Shamita Shetty: బాలీవుడ్ బ్యూటీకి అరుదైన సర్జరీ- హాస్పిటల్ బెడ్ మీద ఆమె చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు
నటి షమితా శెట్టికి అరుదైన వ్యాధి సోకింది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమె విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Actress Shamita Shetty Undergoes Endometriosis Surgery: బాలీవుడ్ నటి షమితా శెట్టి ఆనారోగ్యంతో హాస్పిటల్లో చేరింది. గత కొంత కాలంగా ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతున్న ఆమె, ప్రస్తుతం చికిత్స తీసుకుంటోంది. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేసింది. తనకు ఎదురైన ఆరోగ్య సమస్య గురించి అందరికీ వివరించే ప్రయత్నం చేసింది. మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించింది.
తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలు అయిన షమితా శెట్టి తెలుగు సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది. ‘పిలిస్తే పలుకుతా’ అనే మూవీతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆకాష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ, ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ మీదే ఎక్కువ ఫోకస్ చేసింది. అక్కడ కూడా ఆమె అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. తాజాగా బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోలనూ షమితా పాల్గొని సందడి చేసింది. తాజాగా ఆమె హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఓ వీడియో రిలీజ్ చేయడం పట్ల అభిమానులు షాక్ కు గురవుతున్నారు.
షమితాకు ఎండోమెట్రియోసిస్ సర్జరీ
షమితా తనకు వచ్చిన వ్యాధి గురించి వీడియోలో వివరించింది. కొంత కాలంగా ఎండోమెట్రియోసిస్ అనే సమస్యతో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? తనను ఈ వ్యాధి ఎలా ఇబ్బంది పెడుతుంది? మహిళలు ఈ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను వివరించింది. ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు మహిళలకు ఎదురవుతూనే ఉంటాయని చెప్పుకొచ్చింది. గర్భాశయంలో తలెత్తే ఈ వ్యాధికి తాజాగా సర్జరీ జరిగినట్లు వివరించింది. “మహిళలలకు వచ్చే సమస్యల్లో ఎండోమెట్రియోసిస్ ఒకటి. ఈ వ్యాధి సోకిన వారికి గర్భాశయంలో విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది. నేను కూడా చాలా పెయిన్ అనుభవించాను. మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయినప్పటికీ, చాలా మందికి ఈ విషయం తెలియదు. నేను మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత చెకప్ చేయించుకుంటే, డాక్టర్లు ఎండోమెట్రియోసిస్ గా తేల్చారు. తాజాగా సర్జరీ చేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపించారు. నా ఆరోగ్యం కోసం శ్రమించిన డాక్టర్లు అందరికీ కృతజ్ఞతలు. మళ్లీ ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మహిళలు ఎండోమెట్రియోసిస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. గర్భాశయంలో నొప్పి కలిగితే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది” అని షమితా వివరించింది.
View this post on Instagram
షమితా శెట్టిపై నెటిజన్ల ప్రశంసలు
హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే మహిళల్లో ఎండోమెట్రియోసిస్ పట్ల అవగాహన కలిగించే ప్రయత్నం చేసిన షమితా శెట్టిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి మహిళ ఆమె చెప్పిన సూచనలు పాటించాలని సూచిస్తున్నారు. షమితా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Read Also: స్టార్ హీరోతో దర్శకుడికి గొడవ - డైరెక్టుగా ఆన్‌లైన్‌లో మూవీ రిలీజ్, ఇంతకీ ఏం జరిగిందంటే?