Oscars 2023: ‘ఆస్కార్’లో మనం - ఆ అవార్డులు గెలిచి, భారతీయుల సత్తా చాటిన సినీ దిగ్గజాలు వీరే!
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు భారతీయులకు కొత్తేంకాదు. ఇప్పటికే పలు విభాగాల్లో ఐదుగురు సినీ దిగ్గజాలు ఈ అవార్డులను దక్కించుకున్నారు. ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ చలన చిత్ర రంగంలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి ప్రతి ఏటా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులను అందజేస్తారు. దర్శకులు, నటీనటులు, రచయిత, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. మరికొద్ది గంటల్లో 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులకు ఆస్కార్ అవార్డులు వచ్చాయో తెలుసుకుందాం.
ఉత్తమ సినిమా విభాగంలో ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డును అందుకోలేదు. అయితే, పలు సినిమాల కోసం పనిచేసిన సినీ ప్రముఖులు ఈ అవార్డులను పొందారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతయా, దర్శకుడు సత్యజిత్ రే, రచయిత గుల్జర్, సౌండ్ ఇంజనీర్ రెసూల్ పూకుట్టి అకాడమీ అవార్డులను దక్కించుకున్నారు.
1. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్- భాను అతయా
ఆస్కార్ అవార్డు గెలిచిన తొలి భారతీయురాలు భాను అతయా. ఈమె ప్రముఖ భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్. దాదాపు 100 సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేశారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకులతో కలిసి వర్క్ చేశారు. సుమారు 100 సినిమాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. 1983లో వచ్చిన చారిత్రక డ్రామా ‘గాంధీ’కి గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆస్కార్ అవార్డు పొందారు.
2. హానరీ అవార్డు-సత్యజిత్ రే
ప్రముఖ భారతీయ దర్శకులు సత్యజిత్ రే, బెంగాలీ సినిమా రంగంలో ప్రముఖ దర్శకుడిగా రాణించారు. ‘పాథర్ పంచాలీ’తో సినిమా ప్రయాణం మొదలు పెట్టిన ఆయన ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. అద్భుత సినిమాలకు గాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. 1992లో హానరీ ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును అందుకున్నారు.
3. ఒరిజినల్ స్కోర్, ట్రాక్- ఏఆర్. రెహమాన్
డానీ బోయెల్ దర్శకత్వం వహించిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ మూవీ పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ మూవీ మూడు కేటగిరీలలో ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఒరిజినల్ స్కోర్, ట్రాక్ విభాగాల్లో ‘జయహో’ పాట రెండు ఆస్కార్ లను దక్కించుకుంది.
4. బెస్ట్ ఒరిజినల్ సాంగ్- గుల్జర్
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాలోని ‘జయహో’ పాట ప్రపంచాన్ని ఊపు ఊపింది. ఈ పాటను ప్రముఖ రచయిత గుల్జర్ రాశారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ రాసినందుకు గాను, ఆయన ఈ అవార్డును పొందారు.
5. బెస్ట్ సౌండ్ మిక్సింగ్- రెసూల్ పూకుట్టి
‘స్లమ్ డాగ్ మిలియనీర్’ మూవీకి సౌండ్ ఇంజనీర్ గా పని చేసిన రెసూల్ పూకుట్టి, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్నారు. ఈ అవార్డును భారతీయులు అందరికీ అంకితం చేస్తున్నట్లు ఆస్కార్ వేదికపై నుంచి రెసూల్ పూకుట్టి ప్రకటించారు.
తెలుగు నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయిన ‘నాటు నాటు‘ పాట ఈసారి ఆస్కార్ పొందే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే తెలుగు సినిమా పరిశ్రమలోనే ‘RRR‘ ఓ మైలు రాయిగా నిలిచిపోనుంది.
Read Also: ‘ఆస్కార్’ అవార్డు అంత చవకా? ట్రోఫీని ఏ లోహంతో చేస్తారు? ఖరీదు ఎంత?