Bimbisara-2: ‘బింబిసార 2’ నుంచి తప్పుకున్న వశిష్ఠ్, కొత్త దర్శకుడు ఎవరో తెలుసా?
నందమూరి కళ్యాణ్ రామ్, వశిష్ఠ్ కాంబోలో వచ్చిన 'బింబిసార' సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే, ఈ చిత్రం నుంచి వశిష్ఠ్ తప్పుకున్నారు.
గతేడాది విడుదలైన 'బింబిసార' చిత్రంతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. వశిష్ఠ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. 'బింబిసార'లో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశారు. బింబిసారుడిగా, దేవదత్తుడిగా... నటుడిగా రెండు పాత్రలో వైవిధ్యం చూపించారు. క్రూరుడైన మహా చక్రవర్తిగా ఆయన చూపించిన అభినయానికి సర్వత్రా ప్రశంసలు దక్కాయి.
వాస్తవానికి ఈ సినిమా విడుదలకు ముందు నుంచే సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, సినిమా విడుదలై 10 నెలలు కంప్లీట్ అవుతున్నా. ఇంత వరకు సీక్వెల్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు.ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ఓ వార్తల సినీ సర్కిల్స్ లో హల్ చల్ చేసింది. 'బింబిసార-2' నుంచి దర్శకుడు వశిష్ఠ్ తప్పుకున్నాడని వార్తలు వినిపించాయి. అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ ఉండదనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, వాటిని మేకర్స్ ఖండించారు. ఈ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని తేల్చి చెప్పారు.
‘బింబిసార2’ నుంచి తప్పుకున్నవశిష్ఠ్
‘బింబిసార’ సినిమా తర్వాత దర్శకుడు వశిష్ఠ్ కి చక్కటి ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాల్లోనే బిజీగా ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ తో సినిమా ఖరారు అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెండు సినిమాలను మేనేజ్ చేయలేనని కారణంతో 'బింబిసార-2' నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.సినిమా దర్శకత్వం బాధ్యతల నుంచి తప్పుకున్నా ‘బింబిసార-2'కి కథ మాత్రం వశిష్ఠ్ అందించారట. స్క్రిప్ట్ వర్క్ లోనూ కీలక పాత్ర పోషించారట. సినిమాకు తన వంతుగా అవసరం అయిన ప్రతిసాయం చేస్తున్నారట.
'బింబిసార-2' దర్శకుడిగా అనిల్ పాడూరి
ఈ నేపథ్యంలో 'బింబిసార-2'కి దర్శకుడిగా ఎవరు రాబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. 'బింబిసార' చిత్రానికి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా వ్యవహరించిన అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ ఇప్పటికే ఆయనకు చెప్పారట. తనుకూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ ఇప్పటికే 'రొమాంటిక్' అనే సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అయినా, తనకున్న టాలెంట్ చూసి ‘బింబిసార-2’కి దర్శకుడిగా అనిల్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
‘డెవిల్’ తర్వాతే ‘బింబిసార2’ షూటింగ్!
‘బింబిసార’ చిత్రంలో కేథరిన్ హీరోయిన్ గా నటించింది. మరో కథానాయికగా ఎస్సై వైజయంతి పాత్రలో సంయుక్తా మీనన్ నటించింది. వాళ్ళిద్దరి పాత్రల నిడివి తక్కువగానే ఉన్నాయి. అయితే, రెండో భాగంలో వాళ్ళకు ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె చిత్రాన్ని నిర్మించారు. త్వరలో రెండో పార్ట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక 'బింబిసార-2' నిర్మాణంలో డిస్నీ కూడా భాగస్వామి కానుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ 'డెవిల్' అనే సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తయ్యాక ‘బింబిసార2’ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్