Viral Video: ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేసిన కొరియన్ ఎంబసీ - ప్రధాని మోదీ ప్రశంసలు
‘నాటు నాటు’ పాటకు ఢిల్లీలోని కొరియన్ ఎంబసీ ఉద్యోగులు అదిరిపోయే స్టెప్పులు వేశారు. వారి డ్యాన్సుకు ప్రధాని మోదీ ఫిదా అయ్యారు. అందరినీ అభినందిస్తూ ట్వీట్ చేశారు.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ ఇండియన్ సినిమా, ఇప్పుడు ఆస్కార్ అవార్డుకు ఎంపిక అయ్యింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ అందుకుంది. ఇప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును దక్కించుకుంది. వచ్చే నెల (మార్చి)లో జరిగే ఆస్కార్ ఈవెంట్ లో తప్పకుండా ‘నాటు నాటు’ పాట ఆస్కార్ ను అందుకుంటుందని ‘RRR’ టీమ్ దీమా వ్యక్తం చేస్తోంది.
కొరియన్ ఎంబసీ ఉద్యోగుల డ్యాన్సుకు ప్రధాని ప్రశంస
మరోవైపు ‘నాటు నాటు’ పాట మేనియో అన్ని దేశాలకు పాకింది. ప్రతి ఒక్కరు ‘నాటు నాటు’ పాటకు దుమ్మురేపే స్టెప్పులు వేస్తున్నారు. తాజాగా భారత్ లోని కొరియన్ ఎంబసీ ఉద్యోగులు ఈ పాటకు అచ్చు దింపినట్లుగానే డ్యాన్స్ చేశారు. కార్యాలయ సిబ్బంది అంతా కలిసి ఆకట్టుకునేలా స్టెప్పులు వేశారు. వీరి డ్యాన్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. అద్భుతంగా డ్యాన్స్ చేశారంటూ అభినందించారు. ఈ మేరకు కొరియన్ ఎంబసీ ఉద్యోగులు పోస్టు చేసిన డ్యాన్స్ వీడియోను ప్రధాని మోదీ షేర్ చేశారు.
Lively and adorable team effort. 👍 https://t.co/K2YqN2obJ2
— Narendra Modi (@narendramodi) February 26, 2023
ఆస్కార్ కు అడుగు దూరంలో ‘నాటు నాటు’ పాట
రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా గతేడాది మార్చి లో విడుదల అయి ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రశంసలతో పాటు అవార్డుల పంట కూడా పండింది. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ అవార్డులను అందుకుంది. ఈ మూవీలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కు ఎంపికైంది. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్వరాలందించగా, గేయ రచయిత చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కీరవాణి, కాల భైరవ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. ఇక ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో కీరవాణి ఆస్కార్ వేదిక పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా చిత్ర బృందం హాజరుకానున్నారు.
ఈ మూవీలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కలసి చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చరణ్, తారక్ నటన అద్భుతంగా అలరించింది. రామ్ చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్ నటించగా.. తారక్ సరసన ఒలివియా మోరిస్ నటించింది. అలాగే మూవీలో అజయ్ దేవగణ్, శ్రియ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. గతేడాది మార్చి 25 న తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.
Read Also: డేంజర్ బెల్ మోగింది - వరుస ఫ్లాపులపై అక్షయ్ కుమార్ రియాక్షన్!