Pawan Kalyan Birthday Special : ‘పవర్ స్టార్’ గురించి 15 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
నేడు పవన్ కళ్యాణ్ తన 53వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు, ఈ సందర్భంగా ఆయన జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు (సెప్టెంబర్ 2). ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ కు సంబంధించిన విషయాలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పవర్ స్టార్ గురించి 15 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
1). ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో కొణిదెల వెంకటరావు - అంజనా దేవి దంపతులకు 1971 సెప్టెంబర్ 2న జన్మించారు పవన్ కళ్యాణ్. ఆయన అసలు కొణిదెల కళ్యాణ్ బాబు. ఒక పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలలో "పవన్" అనే అవార్డ్ లభించడంతో, సినిమాల్లో స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నారు.
2). మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన పవన్, కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నారు. 'తమ్ముడు' 'బద్రి' 'ఖుషి' 'గుడుంబా శంకర్' వంటి సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశాడు. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన 'డాడీ' చిత్రం కోసం యాక్షన్ కొరియోగ్రఫీ చేసారు.
3). పవన్ కళ్యాణ్ కి చిన్నప్పటి నుంచే సామాజిక స్పృహ ఉండేది. చేగువేరా వంటి విప్లవకారుల స్పూర్తితో నక్సలిజం వైపు అడుగులు వేద్దామన్న ఆలోచనలు కలిగి ఉండేవారు. ఒకానొక దశలో గన్ పట్టుకొని ఉద్యమం వైపు నడవాలని అనుకున్నారట.
4). అన్నయ్య మెగాస్టార్ అయినా కూడా పవన్ హీరో అవ్వాలని అనుకోలేదు. అయితే వదిన, చిరంజీవి సతీమణి సురేఖ కొణిదల ప్రోద్బలంతో నటుడిగా మారాడు. 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రంతో తెరంగేట్రం చేసాడు. ఈ సినిమాలో డూప్ లేకుండా కొన్ని రిస్కీ షాట్స్ లో నటించి ట్రెండ్ సృష్టించారు.
5). 2003లో 'జానీ' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు పవన్. ఇది యునైటెడ్ స్టేట్స్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా 250 ప్రింట్‌లతో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ కల్ట్ స్టేటస్ పొందింది. ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఈ మూవీ తర్వాత పవన్ డైరెక్టర్ గా మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోలేదు.
6). 'లాస్ట్ లీఫ్' అనే హాలీవుడ్ మూవీ ప్రేరణతో 'జానీ' కథ రాసుకున్న పవన్ కళ్యాణ్.. 'గుడుంబా శంకర్' చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. 'గబ్బర్ సింగ్' కు సీక్వెల్ గా వచ్చిన 'సర్దార్ గబ్బర్ సింగ్' మూవీకి స్టోరీ అందించారు. అయితే పవన్ రైటర్ గా చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి.
7). 'గుడుంబా శంకర్' సినిమాలోని అన్ని పాటలకు పవన్ స్వయంగా కొరియోగ్రఫీ చేసారు. 'పంజా' టైటిల్ సాంగ్ తో పాటుగా 'ఖుషి' చిత్రంలోని నాలుగు సాంగ్స్ కు (ఏ మేరా జహా, చెలియా చెలియా, ప్రేమంటే సులువు కాదురా, ఆడవారి మాటలకు) విజువలైజేషన్ చేసారు. 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు కథకుడిగా వ్యవహరించారు.
8). 'తమ్ముడు' మూవీలో 'ఏం పిల్లా', 'తాటి చెట్టు' బిట్ సాంగ్స్ పాడిన పవన్.. 'ఖుషి'లో 'బాయే బాయే బంగారు రమణమ్మ', 'జానీ' లో 'నువ్వు సారా తాగుట' & 'రావోయి మా ఇంటికి' పాటలకు గొంతు సవరించుకున్నారు. 'గుడుంబా శంకర్' లోని 'కిల్లి కిల్లి'.. 'పంజా' లోని 'పాపా రాయుడు' పాటల్లోనూ పవన్ వాయిస్ వినిపిస్తుంది. ఇక 'అత్తారింటికి దారేది' సినిమాలో 'కాటమ రాయుడా'.. 'అజ్ఞాతవాసి' మూవీలో 'కొడకా కోటేశ్వరరావు' పాటలు ఆలపించారు.
Also Read: పవన్ కళ్యాణ్ బర్త్ డే స్పెషల్ - న్యూ లుక్ లో సర్ప్రైజ్ చేసిన వీరమల్లు!
9). 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' అనే బ్యానర్ స్థాపించి ప్రొడ్యూసర్ గా మారారు పవన్. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాతో పాటుగా నితిన్ హీరోగా 'చల్ మెహన్ రంగా' అనే చిత్రాన్ని నిర్మించారు.
10). అత్యధిక రీమేక్ సినిమాల్లో నటించిన టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. క్యామియో రోల్స్ తో కలిపి ఇప్పటి వరకూ 28 చిత్రాల్లో నటిస్తే, వాటిల్లో 14 రీమేక్స్ ఒక ఫ్రీమేక్ ఉన్నాయి. ప్రస్తుతం నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కూడా రేమేక్ అనే సంగతి తెలిసిందే.
11). సోదరుడు చిరంజీవితో కలిసి 'శంకర్ దాదా ఎంబీబీఎస్' 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాల్లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు పవన్. 'అజ్ఞాతవాసి' ని సిల్వర్ జూబ్లీ మూవీగా మార్చడానికి, క్యామియో రోల్స్ చేసిన రెండు చిత్రాలను కూడా పవన్ ఖాతాలో లెక్కగట్టారు.
12). సౌత్ ఇండియా నుంచి ప్రముఖ శీతల పానీయం కంపెనీ పెప్సీకి ఎండార్స్మెంట్ చేసిన మొదటి సెలబ్రిటీగా పవన్ కళ్యాణ్ నిలిచారు. ఆ తర్వాతే చిరంజీవి, మహేష్ బాబు లాంటి హీరోలు ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్లుగా చేసారు.
13). చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా చేశారు. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత, 'జనసేన' పేరుతో సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టారు. 2019లో ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
14). పవన్ కళ్యాణ్ 2013లో ఫోర్బ్స్ ఇండియా టాప్-100 సెలబ్రిటీల జాబితాలో 26వ ర్యాంక్ సాధించారు. 2014 లో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీగా నిలిచారు.
15). కళ్యాణ్ 1997లో నందిని అనే ఆమెని వివాహం చేసుకుని 2007లో విడాకులు ఇచ్చారు. 2001 నుంచి తన సహనటి రేణు దేశాయ్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న పవన్.. 2004లో కుమారుడు అకిరా నందన్ కు జన్మనిచ్చారు. ఎనిమిదేళ్ల సహజీవనం తర్వాత 2009లో దేశాయ్‌ని పెళ్లి చేసుకున్నాడు. అయితే కుమార్తె ఆద్య జన్మించిన తర్వాత 12 ఏళ్ళ బంధానికి స్వస్తి పలికారు.
'తీన్ మార్' సమయంలో కలిసిన రష్యా యువతి అన్నా లెజ్నెవాను మూడో భార్యగా చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 2013 సెప్టెంబర్ లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం జరిగినట్లు రిజిస్టర్ అయింది. వీరికి పోలేనా అంజనా పవనోవా అనే కుమార్తె, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కొడుకు ఉన్నారు.
Also Read: Pawan Kalyan Birthday : పవన్ కల్యాణ్ ను 'పవర్ స్టార్' గా మార్చిన సినిమాలివే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial