MAA Election 2021: ‘MAA’ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది..షెడ్యూల్, నియమ నిబంధనలు ఇవే..
MAA Election Notification 2021: మా ఎన్నికల నోటిఫికేషన్ 2021-23 సీజన్ కి సంబంధించి విడుదలైంది. అక్టోబర్ 10న ఆదివారం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఈసీ నోటిఫికేషన్లో పేర్కొంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. ప్రధానంగా పోటీ మంచు విష్ణు..ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్య ఉండటంతో ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నంలో భాగంగా ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. పంతం నీదా-నాదా సై అంటున్నారిద్దరూ. లంచ్ పార్టీలు, డిన్నర్లు అంటూ పోటాపోటీగా రాజకీయం సాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పరిస్థితి ఇలా ఉందంటే..ఇక నోటిఫికేషన్ రావడంతో ఎలా ఉండబోతోందో అంటున్నారంతా. ఇంతకీ పోలింగ్ ఎప్పుడంటే అక్టోబరు 10 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలింగ్ జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూలు లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
షెడ్యూల్ ఇదే: 8 మంది ఆఫీస్ బేరర్స్, 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈనెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1-2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంది. అక్టోబర్ 2న బరిలో ఉన్న అభ్యర్ధుల వివరాలు ప్రకటిస్తారు. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించి..సాయం త్రం 7 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.
నియమ నిబంధనలు: నియమనిబంధనల విషయానికొస్తే ఒక అభ్యర్ధి ఒక పోస్టుకే పోటీ చేయాలి. గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్ లకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది. 24 క్రాప్ట్స్ లో ఆఫీస్ బేరర్ గా ఉన్నవారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
ఈసారి కొత్తగా: `మా` ఎన్నికల ప్రచార శైలిపై ఇప్పటికే సెటైర్లు పడుతున్నాయి. లంచ్ లు డిన్నర్ లు అంటూ విందు రాజకీయాలతో హీట్ బాగా పెరిగింది. పోలింగ్ డేట్ రానంతవరకూ పరిస్థతి అలా ఉంటే ఇకపై మరింత జోరు పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందు నరేష్ లంచ్ పార్టీలు ఆ తరవాత బరిలో దిగి ప్రకాష్ రాజ్ ఆకస్మిక పార్టీలు జరిగాయి. ఇప్పుడు మరోసారి ప్రకాష్ రాజ్ విందు రాజకీయంపై చర్చ జరిగింది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వెన్యూలో విందు ఏర్పాటు చేసిన ప్రకాశ్ రాజ్ ``కలిసి మాట్లాడుకుందాం.. మన లక్ష్యాలపై చర్చించుకుందాం.. సహపంక్తి భోజనం చేద్దాం`` అంటూ ఆయన పంపిన ఆహ్వానం అందుకుని సభ్యులంతా విచ్చేశారు. ఈ విందులో ప్రకాష్ రాజ్ అసంతృప్తుల్ని బుజ్జగించారట. మరోవైపు మంచు విష్ణు కూడా తన వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్లాన్స్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బండ్ల గణేష్, బాబు మోహన్ పోటీ చేస్తున్నారు. మరి ఎప్పుడూలేనంత రచ్చ జరుగుతోన్న ఈ ఎన్నికల్లో గెలుపెవరిదో వెయిట్ అండ్ సీ...