Kalavaram Movie: హీరోగా 'చెప్పవే చిరుగాలి' దర్శకుడి కుమారుడు - ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో థ్రిల్ ఇచ్చే ప్రేమకథ
Vijay Kaniska Movie: 'వసంతం', 'చెప్పవే చిరుగాలి' సినిమాల దర్శకుడు విక్రమన్ కుమారుడు హీరోగా వస్తున్నాడు. ఆ మూవీ ఓపెనింగ్ చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా జరిగింది.
వేణు తొట్టెంపూడి, అభిరామి జంటగా నటించిన 'చెప్పవే చిరుగాలి' గుర్తుందా? పోనీ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'వసంతం' గుర్తుందా? ఆ రెండు సినిమాలకు విక్రమన్ దర్శకత్వం వహించారు. ఆయన కోలీవుడ్ డైరెక్టర్. పదికి పైగా సినిమాలు తీశారు. ఇప్పుడు ఆయన కుమారుడు విజయ్ కనిష్క హీరోగా కొత్త సినిమా మొదలు అయ్యింది. ఇంతకు ముందు 'హిట్ లిస్ట్' చేసిన ఆయన ఇప్పుడు మరో సినిమా స్టార్ట్ చేశారు.
'కలవరం'తో హీరోగా విజయ్ కనిష్క
విజయ్ కనిష్క కథానాయకుడిగా మొదలైన కొత్త సినిమా 'కలవరం' (Kalavaram Movie). ఇందులో గరిమ చౌహన్ హీరోయిన్. హనుమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సిఎల్ఎన్ మీడియా ప్రై.లి నిర్మిస్తోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా... చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వాళ్లిద్దరి చేతుల మీదుగా చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు.
థ్రిల్ ఇచ్చే ప్రేమకథతో 'కలవరం'
డిఫరెంట్ కాన్సెప్ట్, ప్రేమ కథతో కూడిన థ్రిల్లర్ 'కలవరం' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ''నాకు ఈ సినిమా కథ తెలుసు. బాలచందర్, భాగ్యరాజా వంటి దర్శకులు తీసే మంచి కథ ఉన్న సినిమా. 'కలవరం' మంచి టైటిల్. సినిమా సక్సెస్ కావాలి. హీరో హీరోయిన్లకు మంచి పేరు రావాలి'' అని అన్నారు. చిన్న సినిమాలకు ఎక్కువ షోలు ఇవ్వడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు తోడ్పాటు అందివ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వాలు మినీ థియేటర్లు కట్టాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. 'కలవరం' దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి మాట్లాడుతూ... ''నేను కథ చెప్పిన నచ్చి నిర్మాత శోభ రాణి గారు వెంటనే సినిమా చేస్తున్నామని చెప్పారు. తర్వాత చెన్నై వెళ్లి హీరోకి కథ చెప్పా. విజయ్ కనిష్క సైతం వెంటనే సినిమా చేద్దామన్నారు. ఆ ఇద్దరికీ థాంక్స్'' అని అన్నారు.
హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ... ''మా నాన్న విక్రమన్ గారు తమిళంలో ఎన్నో సినిమాలు చేశారు. తెలుగులో 'వసంతం', 'చెప్పవే చిరుగాలి'కి దర్శకత్వం వహించారు. హీరోగా నా మొదటి సినిమా 'హిట్ లిస్ట్' చూశాక... 'తండ్రి పేరు నిలబెట్టావ్' అని ప్రతి ఒక్కరూ చెప్పారు. ఆ మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. 'కలవరం' కథ విన్నాక అంతకన్నా ఎక్కువ ఎగ్జైటయ్యాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అని అన్నారు. చిత్ర నిర్మాత శోభారాణి మాట్లాడుతూ... ''మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ గారికి థాంక్స్. ఈ సినిమాకు 'కలవరం' పర్ఫెక్ట్ టైటిల్. స్టోరీ రైటర్ శశాంక్, డైరెక్టర్ హనుమాన్ స్క్రిప్ట్ కోసం కష్టపడ్డారు. సినిమాలో 70 మంది ఆర్టిస్టులు ఉన్నారు. త్వరలో వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు.
విజయ్ కనిష్క ('హిట్ లిస్ట్' ఫేమ్), గరిమా చౌహన్ జంటగా, రాజ్ తిరందాసు ('పుష్ప' ఫేమ్) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు నిర్మాణ సంస్థ: సిఎల్ఎన్ మీడియా ప్రై.లి, దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి, కథ: శశాంక్ పి, ఛాయాగ్రహణం: వెంకటేష్, సంగీతం: వికాస్ బాడిస, కూర్పు: శిరీష్ ప్రసాద్.