మన్మథుడి సరసన మిస్ ఇండియా మానస!
నాగార్జున సరసన మిస్ ఇండియా 2020 మానస నటించనుంది. నాగార్జున కాస్త యంగ్ గా కనిపించాలని.. విఎఫ్ఎక్స్ ను ఉపయోగిస్తున్నారట.
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో, మన్మథుడు, యువ సామ్రాట్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కింగ్ నాగార్జున. ప్రేక్షకులలో ఆయనకున్న క్రేజ్ అంత ఇంతా కాదు. ఆయన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు అదే క్రేజ్ కొనసాగిస్తున్న ఏకైక హీరో అని చెప్పొచ్చు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న నాగార్జున సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. విక్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఈ చిత్రంతో మంచి మార్క్ సాధించిన.. సరైన హిట్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తర్వాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఆఖరి పోరాటం ఘన విజయం సాధించడంతో నాగార్జున హీరోగా స్థిరపడ్డారు.
గీతాంజలి, శివ ఇలా వరుస విజయాలతో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు, హాల్ బ్రదర్ వంటి సినిమాలతో క్లాస్ తో పాటు మాస్ అభిమానులను సైతం తనవైపు తిప్పుకున్నారు. సంతోషం, మన్మథుడు, బాస్, దేవదాస్, సొగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియోన్స్ నుంచి మంచి పేరు సంపాదించారు. ‘ఘోస్ట్’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో నటించిన నాగార్జున కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈసారి కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ వినోదాత్మక చిత్రం చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇందుకోసం రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ తో కలిసి మూవీ నిర్మించనున్నారు. అయితే ప్రసన్నకుమార్ కు డైరెక్టర్ గా ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
ఈ చిత్రంలో మిస్ ఇండియా 2020 మానస వారణాసిని తీసుకోనున్నారని తెలుస్తోంది. నాగార్జున యువకుడిలా కనిపించేందుకు కొత్త వీఎఫ్ఎక్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే నాగార్జున, మానస వారణాసిల ఫోటో షూట్ కూడా పూర్తయిందని సమాచారం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. కాగా ఈ మూవీకి శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహారించనున్నారు.
మానస వారణాసి తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన యువతి. ఆమె ప్రస్తుతం మోడల్ గా పని చేస్తున్నారు. హైదరాబాద్ లోని వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదువును పూర్తి చేసిన మానస ఫాక్ట్ సెట్ లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ విశ్లేషకురాలిగా పని చేసింది. తరువాత 2019లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీలో టాప్ 3 ఫైనలిస్టుగా నిలిచింది. 2020లో ఫెమినా మిస్ తెలంగాణతో పాటు ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని అందుకుంది. అంతేకాదు మిస్ వరల్డ్ 2021 లో పదవ స్థానంలో నిలిచింది ఈ భామ.
ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల కిరీటాన్ని అందుకున్న ఈ ముద్ధుగుమ్మకు ఇదే తొలి చిత్రం కానుంది. మొదటి అవకాశమే నాగార్జున సరసన హీరోయిన్ గా వస్తుందన్న వార్తలు జోరందుకున్నాయి. ఇదే నిజమైతే ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగొందుతుందని అభిమానులు అంటున్నారు. అయితే ఈ మూవీలో మానస వారణాసిని తీసుకుంటారా లేదా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Read Alos: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్