరపై మకుటం లేని మహారాజుగా ఎదిగిన సూపర్ స్టార్ కృష్ణ కేవలం సినిమాలతోనే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. తాను పనిచేసిన నిర్మాతలు ఎప్పుడూ బాగుండాలని కోరుకునేవారట కృష్ణ. ఒక సినిమా ఫ్లాప్ అయినా మళ్ళీ అదే నిర్మాతతో సినిమా చేసి హిట్ ఇచ్చే వారట, అది కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న కన్నవారిని, పెరిగిన ఊరును ఎప్పుడూ దూరం పెట్టలేదు కృష్ణ. సొంత ఊరు బుర్రిపాలెంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు కృష్ణ. ప్రతీ సినిమా విడుదల సందర్భంగా ఊరు వెళ్లేవారు, తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకునేవారట. స్నేహితులు, సన్నిహితులను కలిసేవారట. ఆపద అని ఎవరు వచ్చినా సాయం చేయడానికి వెనకాడేవారు కాదట కృష్ణ. అందుకే అభిమానులు ఆయన్ను సూపర్ స్టార్ ను చేశారు. అలాంటి గొప్ప నటుడి జీవిత విశేషాలు, జ్ఞాపకాలు, గుర్తులు ఎప్పటికి పదిలంగా ఉండాలనే ఉద్దేశంతోనే మహేష్ ఈ మెమోరియల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Also Read: తండ్రి ఆస్పత్రిలో ఉన్నా మరో ప్రాణం కాపాడిన మహేష్ - ఆకాశానికి ఎత్తేస్తున్న నెటిజన్లు!