Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
Vijay Deverakonda Reaction : రణబాలి టికెట్ ధరల పెంపుపై హీరో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. తన సినిమాలకు టికెట్ రేట్స్ పెంచేది లేదని స్పష్టం చేశారు.

Vijay Deverakonda Reaction Over Ticket Hikes For Ranabaali : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'రణబాలి' దసరా సందర్భంగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. తాజాగా టికెట్ ధరలపై హీరో విజయ్ కీలకనిర్ణయం తీసుకున్నారు.
'టికెట్ రేట్స్ పెరగవు'
తన సినిమాలకు టికెట్ ధరలు పెరగవని క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీనికి గల కారణాన్ని చెప్పారు. 'నా సినిమాలకు టికెట్ ధరలు పెంచొద్దని నేను ఎప్పుడూ నిర్మాతలకు చెబుతుంటాను. కావాలంటే నా రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెబుతాను. లేదా నాకొచ్చే లాభాల్లో వాటాలు తీసుకోమంటాను. దీనికి ఓ కారణం ఉంది. నా కాలేజీ రోజుల్లో నాన్న రోజూ రూ.10 ఇచ్చేవారు. దాన్ని దాచుకుని వారమయ్యాక ఐమ్యాక్స్‌లో మూవీ చూడడానికి వెళ్లేవాడిని.
ఓసారి టికెట్ ధర రూ.100కు పెంచేశారు. ఇలా ఎలా చేస్తారని ఆ రోజు చాలా బాధపడ్డా. నేను హీరో అయ్యాక నా మూవీస్‌కు టికెట్ ధరల పెంపుపై నిర్మాతలతో చర్చ జరిగితే వద్దని చెప్పేవాడిని. ఒకవేళ రాజమౌళి సార్‌తో సినిమా చేస్తే తప్ప... నా సినిమాలకు టికెట్ రేట్స్ పెంపు ఉండదు.' అంటూ క్లారిటీ ఇచ్చారు.
'బయోపిక్స్ అంటే ఇష్టం'
తనకు బయోపిక్స్‌లో నటించడం అంటే చాలా ఇష్టమని చెప్పారు విజయ్ దేవరకొండ. 'నేను ఎప్పటి నుంచో సత్యసాయి బాబా బయోపిక్ చేయాలనుకున్నా. కానీ, చేయలేకపోయా. అందుకు కారణం ఆయనలో స్వచ్ఛత, సున్నితత్వం నాలో లేదు. అందుకే చేయలేదు. నాకు సరిపోయే వేరే బయోపిక్స్ తప్పుకుండా చేసేందుకు ప్రయత్నిస్తా. పెళ్లిచూపులు తర్వాత కంఫర్ట్‌గా చేసిన సినిమా ఇదే. రిలీజ్‌కు ముందు 2, 3 సార్లు చూసుకున్నాం. సోమవారానికి సెన్సార్ కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నా.' అని చెప్పారు.
మంత్రి లోకేశ్ అన్నకు థాంక్స్
ఈ మూవీ ట్రైలర్‌పై ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. '1800ల నాటి రాయలసీమను పునఃసృష్టించడంలో చూపిన శ్రద్ధ, అలాగే బ్రిటిష్ వారి కాలంలోని కరువు, అణచివేతతో నిండిన ఆ హృదయవిదారక యుగాన్ని చిత్రీకరించిన తీరు అద్భుతం.' అంటూ ట్వీట్ చేశారు. దీనికి విజయ్ థాంక్స్ చెబుతూ రియాక్ట్ అయ్యారు.
'లోకేష్ అన్న. సీమ గడ్డ నాకు ఎంతో ఇచ్చింది. అందుకే ఈ సినిమా చేయడం నా బాధ్యతగా భావించా. మీ సందేశం మా అందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది. మీ కోసం ఒక గొప్ప సినిమా అనుభవం వేచి ఉంది. మన ప్రాంతం, మన ప్రజల పట్ల గర్వపడేలా చేసే చిత్రం ఇది. మీకు నా ప్రేమపూర్వక నమస్కారాలు. అలాగే, మీ ఆప్యాయమైన మాటలకు ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చారు.
Lokesh Anna ❤️ The land of Seema has given me a lot and this film was due from me. Your message fills us all with excitement. A great Cinematic experience awaits you 🤗❤️ a film that will fill us with Pride of our land and our people. My regards and love to you. And thank you for your kindest words. #Ranabaali
— Vijay Deverakonda (@TheDeverakonda) October 10, 2026
ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించగా... రణబాలిగా విజయ్ దేవరకొండ, ఆయన భార్య జయమ్మగా రష్మిక మందన్న నటించారు. బ్రిటిష్ దొరగా నెగిటివ్ రోల్‌లో ఆర్నాల్డ్ ఓస్లో కీలకపాత్ర పోషించారు. టి సీరిస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న వరల్డ్ వైడ్‌గా తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రెండింగ్ వార్తలు























