(Source: Poll of Polls)
Mohanlal: నటుడు మోహన్ లాల్‌కు కేరళ హైకోర్టులో చుక్కెదురు!
నటుడు మోహన్ లాల్ గత కొన్నేళ్లుగా ఏనుగు దంతాల కేసులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు మోహన్ లాల్ కు షాకిచ్చింది.
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు కేవలం ఒక్క మలయాళం లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటనతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారాయన. అటు మెయిన్ లీడ్ రోల్స్ చేస్తూనే మరోవైపు కథకు ప్రాధాన్యతనిచ్చే పాత్రల్లోనూ కనిపిస్తూ ఉంటారు. తెలుగులోనూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అయితే గత కొంత కాలంగా ఓ కేసు విషయమై ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య నుంచి బయటపడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదు. గతంలో ఆయన ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. ఆ సమయంలో ఆయన నివాసంలో అలంకరణ కోసం ఏనుగు దంతాలు ఉపయోగించినట్లు గుర్తించారు. దీంతో తర్వాత ఆయనపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి మోహన్ లాల్ కు కేరళ హై కోర్టులో చుక్కెదురైంది.
దాదాపు పదేళ్ల క్రితం నటుడు మోహన్ లాల్ ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల సమయంలోనే ఆయన ఇంట్లో రెండు ఏనుగు దంతాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే దీనిపై ఐటీ అధికారులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఆయన పై వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత దీనిపై కొంతమంది ప్రజాప్రయోజనం నమోదు చేశారు. ఈ కేసు జ్యుడిషియల్ కోర్టు లో నడుస్తుండగానే కేరళ ప్రభుత్వం ఈ కేసును కొట్టివేయాలంటూ కోర్టు కు విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తిని జ్యుడిషియల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో మోహన్ లాల్ హై కోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన పిటిషన్ ను హైకోర్టు సైతం కొట్టివేసింది.
తాను ఏ తప్పు చేయలేదని మోహన్ లాల్ మొదటి నుంచి ఈ కేసులో కోర్టుకు విన్నవించుకుంటూ వస్తున్నారు. తాను చట్టప్రకారమే వాటిని ఇంట్లో పెట్టుకున్నట్లు పేర్కొంటున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మోహన్ లాల్ ఇంట్లో ఉన్న ఏనుగు దంతాలు చనిపోయిన ఏనుగు దంతాలు అని.. కాబట్టి ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టుకు విజ్ఞప్తి చేస్తూ వచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ కేసు ఇలా కొనసాగుతూ వస్తోంది. ఇరు వాదనలు విన్న హైకోర్టు మోహన్ లాల్ పిటిషన్ ను తిరస్కరించింది. అదే ఓ సామన్యుడు ఇంట్లో ఇలా ఏనుగు దంతాలు దొరికితే అప్పుడు కూడా ప్రభుత్వం ఇలాగే వ్యవహరింస్తుందా అని ప్రశ్నించింది. ఈ కేసులో ప్రభుత్వం ఇచ్చిన విజ్ఞప్తిని కూడా పున:పరిశీలించాలని మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది.
దీంతో మోహన్ లాల్ ఏనుగు దంతాల కేసు మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు మాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మోహన్ లాల్ కు సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ ఉంది. అయితే ఈ కేసు వలన ఆయన స్టార్ డమ్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయా అని చర్చ మొదలైంది. అటు సినీ వర్గాలతో పాటు ఇటు మోహన్ లాల్ అభిమానుల్లో కూడా ఈ కేసు పై ఉత్కంఠ మొదలైంది.
Read Alos: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్