Dadasaheb Phalke Award: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవం 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారం అందుకున్న రజనీకాంత్... ఆ అవార్డును తన మార్గదర్శి, గురువు కె. బాలచందర్ కు అంకితం ఇస్తున్నట్టు వెల్లడించారు.
భారతదేశ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులు మీదగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'దాదా సాహెబ్ ఫాల్కే' పురస్కారాన్ని అందుకున్నారు. నేడు (సోమవారం) ఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది. 2019 సంవత్సరానికి గాను ఆయన్ను ఈ పురస్కారం వరించింది.
Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్
రజనీకాంత్ మాట్లాడుతూ "ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవార్డును నా మార్గదర్శి, గురువు కె. బాలచందర్ గారికి అంకితం ఇస్తున్నాను. ఈ క్షణంలో ఆయన్ను గుర్తు చేసుకుంటున్నాను. నా సోదరుడు సత్యనారాయణ రావు గైక్వాడ్... నాకు తండ్రిలాంటివారు. విలువలతో నన్ను పెంచారు. నాలో ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఆయనే కారణం. కర్ణాటకలో నా స్నేహితుడు - బస్ డ్రైవర్ రాజ్ బహదూర్... నేను బస్ కండక్టర్ గా ఉన్నప్పుడు నాలో యాక్టింగ్ టాలెంట్ ను గుర్తించాడు. సినిమాల్లోకి వెళ్లమని నన్ను ఎంకరేజ్ చేశాడు. నాతో సినిమాలు తీసిన దర్శక, నిర్మాతలకు... నాతో పని చేసిన సాంకేతిక నిపుణులు, సహా నటీనటులు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు, మీడియా ప్రతినిథులు, అభిమానులకు కృతజ్ఞతలు. ముఖ్యంగా తమిళ ప్రజలు... వారు లేకపోతే నేను లేను. జహింద్" అని అన్నారు.
మరాఠీ కుటుంబంలో జన్మించిన రజనీకాంత్, కర్ణాటకలో బస్ కండక్టర్ గా పని చేసి... అక్కడ నుండి తమిళనాడుకు వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు అందుకున్న సందర్భంగా ఇచ్చిన స్పీచ్ చివర్లో తమిళంలో మాట్లాడారు. తమిళ ప్రజలు లేకుంటే తాను లేనని... తమిళ ప్రజలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. రజనీకాంత్ ను పురస్కారంతో సత్కరించిన తర్వాత సభలో ప్రముఖులు అందరూ చప్పట్లతో అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా రజనీ అల్లుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్య ఆర్. ధనుష్ చప్పట్లు కొట్టడం అందర్నీ ఆకర్షించింది. లతా రజనీకాంత్ కూడా సభలో ఉన్నారు. ఈ పురస్కార ప్రదానోత్సవంలో రజనీ అల్లుడు ధనుష్ ఉత్తమ నటుడిగా 'అసురన్' చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నారు.
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
Also Read: 'రాధే శ్యామ్' టీజర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?