Selfie With Yash: ఫ్యాన్స్ కోసం గంటల తరబడి నిలబడిన ‘కేజీఎఫ్’ హీరో యష్, ఎందుకంటే ?
‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు హీరో యష్, ప్రస్తుతం ఆయన గురించి ఓవార్త ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. దీంతో ఆయన్ను సోషల్ మీడియాలో పొగడ్తలతో ముంచెత్తున్నారు ఫ్యాన్స్.
కన్నడ స్టార్ హీరో యష్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమాతో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి వరకూ కన్నడ ప్రేక్షకులకు మాత్రమే పరిచయమున్న యష్ ఈ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా యష్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ రియల్ హీరో అంటే ఇతనే అంటూ యష్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
‘కేజీఎఫ్’ హీరో యష్ ఇటీవల బెంగుళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను చూడటానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కార్యక్రమం అనంతరం వారంతా తమ అభిమాన హీరో యష్ తో సెల్ఫీలు దిగేందుకు నిర్వాహకుల నుంచి అనుమతి కోరారు. కానీ గ్రూపులుగా దిగితేనే అనుమతి ఇస్తామని చెప్పారు నిర్వాహకులు. ఇదంతా గమనించిన యష్ వారిని పిలిచి గ్రూపులుగా కాకుండా ఒక్కక్కరితో విడిగా ఫోటోలు దిగారు. సుమారు 700 మందికి విడివిడిగా ఫోటోలు ఇచ్చారు యష్. ఆ ఫోటోలు దిగడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. అంతసేపు యష్ నిలబడి.. వారందరికీ ఫోటోలు ఇవ్వడం విశేషం.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. సాధారణంగా హీరోలు ఒకరికో ఇద్దరికో లేదా ఓ పది మందికి సెల్ఫీలు ఇస్తారు. కానీ ఇలా ఒకేసారి 700 మందికి సెల్ఫీలు ఇవ్వడం బహుశా ఇదే మొదటి సారి కావచ్చు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్స్ యష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యష్ ఓపిగ్గా నిలబడి సెల్ఫీలు ఇవ్వడం చూసి యష్ రియల్ హీరో, డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తున్నారు.
యష్ నిజంగా డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చిన హీరోల్లో ఒకడు. కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు. మొదట్లో కన్నడలో కొన్ని సీరియల్స్ లో నటించాడు యష్. సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేసేవాడు. తర్వాత కన్నడ సినిమాలలో చిన్న చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. తర్వాత 2008 లో 'రాకీ' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. వరుస హిట్ లతో కన్నడ లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్. కొద్ది కాలంలోనే కన్నడలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ‘కేజీఎఫ్’ సినిమాల కోసం యష్ ఏకంగా 8 సంవత్సరాలను కేజీఎఫ్ ఫ్రాంచైజీకి అంకితం చేశాడు. ఇప్పటికే ‘కేజీఎఫ్’ నుంచి రెండు పార్టులు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించాయి. ‘కేజీఎఫ్ 3’ కూడా ఉండనుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు యష్. అయితే పార్ట్ 3 మూవీ రావడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది. అందుకు తగిన ప్రణాళికతో సిద్దంగా ఉందట మూవీ టీమ్. దీంతో కేజీఎఫ్ పార్ట్ 3 కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాకీభాయ్ ఫ్యాన్స్.