రాతిలోని శిల్పాన్ని గుర్తించగల మహా శిల్పి విశ్వనాథ్ - ఆయన సినిమాల్లో ఈ విషయాలను గుర్తించారా?
శాస్త్రీయ నృత్య రీతులయిన కూచిపూడి,భరత నాట్యాలని కథా నేపథ్యాలుగా ,వాటి మీద సామాన్య జనాలకి కూడ ఒక అవగాహన కల్పిస్తూ.. ఆ రసానందాన్ని పంచిపెట్టిన కళారంతి దేవుడు
”ఆ పాత మధురము సంగీతము.. అంచిత సంగాతము.. సంచిత సంకేతము శ్రీ భారతి క్షీరసంప్రాప్తము.. అమృత సంపాతము.. సుకృత సంపాకము!
ఆలోచనామృతము సాహిత్యము.. సహిత హిత సత్యము ..శారదా స్తన్యము సారస్వతాక్షర సారధ్యము... జ్ఞాన సామ్రాజ్యము ...జన్మ సాఫల్యము!!“
కళామతల్లి శ్రీభారతీదేవి స్తన్యామృతమయిన సంగీత సాహిత్యాల మాధుర్యాన్ని పండితులకే కాక పామరులకి కూడా రుచిచూపించాలని తాపత్రయపడిన కళా బంధువు ఆయన.
భారతీయకళల్లో ఉన్న అందాన్ని, ఆకర్షణనీ.. తెలియజేస్తూ.. ఆ సాధనలో రసానందం అనుభవిస్తూ.. అధ్యాత్మికతలోని అత్యున్నతమైన నిర్వాణస్థితిని చేరుకోవోచ్చని సినిమా కళ ద్వారా ప్రపంచానికి చాటిన కళోద్దారకుడు ఆయన.
కథా సందర్భానుసారంగా అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య, వంటి మహా కవుల వాజ్మయాన్ని సంపూర్తిగా వినియోగించుకొని భాష తేనియని రుచి చూపించిన కళాపిపాసి.. . భారతీయ సినిమా చరిత్రలో ‘తెలుగు సినిమా’ కి ఒక ఉనికిని ఏర్పరచిన కళాతపస్వి కె.విశ్వనాథ్.
శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల, స్వాతి ముత్యం, స్వాతికిరణం, స్వయంకృషి స్వర్ణకమలం వంటి ఎన్నో సినిమాలు ఆయన కళాతృష్ణకి తార్కాణాలు. ఆయన సినిమాల్లోని సంగీతం అజరామరం. ఎన్ని పాటలున్నా, ఎన్నిపాటలు విన్నా ఆయన సినిమాల్లోని పాటలు వింటేనే మనసుకి ఆహ్లాదం, శాంతి. సంగీత నృత్యాల నేపథ్యం తీసుకున్నా ప్రతిచిత్రం ఒక భిన్నమైన చిత్రమే.
వరకట్న దురాచారాన్ని ఎద్దేవా చేస్తుంది ‘శుభలేఖ’. మానవ సమూహంలోని కుల మత భేదాలని ఎండగడుతుంది ‘సప్త పది’.
సంగీతం ఒక జీవ రసామృత ధార, కుల మత భేదాలేకుండా ఎవ్వరైనా తమ ఆర్తికొద్దీ తాగొచ్చు. సంగీత సాధన భగవంతుని చేరే ఓ త్రోవ. ఆ బాటలో ఎవరైనా వెళ్ళవచ్చని ‘శంకరా భరణం’లో చెబితే...
ఒక బీద కళాకారుని తపనగా,స్నేహభంధం అంతర్లీనంగా చూపిస్తూ కళలో ఉన్నతి సాధించిన మనిషి అమరుడు అని చెబుతుంది ‘సాగరసంగమం’.
మనిషి మనసులోకి అసూయాద్వేషాలు చేరితే ఎంతటి మహానుభావులకీ అధోగతి తప్పదు అని ‘స్వాతి కిరణం’లో చూపిస్తే , స్త్రీ వల్ల.. అదీ వెలకాంత వల్ల మనిషి తన ధర్మాన్ని, ఉనికిని మరిచిపోకూడదనీ ‘శృతి లయలు’లో చూపించారు.
ఎదిగిన మనిషి లోని… ఎదగని మనసు స్వచ్ఛమైన ముత్యం వంటిదని తెలిపే ఆత్మకథే ‘స్వాతిముత్యం’.
రాముని మదిలో విరహ సముద్రాన్ని తెలుసుకొని, సముద్రాలని లంఘించి, సీత రాములని ఒకటి చేసిన బంటు కథ రామాయణమయితే.. బంటుకి కలిగిన ప్రేమ వియోగ బాధని తనదిగా చేసుకున్న రాముడి కథే శుభ సంకల్పం.
కృషితో నాస్తి దుర్భిక్షం, స్వయం కృషిని నమ్మిన వాడికి ఓటమి అనేది ఉండదు అని ఒక కథ చెబితే .. ఆత్మీయత గలవాడే ‘ఆపద్భాందవుడు’ అవుతాడని ఇంకో కథ.
అహింస పరమ ధర్మమని, అధర్మం ఓడక తప్పదని, గెలుపంటే శతృత్వం అంతమవడమని తెపిపేది ‘సూత్రధారులు’. ఏ కళైనా సాధన సాగిస్తుంటే… ఆ కళా యోగసాధనలో రాసానందం శత దళ సువర్ణ కమలంలా వికసించి.. బ్రతుకు సార్థకం అవుతుందని తెలుపుతుంది ‘స్వర్ణకమలం’. అలా ప్రతి చిత్రం ఒక కళా విచిత్రం. దేనికదే సాటి.
మన హృదయాంతరాలాల్లో ఉన్న సునిశిత భావాల్ని మీటి కళ్ళని చెమ్మ గిల్లించే శక్తి ఒక్క విశ్వనాథ్ సినిమాలకే ఉంది. దేనికదే ప్రత్యేకం. ప్రతీ కథా అజరామరం, ప్రతి సినిమా ఆణిముత్యం
రాళ్ళు అంతటా ఉన్నాయి, కాని.. శిల్పి ఉన్నప్పుడే కదా.. రాయి శిల్పంగా మారేది. కొన్నిశిల్పాలుగా ఉన్నప్పటికీ గుళ్ళోప్రతిష్ట చేసినపుడే కదా, దేవతా మూర్తిగామారి అందరి పూజలు అందుకునేది.
అలా ఎంతో మందిలో దాగున్న ప్రతిభా పాటవాలని ప్రేక్షకుల గుండెల్లో ప్రతిష్టించి.. పట్టం కట్టే విధంగా పది మందికీ పరిచయం చేసిన కళాశిల్పి ఆయన.
‘శంకరాభరణం’లో సోమయాజులును.. ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’.. ‘శుభ సంకల్పం’లలో కమల్ హాసన్‌ను.. ‘సిరివెన్నెల’లో సీతా రామ శాస్తిని.. ‘స్వాతి కిరణం’లో మమ్ముట్టిని.. ‘స్వర్ణకమలం’లో భాను ప్రియని.. ‘శుభలేఖ’, ‘స్వయం కృషి’, ‘ఆపద్భాధవుడు’ సినిమాల్లో చిరంజీవి అంతరంగమున అలలెత్తిన సర్వాంగ సంచలన కేలనని మరిచిపోగలమా??
స్త్రీ అందమంటే కళ్ళు,ముక్కు తీరూ, ముఖ వర్చస్సు, శరీర సౌష్టవం మాత్రమే కాదు.. చూసే చూపులో, మాట తీరులో.. నడకల్లో.. నవ్వుల్లో.. నిలబడే భంగిమల్లో.. హృదయ విశాలత్వంలో, వ్యక్తిత్వంలో ఉంటుందనీ, ఆ అందాన్ని, వ్యక్తిత్వాన్నీ చిత్రాద్దంలో పట్టి చూపించగల సామర్యం విశ్వనాథ్‌కే చెల్లు. అందుకే ‘సాగరసంగమం’లో జయప్రద, ‘స్వర్ణకమలం’లో భానుప్రియ, ‘స్వయం కృషి’లో విజయశాంతి, ‘శుభలేఖ’లో సుమలత ఇలా ఆయన ప్రతి చిత్రంలోనూ నాయికలు ఇతర సినిమాలతో పోల్చలేనంత అందంతో ఆకట్టుకుంటారు.
కేవీ మహదేవన్, ఇళయ రాజా.. లాంటి సినీ సంగీత విద్వాంసులని, వేటూరి.. సిరివెన్నెల లాంటి మహా రచయితల్నీ, వాణీ జయరాం, జానకి, బాలు వంటి గాయనీ గాయకులనీ తమ ఉన్నతోన్నతమైన కళని అందుకునేలా ప్రోత్సహించి, అవకాశం కల్పించింది కె.విశ్వనాథే!
కేవలం సినిమా రంగానికి చెందిన కళాకారులనే కాకుండా, మనదేశంలో వివిధ రంగాలకు చెందిన ఎందరో సుప్రసిద్ద కళాకారులు, సంగీత విద్వాంసులు.. నాట్యకారుల కళా ప్రాభవం విశ్వనాథ్ గారి సినిమాలలో మనకి దర్శనం ఇస్తుంది. సినిమా అంటే సకల కళల సమాహారం అని రుజువు చేస్తుంది.
డ్యాన్సులు.. రొమాన్సులు రాజ్యమేలుతున్న సమయంలో.. సినిమా కళాత్మక కోణాన్ని ఆవిష్కరించిన ఆ మహా దర్శకునికి అభివందనం చేస్తూ, ఆయన కళాదృష్టిని, రస స్పూర్తిని పుణికి పుచ్చుకుని నవ దర్శకులు తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో గౌరవం కలిగిస్తారని, అదే ఆయనకు తెలుగువారిగా మనం అర్పించగల నివాళి అని నేటి దర్శకులు గుర్తిస్తారని, ఆయన పరంపరను కొనసాగించే కనీస ప్రయత్నమైనా చేస్తారని ఆశిస్తూ, అదే ఆయనకు అర్పించగల నివాళిగా భావిస్తూ.. ఆయన పవిత్ర ఆత్మ సద్గతులు చేరాలని ఆకాంక్షిద్దాం.
Also Read: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం