SS Rajamouli: బల్లారిలో శ్రీ అమృతేశ్వరాలయ ప్రాణ ప్రతిష్ట, హాజరైన దర్శకధీరుడు రాజమౌళి
బళ్లారిలో అత్యద్భుతంగా నిర్మించిన శ్రీ అమృతేశ్వర ఆలయంలో అట్టహాసంగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి దంపతులు పాల్గొన్నారు.
Sri Amriteshwaralaya Prana Pratishta in Ballari: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి బాలాజీనగర్ లో శ్రీ అమృతేశ్వర ఆలయం అద్భతంగా నిర్మితమైంది. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వారాహి అధినేతలు సాయి కొర్రపాటి ఈ ఆలయాన్ని కనీవీని ఎరుగని రీతిలో కట్టించారు. సుమారు రూ. 25 కోట్ల వ్యయంతో పరమ శోభాయమానంగా నిర్మించారు. వారణాసి విశ్వేశ్వరుడి పట్టపురాణి అన్నపూర్ణమ్మ తల్లి విగ్రహం ఒక వైపు కొలువుదీరగా, వారాహి అమ్మవారి తేజోవంతమైన విగ్రహం మరొక వైపు, శివ పార్వతుల ముద్దుల తనయుడు వినాయకుడు, మహా వెలుగుల నృసింహ భగవానుడు, కాశీ క్షేత్రపాలకుడైన కాలభైరవుని అత్యద్భుత విగ్రహాలతో ఈ ఆలయం నిర్మితమైంది. ఇవాళ ఈ ఆలయం ప్రాణ ప్రతిష్ట అట్టహాసం జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛారణల నడుము శ్రీ అమృతేశ్వరుడు కొలువు దీరాడు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి దంపతులు
శ్రీ అమృతేశ్వర ఆలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన సతీమణి రమతో పాటు, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సహా పలువురు సినీ ప్రముఖలు పాల్గొన్నారు. స్వామివారి ప్రాణ ప్రతిష్ట వేడుకలో పాల్గొని పునీతులయ్యారు. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాణప్రతిష్ట ఫోటోలు సోషల్ మీడియాలో గా వైరల్ అవుతున్నాయి.
Ace Director @ssrajamouli garu at #SreeAmrutheswaraTemple in Bellary for the Prana Prathishta ceremony.@SriAmruteshwara @VaaraahiCC @SaiKorrapati_ pic.twitter.com/iPxgdsnMwc
— Vamsi Kaka (@vamsikaka) February 29, 2024
రాజమౌళి అత్యంత సన్నిహితుడు సాయి కొర్రపాటి
వాస్తవానికి దర్శకుడు రాజమౌళికి సాయి కొర్రపాటి అత్యంత సన్నిహితుడు. సుమారు దశాబ్దంన్నరకు పైగా ఆయనతో పరిచయం ఉంది. వీరిద్దరు కలిసి ‘ఈగ‘ సినిమాను తీశారు. వారాహి బ్యానర్ లో వచ్చిన ‘ఈగ’ సినీ నిర్మాతగా ఆనాటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ఉత్తమ చలన చిత్ర నిర్మాత పురస్కారాన్ని అందుకున్నారు కూడా. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆలయ ప్రాణ ప్రతిష్టవేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మహేష్ బాబుతో రాజమౌళి మూవీ
అటు ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ‘RRR‘ సినిమా తర్వాత వస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన లుక్ ను పూర్తిగా మార్చుకుంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా పూర్తయ్యే వరకు మహేష్ బాబు బయట కనిపించడనే టాక్ వినిపించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్ కు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు ఇంటర్నేషనల్ వైడ్ హైప్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట. నిజానికి ‘RRR‘ సినిమా తర్వాత జేమ్స్ కామెరూన్ రాజమౌళిపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి పిలిస్తే ఆయన తప్పకుండా వస్తారని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయన వస్తే, ఈ సినిమా రేంజి ఓ రేంజిలో పెరగనుంది.
Read Also: అప్పుడు అలాంటి సీన్స్ చేయనని చెప్పాను - కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నా: అనన్య నాగళ్ల