Best Horror Movies On OTT: బొమ్మలో దెయ్యం ఉందని తెలిసీ ప్రేమగా చూసుకునే కేర్ టేకర్.. ఆమె ప్రియుడి రాకతో అంతా తార్‌మార్!
Movie Suggestions: బొమ్మలో దెయ్యాన్ని చూపిస్తూ తెరకెక్కే హాలీవుడ్ హారర్ సినిమాలు ఎక్కువశాతం ప్రేక్షకులను మెప్పించే విధంగానే ఉంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి 2016లో విడుదలయిన ‘ది బాయ్’.
Best Horror Movies On OTT: మామూలుగా హారర్ సినిమాలు అన్నింటికి దాదాపుగా ఒకే రకమైన స్టోరీ లైన్ ఉంటుంది. అందులో చాలావరకు చూసిన కథలే మళ్లీ మళ్లీ చూసినట్టుగా కూడా అనిపిస్తుంది. కానీ ఆ కథను థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కలిపి మేకర్స్.. ప్రేక్షకుడిని ఎంతవరకు ఇంప్రెస్ చేయగలిగారు అనేదే పాయింట్. ఇక హాలీవుడ్ హారర్ సినిమాల విషయానికొస్తే.. ఒక బొమ్మలో దెయ్యం ఉండడం, అది ఆ ఇంట్లో వారిని టార్గెట్ చేసి చంపడం.. ఈ కథ చాలా సినిమాల్లో చూసుంటాం. అలాంటి ఒక రొటీన్ స్టోరీతో తెరకెక్కినా కూడా ఆడియన్స్‌ను విపరీతంగా ఇంప్రెస్ చేసిన హారర్ చిత్రాల్లో ఒకటి ‘ది బాయ్’ (The Boy).
కథ..
ఒక కేర్ టేకర్‌గా ఉద్యోగం రావడంతో గ్రెటా ఈవెన్స్ (లారెన్ కోహాన్).. అమెరికా నుండి ఇంగ్లాండ్ రావడంతో కథ మొదలవుతుంది. ఇంగ్లాండ్ శివార్లలో ఒక పెద్ద భవంతిలో ఆమెకు కేర్ టేకర్‌గా ఉద్యోగం వస్తుంది. ఆ భవనంలోకి వెళ్లగానే మిసెస్ హీల్షైర్ (డయానా హార్డ్‌క్యాసిల్) తనకు వెల్కమ్ చెప్తుంది. ఆ తర్వాత మిస్టర్ హీల్షైర్ (జిమ్ నార్టన్)ను పరిచయం చేస్తుంది. వారిద్దరూ కలిసి తమ బాబు అయిన బ్రాహ్మ్స్‌ను చూసుకోవడానికి కేర్ టేకర్‌గా తనను అపాయింట్ చేశామని గ్రెటాకు వివరిస్తారు. ఆ తర్వాత ఒక బొమ్మను చూపించి అదే తమ బాబు అని చెప్తారు. ముందు అదంతా జోక్ అనుకొని గ్రెటా నవ్వుతుంది. కానీ వాళ్లు నిజంగానే ఆ బొమ్మను తమ కొడుకు బ్రాహ్మ్స్‌లాగా ఫీల్ అవుతున్నారని అర్థం చేసుకుంటుంది. బ్రాహ్మ్స్‌కు కేర్ టేకర్‌గా ఉండాలంటే వాళ్లు కొన్ని రూల్స్ చెప్తారు. అప్పుడు తను బ్రాహ్మ్స్‌ను బాగా చూసుకుంటానని మాటిస్తుంది.
గ్రెటా కేర్ టేకర్‌గా ఉద్యోగంలో చేరిన తరువాతి రోజే హీల్షైర్ దంపతులు.. ఒక ట్రిప్‌కు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకొని మరణిస్తారు. భవనంలో ఒంటరిగా ఉన్న గ్రెటా.. బొమ్మను చూసుకోవడానికి ఏముంది అని దానిని పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలనుకుంటుంది. కానీ అక్కడ జరిగేవి అన్నీ తనకు చాలా వింతంగా కనిపిస్తాయి. రాత్రి పడుకున్నప్పుడు ఏవో శబ్దాలు వినిపించడం, పీడకలలు రావడం.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతే కాకుండా బొమ్మ.. తను పెట్టిన చోట ఉండదు. దీంతో గ్రెటాకు ఏమీ అర్థం కాదు. అదే సమయంలో తనకు మాల్కమ్ (రూపర్ట్ ఈవెన్స్) అనే వ్యక్తి పరిచయమవుతాడు. 20 ఏళ్ల క్రితం ఒక ఫైర్ యాక్సిడెంట్‌లో బ్రాహ్మ్స్ మరణించాడని, అప్పటినుండి ఆ దంపతులు బొమ్మలోనే తమ కొడుకును చూసుకుంటున్నారని వివరిస్తాడు.
తనకు జరుగుతున్న వింత సంఘటనలు అన్నీ ఆగిపోవాలంటే ఆ బొమ్మను ప్రేమగా చూసుకుంటే చాలు అని గ్రెటా అనుకుంటుంది. ఆ బొమ్మలో బ్రాహ్మ్స్ ఆత్మ ఉందని ఫిక్స్ అవుతుంది. ఒకరోజు అదే విషయాన్ని మాల్కమ్‌కు కూడా ప్రూవ్ చేసి చూపిస్తుంది గ్రెటా. దీంతో భయపడిపోయిన మాల్కమ్.. బ్రాహ్మ్స్ ఫ్లాష్‌బ్యాక్‌ను చెప్తాడు. బ్రాహ్మ్స్‌కు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండేదాని, తనను ఒకరోజు ఎవరో హత్య చేశారని, ఆ చేసింది బ్రాహ్మ్సే అనుకొని పోలీసులు తనను పట్టుకోవడానికి వచ్చే సమయానికి ఫైర్ యాక్సిడెంట్‌లో బ్రాహ్మ్స్ చనిపోయాడని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత కూడా ఆ బొమ్మ తనను ఏం చేయదని గ్రెటా నమ్ముతుంది. ఇంతలో గ్రెటా మాజీ ప్రియుడు కోల్ (బెన్ రాబ్సన్) ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. బొమ్మ కోసమే తనను వదిలేసి ఇంత దూరం వచ్చింది అనే కోపంతో ఆ బొమ్మను పగలగొడతాడు. అదే అతడు చేసిన పెద్ద తప్పు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే తెరపై చూడాల్సిన అసలు కథ.
యాక్టింగే ప్లస్..
‘ది బాయ్’ లాంటి సినిమాలు హాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. అయినా కూడా ఇందులో ఎక్కడా థ్రిల్లింగ్ ఎలిమెంట్‌ను మిస్ అవ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు విలియమ్ బ్రెంట్ బెల్. సినిమాలో ఎక్కువగా పాత్రలు లేవు. కానీ అన్నింటికంటే ముఖ్యంగా తన నటనతో మూవీని ముందుకు తీసుకెళ్లింది లారెన్ కోహాన్. 2016లో విడుదలయిన ‘ది బాయ్’.. బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. అవి కూడా బాక్సాఫీస్ వద్ద పరవాలేదనిపించాయి. ఇక ఈ బొమ్మ హారర్ మూవీ అయిన ‘ది బాయ్’ను చూడాలనుకుంటే ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో చూసేయొచ్చు.