Kota Srinivasa Rao: ఆరోజు మోహన్ బాబుతో గొడవ అయ్యింది, సారీ చెప్పమంటే చెప్పను అన్నాను - కోట శ్రీనివాస రావు
Kota Srinivasa Rao: లెజెండరీ నటుడు కోట శ్రీనివాస రావు.. అనిపించి అనిపించినట్టుగా చెప్పేస్తుంటారు. తాజాగా మోహన్ బాబుతో తనకు గొడవ అయిన ఒక సందర్భం గురించి బయటపెట్టారు కోట.
Kota Srinivasa Rao About Mohan Babu: టాలీవుడ్‌లో లెజెండరీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న వారిలో కోట శ్రీనివాస రావు కూడా ఒకరు. ఆయన చేసిన ప్రతీ పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేస్తారు కోట. కానీ కొన్నాళ్ల నుండి ఆయన సినిమాల కంటే ఎక్కువగా ఇంటర్వ్యూలు, అందులో ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కోట శ్రీనివాస రావు.. తనకు మోహన్ బాబుకు ఒక ఈవెంట్‌లో జరిగిన గొడవ గురించి గుర్తుచేసుకున్నారు. రామానాయుడు లాంటి లెజెండరీ నిర్మాత తనకు ఇచ్చిన స్థాయి గురించి చెప్తూ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు కోట.
గొడవ అయ్యింది..
రామానాయుడు స్టూడియోలో ఒక ఫ్లోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని చాలామంది ప్రముఖులు వచ్చారని, అదే రోజు మోహన్ బాబుకు తన గొడవ అయ్యిందని కోట శ్రీనివాస రావు గుర్తుచేసుకున్నారు. ‘‘మోహన్ బాబు మాట్లాడుతూ ఇప్పుడు ఒక దుష్టుడు వచ్చి ఎంటర్‌టైన్ చేస్తాడని నన్ను అన్నాడు. నేను మామూలుగా వెళ్లి ఎప్పుడూ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అలవాటు లేదండి. అయినా సీనియర్ దుష్టుడు చెప్పినప్పుడు చేయకపోతే బాగుండదు కదా అన్నాను. నన్ను దుష్టుడు అంటావా అని మోహన్ బాబు సారీ చెప్పమన్నాడు. నేనెందుకు చెప్పాలి, నేనేం తప్పు అనలేదే. నువ్వు నన్ను అన్నావు కదా అని రివర్స్ అయ్యాను. అక్కడ ఉన్నవాళ్లంతా అదే స్టాండ్ మీద ఉండండి అన్నారు. అలా చిన్న గొడవ కూడా అయ్యింది’’ అని తెలిపారు కోట.
పేరు మీద ఫ్లోర్..
ఆ ఫ్లోర్ ఓపెనింగ్‌కు అప్పటి ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్ధన్ రెడ్డి వచ్చారని ఆరోజు తనకు దక్కిన గౌరవం గురించి చెప్పుకొచ్చారు కోట శ్రీనివాస రావు. జనార్ధన్ రెడ్డి రాగానే రామానాయుడు తనను పిలిచారని, అప్పుడు జనార్ధన్ రెడ్డి కూడా కోట శ్రీనివాస రావు నాకు బాగా తెలుసు అని, వీలున్నప్పుడు తన కామెడీ సీన్స్ చూస్తానని అన్నారని గుర్తుచేసుకున్నారు. ఇక ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఎందుకు పిలిచానో తెలుసా అని నాయుడు అడగగా.. తెలియదని సమాధానమిచ్చారట కోట. అప్పుడు అందరి ముందు ‘‘ఈ ఫ్లోర్ వీడిదే’’ అని అనౌన్స్ చేశారట. అప్పుడు తనకు ఏమీ అర్థం కాక అయోమయ స్థితిలో నిలబడ్డారట కోట శ్రీనివాస రావు.
ఆ డబ్బుతోనే..
‘‘రూ.32 లక్షలతో ‘అహ నా పెళ్లంట’ అని ఒక సినిమా తీశాను. అది రిలీజ్ అయిన తర్వాత రూ.1.80 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ డబ్బుతోనే ఈ ఫ్లోర్ కట్టించాను’’ అని అందరి ముందు రామానాయుడు అన్నారని, ఈరోజుల్లో అలా ఎవరు ఒప్పుకుంటారు అంటూ రామానాయుడు గొప్పదనాన్ని గుర్తుచేసుకున్నారు కోట శ్రీనివాస రావు. ఇక ఆయన చేసిన అన్ని సినిమాల్లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లోని పాత్ర కూడా తనకు చాలా స్పెషల్ అని అన్నారు కోట. ఆ సినిమా తర్వాత మరెన్నో అవకాశాలు వచ్చాయని, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో చేసినట్టుగా యాక్టింగ్ చేసి ప్రేక్షకులను ఏడిపించాలని దర్శకులు చెప్పేవారని బయటపెట్టారు కోట శ్రీనివాస రావు.
Also Read: జనాలను ఒప్పిస్తే తనే లీడర్ - విశాల్ పొలిటికల్ ఎంట్రీపై వరలక్ష్మి శరత్‌కుమార్ వ్యాఖ్యలు