Jai Hanuman Movie: ‘జై హనుమాన్’లో భల్లాల దేవుడు? ‘హను మాన్’లో ఆంజనేయుడి కళ్లు ఆయనవేనట!
Jai Hanuman Movie: తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ మూవీ తెరకెక్కబోతోంది.
Jai Hanuman Movie: చిన్న సినిమాగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ ఎరుగని విజయాన్ని అందుకుంది ‘హనుమాన్’ మూవీ. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టేకింగ్, తేజ సజ్జ అద్భుత నటనతో ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది. సంక్రాంతి కానుగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేసింది. కేవలం 10 రోజుల్లోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ఎండింగ్‌లో ‘హనుమాన్’ సీక్వెల్ ప్రకటించి ఆడియన్స్ లో క్యూరియాసిటి పెంచాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చివరి సన్నివేశాల్లో హనుమంతుడి పాత్రలో ఉన్నది ఎవరనేది చూపించకున్నా.. ప్రేక్షకులు మాత్రం అతను ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హనుమంతుడి పాత్ర కళ్లను చూస్తే రానా కళ్లలాగే ఉన్నాయని అంటున్నారు.
‘హనుమాన్’కు సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్’కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందని వెల్లడించారు. అంతేకాదు, ‘హనుమాన్’తో పోల్చితే ‘జై హనుమాన్’ వంద రెట్లు రెట్టింపు స్థాయిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే, ‘జై హనుమాన్’లో తేజ సజ్జ హీరో కాదంటూ అందరినీ షాక్‌కు గురి చేశాడు. తేజ హనుమంతు పాత్రలో మాత్రమే కనిపిస్తాడని, హీరో కాదని స్పష్టం చేశాడు. ‘జై హనుమాన్’లో హీరో ఆంజనేయ స్వామి పాత్రలో ఒక స్టార్ హీరో కనిపిస్తారని చెప్పాడు. ముందుగా అనుకున్నట్లుగానే ‘జై హనుమాన్’ 2025లోనే రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించే స్టార్ హీరో ఎవరు?
ప్రశాంత్ వర్మ ప్రకటనతో ప్రేక్షకులంతా ‘జై హనుమాన్’ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారు? అనే అంశంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘జై హనుమాన్’లో హీరోగా రానా దగ్గుపాటి కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హనుమంతుడి పాత్రకు రానా బాగా సరిపోతాడని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ‘జై హనుమాన్’ సినిమాలో శ్రీరాముడిగా రామ్ చరణ్ నటించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ‘హనుమాన్’గా మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇప్పటి వరకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాత్రలో కనిపించేది ఎవరు? అనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పలేదు. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
‘హనుమాన్’ మూవీ గురించి..
జనవరి 12న ‘హనుమాన్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యింది. హనుమంతుడి మహిమలో అద్భుత శక్తులు పొందే యువకుడు వాటిని ఎలా ఉపయోగించాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో తేజ సజ్జకు జంటగా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, సముద్ర ఖని, గెటప్ శ్రీను ‘హనుమాన్’ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంబంధించిన రెండో భాగం ‘జై హనుమాన్’ 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే ‘ జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు ప్రశాంత్ వర్మ. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రశాంత్ వర్మ హైదరాబాద్‌లోని ప్రముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై హనుమాన్ స్క్రిప్ట్ బుక్‌ను ఆయన హనుమాన్ విగ్రహం ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
Read Also: అసభ్యకర పనులు ఏం చేశానో చెప్పు, నెటిజన్ వ్యాఖ్యలపై యాంకర్ రష్మి తీవ్ర ఆగ్రహం