Upasana: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్
Trainee Doctor Murder Case: కోల్‌కత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై ఉపాసనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
Kolkata Doctor Case: కోల్‌కత్తాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లోని వివరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అంత దారుణంగా హింసించి చంపారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరీరంలో నుంచి సేకరించిన నమూనాలు కొన్ని ఈ అనుమానాలకు తావిచ్చాయి. ఈ ఘటనపై దేశమంతా నినదిస్తూనే ఉంది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్‌లు జరుగుతున్నాయి. సినీ ప్రముఖులూ తమ ఆగ్రహాన్ని, అసహనాన్ని పోస్ట్‌ల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసనా ఓ నోట్ పోస్ట్ చేశారు. "ఇదేం స్వాతంత్య్ర దినోత్సవం" అంటూ తీవ్రంగా మండి పడ్డారు. ఓ మహిళకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటే గుండె పగిలిపోతోందని అన్నారు. "ఆమె జీవితానికి విలువే లేదా" అని ప్రశ్నించారు. ఇంకా ఇలాంటి అరాచకాలు సమాజంలో ఉన్నప్పుడు స్వాతంత్య్ర దినోత్సవం ఎలా జరుపుకోగలమని అసహనం వ్యక్తం చేశారు ఉపాసన. ఇంత కన్నా అమానుషం ఇంకేముంటుందని ఆవేదన చెందారు.
"వైద్య వృత్తిలో ఉన్న ఓ మహిళ పట్ల జరిగిన ఈ దారుణాన్ని తలుచుకుంటే గుండె పగిలిపోతోంది. ఇంకెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆమె జీవితానికి అసలు విలువంటూ లేదా..? ఇప్పటికీ మన సమాజంలో ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే మనం ఎలాంటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో అర్థం కావట్లేదు. ఇంత కన్నా అమానుషం ఉంటుందా. మన దేశంలో హెల్త్ కేర్ రంగానికి మహిళలే వెన్నెముక. ఈ రంగంలో 50% వాటా వాళ్లదే. వీళ్లంతా పేషెంట్స్‌తోనే ఎక్కువ సమయం గడుపుతారు. వాళ్ల సేవలు దేశానికి ఎంతో కీలకం. ఆ స్ఫూర్తితోనే నేనూ ఈ రంగంలోనే ఉన్నాను. ప్రతి మహిళక భద్రతకీ భరోసా కల్పించాలి. ప్రతి ఒక్కరికీ గౌరవం లభించాలి. కలిసికట్టుగా ఈ మార్పుని సాధించగలం"
- ఉపాసన కొణిదెల
#jaihind pic.twitter.com/qZIp9ALwNe
— Upasana Konidela (@upasanakonidela) August 15, 2024
ఇప్పటికే ఈ ఘటనపై రాజకీయంగానూ దుమారం రేగుతోంది. సాక్ష్యాధారాలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ పెద్ద ఎత్తు వెల్లువెత్తున్నాయి. అత్యాచారం జరిగిన చోటే మరమ్మతులు చేయడంపై ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల్లో నిరనసలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకూ పోరాటం ఆగదని తేల్చి చెబుతున్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఇప్పటికే ఓ సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సామూహిక అత్యాచారం జరిగిందన్న అనుమానంతో మిగతా వాళ్లు ఎవరు అన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆమె కళ్ల నుంచి తీవ్ర రక్తస్రావమైందని తేలింది. ప్రైవేట్ పార్ట్స్‌లోనూ బ్లీడింగ్ అయినట్టు వెల్లడైంది. శరీరమంతా లోతైనా గాయాలయ్యాయి. కళ్లద్దాలు పగిలిపోయి వాటి ముక్కలు కళ్లలో ఇరుక్కున్నాయి.